1.83లక్షలు ఇంజినీరింగ్ గరిష్ఠ ఫీజు ఇదీ..
ABN , Publish Date - Mar 06 , 2026 | 03:50 AM
ఇంజినీరింగ్ కాలేజీల ట్యూషన్ ఫీజు ఎట్టకేలకు ఖరారైంది. 2025-26 నుంచి 2027-28 విద్యాసంవత్సరం ఫీజులను ప్రభుత్వం ఖరారుచేసింది. కిందటి సంవత్సరంతో.....
69 కాలేజీలకు పెంపు.. 19 కాలేజీలకు తగ్గింపు.. 70 కళాశాలలకు గత ఏడాది ఫీజులే
35 కాలేజీల్లో ఫీజు రూ.లక్షకు పైగానే!.. 92 కాలేజీల్లో రూ.50 వేల నుంచి లక్షలోపు
33 కళాశాలల్లో రూ.50 వేలలోపే.. కొత్త ఫీజులపై రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు
హైదరాబాద్, మార్చి 5(ఆంధ్రజ్యోతి): ఇంజినీరింగ్ కాలేజీల ట్యూషన్ ఫీజు ఎట్టకేలకు ఖరారైంది. 2025-26 నుంచి 2027-28 విద్యాసంవత్సరం ఫీజులను ప్రభుత్వం ఖరారుచేసింది. కిందటి సంవత్సరంతో పోలిస్తే ఈసారి 69 కాలేజీల ఫీజులు రూ.50 వేల నుంచి రూ.62 వేల మేర పెరిగాయి. 70 కళాశాలల్లో.. పాత ఫీజులనే కొనసాగించారు. 19 కాలేజీల్లో.. ఫీజులను రూ.3,500 నుంచి రూ.45 వేల దాకా తగ్గించారు. దీంతో, మొత్తం 35 కాలేజీల్లో ఫీజు రూ.లక్షపైన ఉండగా, రూ.50 వేల లోపు ఫీజున్న కళాశాలలు 33 ఉన్నాయి. 92 కాలేజీల్లో ఫీజు రూ.50 వేల నుంచి లక్ష లోపు ఉంది. ప్రతి మూడేళ్లకొకసారి ఈ ఫీజులపై తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) సమీక్ష జరిపి నిర్ణయం తీసుకుంటుంది. చివరిసారిగా 2022-23లో ఫీజులు నిర్ణయించారు. కొత్త ఫీజులను నిరుడే నిర్ణయించాల్సి ఉన్నప్పటికీ.. ఈ ఏడాదికి వాయిదా వేశారు. అందుకే.. ఇప్పుడు ప్రకటించిన ఈ కొత్త ఫీజులు గత విద్యా సంవత్సరానికి కూడా అమలు కానున్నాయి. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 160 ఇంజినీరింగ్ కాలేజీలున్నాయి. ఇందులో హైదరాబాద్, శివారు ప్రాంతాల్లోని కాలేజీల్లో అత్యధిక ఫీజులున్నాయి. గండిపేటలోని సీబీఐటీలో గరిష్ఠంగా రూ.1.65 లక్షలుగా ఉన్న ఫీజును మరో రూ.18 వేల మేర పెంచడంతో రూ.1.83 లక్షలకు చేరింది. రాష్ట్రంలో ఇదే అత్యధికం. ఆ తర్వాతి స్థానాల్లో వాసవి (రూ.1.75 లక్షలు), ఎంజీఐటీ (రూ.1.67 లక్షలు), సీవీఆర్ (రూ.1.63 లక్షలు), జి.నారాయణమ్మ (రూ.1.62 లక్షలు), గోకరాజు రంగరాజు (రూ.1.60 లక్షలు) కళాశాలలున్నాయి. ఈసారి ఫీజులు ఎక్కువగా పెరిగిన కాలేజీల్లో హైదరాబాద్ షేక్‌పేటలోని జి.నారాయణమ్మ మహిళా ఇంజినీరింగ్ కాలేజీ ఉంది. ఈ కాలేజీ ఫీజు 2019లో రూ.1.22 లక్షలు ఉండగా, 2022లో రూ.22వేలు తగ్గించి రూ.లక్షగా ఖరారు చేశారు. ఈసారి అత్యధికంగా రూ.62 వేలు పెంచడం గమనార్హం.
ఆ 19 కాలేజీల్లో అతి తక్కువగా..
రాష్ట్రవ్యాప్తంగా గరిష్ఠ ఫీజు రూ. 1.83 లక్షలుగా ఉండగా, కనిష్ఠ ఫీజు రూ. 45వేలుగా ఉంది. మొత్తం 19 కాలేజీల్లో ఫీజులు 45 వేలుగా ఉన్నాయి. ఈ కాలేజీల్లో కనిష్ఠంగా రూ. 3,500 నుంచి గరిష్ఠంగా రూ.45 వేల దాకా తగ్గించారు. ఫీజు తగ్గించిన కాలేజీలన్నీ హైదరాబాద్ శివారులోనివే కావడం విశేషం. ఇక్కడ కాలేజీల్లో కనీస వసతులు లేకపోవడంతో తగ్గించామని అధికారవర్గాలు తెలిపాయి. 70 కాలేజీల్లో.. ప్రస్తుతం ఉన్న ఫీజులనే కొనసాగించారు. ప్రభుత్వ నిర్ణయంపై ఈ కాలేజీల యజమాన్యాలన్నీ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. అన్నిరకాల వసతులు, సౌకర్యాలు ఉన్నప్పటికీ ఫీజులు పెంచలేదని.. దీనిపై కోర్టును ఆశ్రయిస్తామని ఘట్‌కేసర్‌లోని ఓ కాలేజీ తెలిపింది.