గురుకులాల్లో ‘గౌరవ’ దోపిడీ
ABN , Publish Date - Mar 09 , 2026 | 04:17 AM
పేద పిల్లలకు నాణ్యమైన విద్యనందించాల్సిన తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీ (టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్) ఉన్నతాధికారుల దోపిడీకి అడ్డాగా మారింది.
టీజీ సెట్ పరీక్ష రుసుములో వాటాల పందేరం
సెక్రటరీ నుంచి కింది దాకా రూ.లక్షల్లో స్వాహా
పదేళ్లకుపైగా సాగుతున్న అక్రమాల పరంపర
ఎస్సీ గురుకుల ప్రధాన కార్యాలయంలో అవినీతి బాగోతం
హైదరాబాద్, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): పేద పిల్లలకు నాణ్యమైన విద్యనందించాల్సిన తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీ (టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్) ఉన్నతాధికారుల దోపిడీకి అడ్డాగా మారింది. నిబంధనల ప్రకార విధి నిర్వహణలో భాగంగా చేసే పనికి అదనపు వేతనాలు తీసుకోకూడదనే ప్రాథమిక సూత్రాన్ని కొందరు ఐఏఎస్ అధికారులు గాలికొదిలేశారు. ప్రభుత్వ ఉత్తర్వులు లేకపోయినా అధికారులంతా కుమ్మక్కై పేద పిల్లలు చెల్లించే ప్రవేశ పరీక్ష ఫీజులను ‘గౌరవ’ వేతనం పేరుతో అక్రమంగా పంచుకుంటున్నారు. ఐఏఎస్ అధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు అదనపు పని పేరుతో రూ.లక్షలు ఖాతాల్లో వేసుకోవడం విస్మయాన్ని కలిగిస్తోంది. గడిచిన పదేళ్లకు పైగా ఈ గౌరవ వేతనాల దందా నిరాటంకంగా సాగుతున్నా.. ఏ ఆడిట్‌లోనూ బయటకు రాకపోవడం విచిత్రం. హైదరాబాద్‌లోని ఎస్సీ గురుకుల ప్రధాన కార్యాలయంలో సాగుతుందీ అక్రమాల పర్వం. రాష్ట్రంలోని టీజీఎ్‌సడబ్ల్యూఆర్‌ఈఐఎస్, టీజీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్, టీఆర్‌ఈఐఎస్, ఎంజీపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎ్‌సలలో 5వ తరగతిలో ప్రవేశంతోపాటు 6 నుంచి 9వ తరగతిలో ఖాళీలను నింపడానికి ఏటా టీజీసెట్ ప్రవేశ పరీక్షను సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ నిర్వహిస్తుంది. పరీక్ష రాయడానికి ప్రతి విద్యార్థి రూ.100 చెల్లిస్తారు. ఏటా దాదాపు 2 లక్షల మంది విద్యార్థుల నుంచి సుమారు రూ.2కోట్ల వరకు పరీక్ష రుసుం వసూలవుతుంది. ఇలా సమకూరిన డబ్బును పరీక్ష నిర్వహణకు వాడుకోగా.. మిగిలిన సొమ్మును విద్యార్థుల సంక్షేమానికి ఉపయోగించుకోవాల్సి ఉంది. కానీ, పరీక్ష నిర్వహిస్తున్నాం కదా అని మిగిలిన డబ్బులను ఎస్సీ గురుకుల సొసైటీ ప్రధాన కార్యాలయంలోని ఐఏఎస్ స్థాయి అధికారి సెక్రటరీ(పరీక్షలకు చీఫ్ కన్వీనర్) నుంచి లైబ్రేరియన్ వరకు పంపకాలు చేసుకుంటున్నారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణలో భాగంగా చేసే పనికి అదనపు జీతాలు తీసుకోకూడదు. కానీ, గురుకులాల ప్రధాన కార్యాలయంలో మాత్రం అకడమిక్ సెక్షన్ సిబ్బంది, పాఠశాలల నుంచి డిప్యుటేషన్‌పై వచ్చిన సిబ్బంది ‘తమ రెగ్యులర్ విధులకు ఆటంకం కలగకుండా, కార్యాలయ పనివేళల తర్వాత కూడా రాత్రి సమయాల్లోనూ, సాధారణ సెలవు దినాల్లోనూ ఈ పరీక్ష కోసం కష్టపడ్డాం’ అనే సాకులతో పరీక్షల ఫీజుల రూపంలో వచ్చిన ప్రజాధనాన్ని పంచుకుంటున్నారు. రాష్ట్రంలోని వివిధ సంక్షేమ గురుకుల సొసైటీల సమన్వయంతో నిర్వహించిన ఈ భారీ ప్రక్రియను విజయవంతం చేసినందుకు ఈ గౌరవ వేతనాన్ని నిర్ణయించుకోవడం చర్చనీయాంశమైంది. అయితే, ఈ విధానం సరైంది కాదని గతేడాది ఓ సెక్రటరీ పంపకాలను ఆపేశారు. ఆ అధికారి బదిలీ అయ్యాక మళ్లీ పంపకాలను పూర్తిచేశారు.
