పల్లె ప్రాంతాలపై పాముకాటు పంజా
ABN , Publish Date - Oct 05 , 2026 | 07:07 AM
గ్రామీణ ప్రాంతాల్లో పాముకాటు అనేది ఓ ఆరోగ్య సమస్య మాత్రమే కాదు.. అది పేద, రైతు కుటుంబాలను ఆర్థికంగా కుంగదీస్తున్న అతిపెద్ద విపత్తు. ఈ విషయం హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) పరిశోధనలో తేలింది.
ప్రాణాలతో పాటు ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ
జూలై నుంచి నవంబర్ మధ్య ఎక్కువ పాముకాట్లు
అక్టోబరులో తీవ్రత ఇంకా ఎక్కువ
ప్రభుత్వ రికార్డులతో పోలిస్తే 6 రెట్లు ఎక్కువ మరణాలు
జగిత్యాల జిల్లా ప్రాతిపదికగా సీసీఎంబీ అధ్యయనం
హైదరాబాద్, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో పాముకాటు అనేది ఓ ఆరోగ్య సమస్య మాత్రమే కాదు.. అది పేద, రైతు కుటుంబాలను ఆర్థికంగా కుంగదీస్తున్న అతిపెద్ద విపత్తు. ఈ విషయం హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) పరిశోధనలో తేలింది. సీసీఎంబీ శాస్త్రవేత్తలు స్వప్నిల్ కిరణ్, సిరిపురం శ్రీనివాస్, కార్తికేయన్ వాసుదేవన్ బృందం చేసిన అధ్యయన నివేదిక అంతర్జాతీయ సైంటిఫిక్ జర్నల్ ‘టాక్సిన్స్’లో ప్రచురితమైంది. జగిత్యాల జిల్లాలోని 205 గ్రామాల్లో 2010 నుంచి 2020 మధ్య కాలంలో పాముకాటుకు గురైన 541 మంది బాధితులు, వారి కుటుంబసభ్యులను ప్రత్యక్షంగా ఇంటర్వ్యూ చేసి ఈ వివరాలను సేకరించారు. వాటి ప్రకారం.. పాముకాటుకు గురైన వారిలో 12.75 శాతం మంది ప్రజలు ప్రాణాలు కోల్పోగా, 24.21 శాతం మంది తీవ్రమైన అనారోగ్యం, దీర్ఘకాలిక వైకల్యం (మూర్ఛ, శారీరక రుగ్మతలు) బారిన పడ్డారు. మిగిలిన 63 శాతం మంది పూర్తిగా కోలుకున్నారు. కాగా, పాముకాటు బాధితుల్లో ఎక్కువగా రైతులు, రైతు కూలీలే (46.40 శాతం) ఉన్నట్లు ఆ అధ్యయనం వెల్లడించింది.
పాముకాటు సంఘటనలు ఎక్కువగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 7 గంటల మధ్య పొలాల్లో పనిచేస్తున్న సమయంలోనే (55.08 శాతం) జరిగాయని, కాళ్లకు పాముకాటు వేయడం (64.33 శాతం) ప్రధానంగా కనిపించిందని పేర్కొంది. పాముకాట్లు ఎక్కువగా వర్షకాలంలో అంటే జూన్ నుంచి నవంబర్ మధ్య సంభవించినట్లు, ముఖ్యంగా అక్టోబరు నెలలో పాముకాట్ల తీవ్రత అత్యధికంగా ఉన్నట్లు పేర్కొంది. పాముకాటుకు గురైన బాధితులు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి ఆర్థికంగా కోలుకోలేని విధంగా నష్టపోయినట్లు తేలింది. ఉచిత వైద్యం అందించే ప్రభుత్వాస్పత్రులు ఉన్నప్పటికీ,
బాధితుల్లో 80.82 శాతం మంది ప్రైవేట్ ఆప్పత్రులను ఆశ్రయించి అధిక వ్యయం చేసినట్లు సీసీఎంబీ అధ్యయనం తెలిపింది. పాముకాటు బాధితుల వైద్య ఖర్చులు, వారికి జరిగే ఉపాధి నష్టంపై కూడా సీసీఎంబీ సైంటిస్టులు స్టడీ చేశారు. పాముకాటుకు గురైన ప్రతీ బాధితుడికి సగటు వైద్య ఖర్చు సుమారు రూ.52,776 కాగా, అనంతరం పనికి వెళ్లకపోవడం వల్ల జరిగే ఉపాధి నష్టం రూ. 26,528 అని అధ్యయనం పేర్కొంది. అలాగే పాముకాటుతో మరణిస్తే బాధిత కుటుంబం కోల్పోయే సగటు ఆదాయం సుమారు రూ 19.83 లక్షలని తెలిపింది. ఏ పాములు ప్రమాదకరమైనవో కూడా అధ్యయనం వెల్లడించింది. కాటు వేసిన పాముల్లో అత్యధికంగా తాచుపాము (46.25 శాతం), పింజరి పాము (39.34 శాతం) ప్రధానంగా ఉన్నట్లు బాధితులు గుర్తించారని తెలిపింది.
ఆస్పత్రి రికార్డులకు.. క్షేత్రస్థాయికి భారీ వ్యత్యాసం!
ప్రభుత్వాస్పత్రి రికార్డుల్లో నమోదయ్యే పాముకాటు మరణాల కంటే క్షేత్రస్థాయి గ్రామీణ సర్వేల్లో నమోదవుతున్న మరణాల సంఖ్య దాదాపు 6 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు సీసీఎంబీ పరిశోధన స్పష్టం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ అనేక మంది మూఢనమ్మకాలతో మంత్రగాళ్లు, నాటు వైద్యుల వద్దకు వెళ్లడం వల్ల సకాలంలో సరైన యాంటీ- వెనమ్ అందక మరణాల సంఖ్య పెరుగుతున్నట్లు వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లో పాముకాటు బారిన పడుతున్న పేద కుటుంబాలను ఆదుకునేందుకు సత్వర నష్టపరిహారం ప్రకటించడంతోపాటు అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని సీసీఎంబీ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
తెలంగాణలో ఖేలో ఇండియా గేమ్స్
పుట్టిన రోజునే నూరేళ్లు నిండాయ్!
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మహబూబాబాద్‌కు చెందిన మహిళ మృతి