ఈ పట్టా.. ఉద్యోగం పక్కా
ABN , Publish Date - Mar 10 , 2026 | 04:26 AM
పట్టాలు (డిగ్రీలు) కాదు.. ఉద్యోగాలు కావాలి.. పరిశ్రమలకు సరిపడా నైపుణ్యాలు విద్యార్థులకు అందించాలి.. ..విద్యాశాఖ మంత్రి బాధ్యతలు కూడా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ సమీక్షల్లో నిత్యం చెప్పే.....
బీఏలో డిఫెన్స్, బీబీఏలో ట్రావెల్ టూరిజం
బీకాంలో ఫిన్ టెక్, ఎమ్మేలో మ్యారిటైమ్ టెక్నాలజీ
బీఎస్సీ, ఎమ్మెస్సీలో ఏఐ, డేటాసైన్స్
కొత్తగా జాబ్ గ్యారంటీ కోర్సులు
ఏరోస్పేస్, ఆరోగ్య సంరక్షణ, గ్రామీణాభివృద్ధి తదితర రంగాలకు సంబంధించినవి కూడా!
వచ్చే విద్యా సంవత్సరం నుంచి కోర్సులు ప్రారంభం
హైదరాబాద్, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): ‘‘పట్టాలు (డిగ్రీలు) కాదు.. ఉద్యోగాలు కావాలి.. పరిశ్రమలకు సరిపడా నైపుణ్యాలు విద్యార్థులకు అందించాలి..’’ ..విద్యాశాఖ మంత్రి బాధ్యతలు కూడా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ సమీక్షల్లో నిత్యం చెప్పే మాటలివి. ఆ దిశగా పాఠ్యాంశాలు, కొత్త కోర్సులు ఉండాలని సీఎం పదే పదే అంటుంటారు. ఈ మేరకు విద్యార్థులకు యూజీ, పీజీ పట్టాలతోపాటే ఉద్యోగ నియామక పత్రం కూడా అందించడమే లక్ష్యంగా తెలంగాణ ఉన్నత విద్యామండలి పలు కోర్సులకు రూపకల్పన చేసింది. ఇప్పటివరకు కేవలం బీఈ, బీటెక్‌కే పరిమితమైన ఏఐ, డేటా సైన్స్ కోర్సులను బీఎస్సీ, ఎమ్మెస్సీలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. మరో నాలుగు నెలల్లో ప్రారంభం కానున్న 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఈ కోర్సులు అమల్లోకి రానున్నాయి. బీఏ, బీకాం, ఎంఎ, ఎంకాం, బీఎస్సీ, ఎమ్మెస్సీ, బీబీఎ, ఎంబీఎలో ప్రస్తుతం ఉన్న కోర్సులకు అదనంగా వీటిని చేర్చారు.
ఒకటే లక్ష్యం..
రాష్ట్రంలోని పరిశ్రమల్లో ఉన్న ఉద్యోగ అవకాశాలు రాష్ట్ర యువతకు అందించే ఉద్దేశంతో ఈ కొత్త కోర్సులకు రూపకల్పన చేశారు. సీఐఐ, ఫిక్కీ, ఆసోచామ్ లాంటి పారిశ్రామిక సంఘాల ప్రతినిధులను సంప్రదించి.. పరిశ్రమలకు ఎలాంటి నైపుణ్యాలున్న ఉద్యోగులు అవసరమో తెలుసుకుని తెలుసుకుని వీటిని ఖరారు చేశారు. కృత్రిమ మేధ(ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా సైన్స్ కోర్సులకు భారీ డిమాండ్ ఉన్నందున వీటిని మూడేళ్ల బీఎస్సీ, రెండేళ్ల ఎమ్మెస్సీలోనూ ప్రవేశపెట్టనున్నారు. అలాగే పర్యావరణ రంగ ప్రాధాన్యం పెరుగుతున్నందున బీఎస్సీ/ఎమ్మెస్సీ క్లైమేట్ సైన్స్ - ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ కోర్సు సిద్ధం చేశారు. ఇక.. బీఎస్సీ/ఎంబిఎ/ఎమ్మెస్సీలో సైబర్ సెక్యూరిటీ, బయో టెక్నాలజీ, రోబోటిక్స్ కోర్సులు ప్రవేశపెట్టారు. కరోనా సమయం నుంచి యూపీఐ చెల్లింపులు లెక్కకుమిక్కిలిగా పెరిగిన సంగతి తెలిసిందే. అలాగే, బ్యాంకింగ్‌లోనూ అనేక అవకాశాలు ఏర్పడ్డాయి. ఈ రంగాల్లో ప్రావీణ్యం సాధించేందుకు బీఎం/ఎంకాంలో ఫిన్ టెక్ కోర్సు అందుబాటులోకి రానుంది. అలాగే బీఏ, ఎమ్మేలో ఆరు కొత్త కోర్సులు సిద్ధం చేశారు. ఇందులో బీఏ/ఎంఎ మ్యారిటైమ్ టెక్నాలజీ- కామర్స్- మేనేజ్‌మెంట్, బీఎ/ఎమ్మే ల్యాండ్ అగ్రికల్చర్-రూరల్ డెవల్‌పమెంట్ ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో కొత్తగా విమానాశ్రయాలు ఏర్పాటు అవుతున్నాయి. ఇప్పటికే ఉన్న శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోనూ కొత్త అవకాశాలు ఏర్పడుతున్నాయి. వీటిలో ఉద్యోగాల కోసం బీఏ/ఎంఎ ఏయిర్‌పోర్టు, ఏయిర్‌లైన్, ఏయిర్‌స్పేస్, ఏయిర్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ కోర్సులు సిద్ధం చేశారు. రక్షణ, పర్యాటక, ఆసుపత్రుల నిర్వహణ రంగంలో ఉన్న అపార అవకాశాల కోసం బీఏ/ఎంఎ డిఫెన్స్, సెక్యూరిటీ స్టడీస్, బీఏ/ఎంఎ ట్రావెల్-టూరిజం-హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్, బీఏ/ఎంఎ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్-హెల్త్ మేనేజ్‌మెంట్ కోర్సులు ఉన్నాయి.

సీఎం సూచనల మేరకే..
విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇప్పటికే ఐటీఐ, పాలిటెక్నిక్ విద్యలో అనేక సంస్కరణలు చేసింది. అలాగే.. ఉన్నత విద్యలోనూ సీఎం ఆదేశాలకు అనుగుణంగా కొత్త కోర్సులు సిద్ధం చేశాం. ముఖ్యంగా కొత్త ఏయిర్‌పోర్టులు రానున్నందున విమానయాన రంగంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు రానున్నాయి. డిఫెన్స్, ఏరోస్పేస్, టూరిజం, హాస్పిటాలిటీ రంగాల్లోనూ భారీగా అవకాశాలున్నాయి. వీటిన్నింటినీ అధ్యయనం చేసి యూజీ, పీజీ కోర్సులు రూపొందించాం. కోర్సు పూర్తయిన వెంటనే ఉద్యోగాలు కల్పించడం ప్రభుత్వ లక్ష్యం.
- ఆచార్య బాలకిష్టా రెడ్డి, అధ్యక్షుడు, తెలంగాణ ఉన్నత విద్యామండలి