ఏడేళ్లలో భారీగా పెరిగిన పంపకాలు..
పరీక్ష ఫీజు రూపంలో వచ్చిన డబ్బులో ఎంత మిగిలితే అంత మొత్తాన్ని వాటాలుగా పంచుకుంటున్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి నిర్వహించిన టీజీ సెట్ పరీక్ష కోసం అకడమిక్, ఫైనాన్స్ సెక్షన్ సిబ్బంది ఏకంగా రూ.11.90లక్షలు పంచుకున్నారు. ఒక్క రోజు నిర్వహించే ఈ పరీక్షకు ఐఏఎస్ అధికారి అయిన చీఫ్ కన్వీనర్/సెక్రటరీ ఏకంగా రూ.2.15లక్షలు అదనపు వేతనంగా మంజూరు చేసుకున్నారు. విచిత్రమేంటంటే బదిలీపై వెళ్లిన మరో ఐఏఎస్ అధికారి(మాజీ చీఫ్ కన్వీనర్)కి కూడా రూ.1.25లక్షలు ముట్టజెప్పారు. ఈ పరీక్ష ఫిబ్రవరి 11(2024)న నిర్వహించగా.. ఆ అధికారి 5నే బదిలీపై వెళ్లారు. అదే రోజున కొత్త సెక్రటరీగా విధుల్లోకి చేరిన ఐఏఎస్ అధికారి, బదిలీపై వెళ్లిన మరో ఐఏఎస్ అధికారి ఒకే పరీక్షకు ఒకరు చీఫ్ కన్వీనర్‌గా, మరొకరు మాజీ చీఫ్ కన్వీనర్‌గా వ్యవహరించారని చూపుతూ ఏకంగా రూ.3.40లక్షలు తీసుకున్నారు. కన్వీనర్‌కు రూ.1.85లక్షలు, జాయింట్ సెక్రటరీ రూ.1.54లక్షలు, అసిస్టెంట్ సెక్రటరీ రూ.1.22 లక్షలు, సూపరింటెండెంట్ రూ.1.22లక్షలు ఇలా ఆ కార్యాలయం నుంచి 14 మందికి కలిపి రూ.11.90 లక్షలు ఖాతాల్లో వేసుకున్నారు. 2022-23 విద్యా సంవత్సరానికి గాను.. చీఫ్ కన్వీనర్ ఖాతాలో రూ.2లక్షలు, కన్వీనర్‌కు రూ.1.75లక్షలు, జాయింట్ సెక్రటరీ రూ.1.30లక్షలు, డిప్యూటీ సెక్రటరీ రూ.1.35లక్షలు, అసిస్టెంట్ సెక్రటరీ రూ.1.20లక్షలు, సూపరింటెండెంట్ రూ.1.20లక్షలతో కలిపి ఆ ఏడాది 15 మందికి రూ.12.25 లక్షలు వాటా దక్కింది. 2021-22లో టీజీ సెట్ కోసం రూ.7.95 లక్షలు ఖర్చుచేయగా.. అందులో చీఫ్ కన్వీనర్ రూ.1.25లక్షలు, జాయింట్ సెక్రటరీ రూ.1.25లక్షలు, అసిస్టెంట్ సెక్రటరీ, సూపరింటెండెంట్ చెరో రూ.1.20లక్షల చొప్పున తీసుకున్నారు. 2019-20లో రూ.10.98లక్షలు, 2017-18లో రూ.4.50లక్షలు పంచుకున్నారు. ఏటా ఈ పంపకాల మొత్తం పెరుగుతోంది. 2017-18లో సెక్రటరీ రూ.75వేలు తీసుకోగా 2024-25కు వచ్చేసరికి ఆ మొత్తాన్ని రూ.2.15లక్షలకు పెంచడం విశేషం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ అక్రమ వసూళ్లు మూడు రెట్లకుపైగా పెరగడం గమనార్హం. విద్యార్థుల ఫీజుల సొమ్మును వారి సంక్షేమం కోసం వాడకుండా అధికారులు పంచుకోవడం ఏంటనే విమర్శలు వస్తున్నాయి. సెక్రటరీ స్థాయి వ్యక్తులే తమ పేరు మీద రూ.లక్షల చెక్కులు రాసుకుంటుంటే.. ఇక అడిగే వారెవరని కింది స్థాయి సిబ్బంది చర్చించుకుంటున్నారు. పదేళ్లకుపైగా సాగుతున్న ఈ దోపిడీపై సమగ్ర విచారణ జరిపి, అక్రమంగా తీసుకున్న సొమ్మును రికవరీ చేయాలని విద్యావేత్తలు డిమాండ్ చేస్తున్నారు.