Share News

డెల్ టెక్నాలజీస్‌తో TASK కీలక ఒప్పందం: మంత్రి శ్రీధర్‌బాబు

ABN , Publish Date - Sep 19 , 2026 | 06:34 PM

తెలంగాణలో విద్యార్థులకు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలు అందించి ఉద్యోగాలకు సిద్ధం చేసే దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ‘ఉడాన్’ కార్యక్రమం అమలులో భాగంగా TASK, డెల్ టెక్నాలజీస్‌ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.

డెల్ టెక్నాలజీస్‌తో TASK కీలక ఒప్పందం: మంత్రి శ్రీధర్‌బాబు
TASK Dell Technologies MoU

హైదరాబాద్: రాష్ట్రంలోని విద్యార్థులకు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలు అందించడంతో పాటు వారిని ఉద్యోగాలకు సిద్ధం చేసే లక్ష్యంతో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (TASK), డెల్ టెక్నాలజీస్ మధ్య కీలక అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది. ‘ఉడాన్’ కార్యక్రమం అమలులో భాగంగా ఈ భాగస్వామ్యం కొనసాగనుందని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 25 శిక్షణ కేంద్రాల్లో 5,500 మంది విద్యార్థులకు మూడు నెలలపాటు శిక్షణ అందించనున్నట్లు చెప్పారు.

AI, క్లౌడ్ కంప్యూటింగ్‌పై శిక్షణ

‘ఉడాన్’ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్లౌడ్ కంప్యూటింగ్, ఎలక్ట్రానిక్స్ తయారీ, ఎమర్జింగ్ టెక్నాలజీస్, డిజిటల్ స్కిల్స్ వంటి అంశాలపై శిక్షణ ఇస్తామని మంత్రి తెలిపారు. ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించనున్నట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల యువతకు కూడా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందేలా కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు.


చదువు నుంచి ఉద్యోగం దిశగా..

‘ఎడ్యుకేషన్ నుంచి స్కిల్లింగ్.. స్కిల్లింగ్ నుంచి ఉద్యోగాలు’ అనే లక్ష్యంతో ‘ఉడాన్’ కార్యక్రమాన్ని రూపొందించినట్లు శ్రీధర్‌బాబు తెలిపారు. ఉద్యోగ అవకాశాలతో పాటు అప్రెంటిస్‌షిప్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కు కూడా విద్యార్థులకు అవకాశాలు కల్పించడంపై దృష్టి పెడుతున్నామని చెప్పారు. IIT ఢిల్లీ రూపొందించిన కరిక్యులమ్‌తో శిక్షణ అందించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి డెల్ టెక్నాలజీస్ సాంకేతిక సహకారం అందించనుందని తెలిపారు. విద్యార్థులు చదువుకుంటూనే భవిష్యత్ ఉద్యోగాలకు సిద్ధమయ్యేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు మంత్రి పేర్కొన్నారు. ట్రైనింగ్ నుంచి ఎంప్లాయ్‌మెంట్ వరకు పూర్తిస్థాయి ఎకోసిస్టమ్‌ను బలోపేతం చేయడంలో TASK–Dell భాగస్వామ్యం కీలకంగా ఉంటుందని శ్రీధర్‌బాబు తెలిపారు.

Updated Date - Sep 19 , 2026 | 06:36 PM