Share News

కొత్తగా 1500 కండక్టర్‌ పోస్టుల భర్తీ

ABN , Publish Date - Sep 02 , 2026 | 06:17 AM

టీజీఆర్టీసీలో ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నామని, కొత్తగా 1500 కండక్టర్‌ పోస్టులు భర్తీ చేయనున్నామని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు.

కొత్తగా 1500 కండక్టర్‌ పోస్టుల భర్తీ
ponnam prabhakar

హైదరాబాద్‌, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): టీజీఆర్టీసీలో ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నామని, కొత్తగా 1500 కండక్టర్‌ పోస్టులు భర్తీ చేయనున్నామని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. గతంలో సర్వీసు నుంచి తొలగించిన సుమారు 244 మంది ఉద్యోగులను ప్రత్యేక కమిటీ పరిశీలన అనంతరం తిరిగి విధుల్లోకి తీసుకున్నామని తెలిపారు. విధి నిర్వహణలో మరణించిన ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలను ఆదుకునేందుకు బ్రెడ్‌ విన్నర్స్‌ స్కీమ్‌ కింద 1424 కారుణ్య నియామకాలు చేపట్టి బాధిత కుటుంబాలకు ఉద్యోగ భద్రత కల్పించామని చెప్పారు. విశ్రాంత కార్మికులకు బెనిఫిట్స్‌ బకాయిల్ని త్వరలో అందజేస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆర్టీసీ, రవాణా శాఖలు సాధించిన విజయాలపై మీడియా సమావేశంలో మంత్రి పొన్నం వివరాలు వెల్లడించారు. సంస్థను నష్టాల నుంచి లాభాల బాట పట్టించడంతోపాటు ప్రజలకు రవాణా సౌకర్యాన్ని మరింత సులభతరం చేసేందుకు విప్లవాత్మక మార్పులు తెచ్చామన్నారు.


కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రారంభించామని తెలిపారు. ఇప్పటివరకు 347.36 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం వినియోగించుకున్నారని చెప్పారు. 2932 కొత్త బస్సులను కొనుగోలు చేశామని, ప్రస్తుతం రాష్ట్రంలో 1024 ఎలక్ట్రిక్‌ బస్సులు విజయవంతంగా నడుస్తున్నాయని, హైదరాబాద్‌లో త్వరలో మరో 2200 ఎలక్ట్రిక్‌ బస్సులు రోడ్డెక్కనున్నాయని చెప్పారు. ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. వారం రోజుల్లో సమావేశం నిర్వహించి దీనిపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. బైక్‌ ట్యాక్సీలకు పసుపు(ఎల్లో) నెంబరు ప్లేట్లు ఏర్పాటు చేేస అంశంపై కూడా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో ఎలక్ర్టిక్‌ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు రిజిస్ట్రేషన్‌ ఫీజు, మోటార్‌ వెహికల్‌ ట్యాక్స్‌లో మినహాయింపులు కల్పిస్తున్నామని తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో మహిళలు కొట్లాడుకుంటున్నారని కొందరు తప్పుడు ప్రచారం చేయడం సరైంది కాదని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ఏపీలా ఇబ్బందుల్లేకుండా విలీన ప్రక్రియ

ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని మంత్రి పొన్నం తెలిపారు. ఆ పరిస్థితి తెలంగాణలో ఏర్పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు.

Updated Date - Sep 02 , 2026 | 06:17 AM