20 వేల మెగావాట్లు దాటిన విద్యుత్ వినియోగం
ABN , Publish Date - Nov 04 , 2026 | 05:40 AM
పునరుత్పాదక విద్యుత్ కొనుగోలుపై తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్సీ)లో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు తమ అభిప్రాయాలను వాడీవేడిగా వినిపించారు.
రాష్ట్రానికి భారీగా వస్తున్న పెట్టుబడులకు ఇదే నిదర్శనం
ఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణలో ఎంపీ చామల కిరణ్ రెడ్డి
హైదరాబాద్ సిటీ, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): పునరుత్పాదక విద్యుత్ కొనుగోలుపై తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్సీ)లో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు తమ అభిప్రాయాలను వాడీవేడిగా వినిపించారు. కల్యాణ్ నగర్ టీజీఎస్ కాలనీలో విద్యుత్ నియంత్రణ భవన్ కోర్టు హాల్‌లో టీజీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ దేవరాజు నాగార్జున, సభ్యులు రఘు కంచర్ల, చెరుకూరి శ్రీనివాసరావు ఈ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. రాష్ట్రంలో కరెంట్ కోతలతో 2014కు ముందు రోజులు కనిపిస్తున్నాయని, విద్యుత్ ఉత్పత్తి, సరఫరాలో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు.
అక్టోబరులో విద్యుత్ వినియోగం 20 వేల మెగావాట్లకు చేరిందని, రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయనేదానికి ఇదే నిదర్శనమని ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి అన్నారు. తొమ్మిదినరేళ్లు విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన జగదీశ్ రెడ్డి అవాస్తవాలు మాట్లాడి వె ళ్లిపోయారన్నారు. భద్రాద్రి, యాదాద్రిలో సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడటం వల్లే నిర్మాణ వ్యయం ఎక్కువైందని బీఆర్‌ఎస్‌ను విమర్శించారు. బొగ్గు, నీటి వనరులు లభ్యమయ్యే దగ్గర కట్టలేదన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్‌ను జీ9 బొగ్గు కోసమే కట్టారని, అది విదేశాల్లో మాత్రమే దొరుకుతుందన్నారు.