పాస్ మార్కు.. 45శాతం
ABN , Publish Date - Feb 27 , 2026 | 05:01 AM
విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కనీస ఉత్తీర్ణత మార్కులను 35 నుంచి 45 శాతానికి పెంచాలి! 11వ తరగతిలో బోర్డు పరీక్షను రద్దు చేయాలి! ఎప్‌సెట్ పరీక్షను రద్దు చేసి..
ఉన్నత విద్యా సంస్థల్లో 50 శాతం
11వ తరగతి బోర్డు పరీక్ష రద్దు చేయాలి
ఎప్‌సెట్ పరీక్ష కూడా వద్దు.. ఇంటర్ మార్కుల ఆధారంగా ఇంజనీరింగ్, ఫార్మసీ, వెటర్నరీ ప్రవేశాలు
నర్సరీ నుంచే విద్యా హక్కు చట్టం అమలు చేయాలి
టీచర్లకు ఆటోమేటిక్ పదోన్నతుల విధానం వద్దు
ఉపాధ్యాయుల పనితీరుపై ఐదేళ్లకోసారి సమీక్ష.. ఫెయిలైతే సర్వీసు నుంచి డిస్మిస్
నర్సరీ-పీజీ వరకూ ఇంగ్లిష్ మీడియం తప్పనిసరి
ఐఐటీ, జేఈఈ, నీట్ కోచింగ్ కేంద్రాలకు చట్టం
ఎయిడెడ్ స్కూళ్లు, కాలేజీలు రద్దు చేసి సర్కారులో విలీనం చేయాలి.. విద్యా కమిషన్ సిఫారసులు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నివేదిక అందజేత
హైదరాబాద్, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కనీస ఉత్తీర్ణత మార్కులను 35 నుంచి 45 శాతానికి పెంచాలి! 11వ తరగతిలో బోర్డు పరీక్షను రద్దు చేయాలి! ఎప్‌సెట్ పరీక్షను రద్దు చేసి.. ఇంటర్ మార్కుల ఆధారంగానే ఇంజనీరింగ్, ఫార్మసీ, వెటర్నరీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించాలి! ఉపాధ్యాయులకు ఆటోమేటిక్ పదోన్నతులు వద్దు. ఐదేళ్లకోసారి పనితీరు అంచనా వేయాలి. అది మెరుగ్గా ఉంటేనే పదోన్నతి. లేకపోతే డిస్మిస్! నర్సరీ నుంచే అంటే మూడేళ్ల వయసు నుంచే విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలి!.. విద్యా శాఖలో సంస్కరణలు తీసుకు రావడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యా కమిషన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేసిన నివేదికలోని కొన్ని ముఖ్య అంశాలివి. కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు పీఎల్ విశ్వేశ్వర్ రావు, చారకొండ వెంకటేష్, జ్యోత్స్న శివారెడ్డి గురువారం సీఎంను కలిసి తెలంగాణ విద్యా విఽధానంపై తాము రూపొందించిన నివేదికను సీఎం రేవంత్‌కు సమర్పించారు. అమెరికా, వియత్నాం, మలేసియా దేశాల్లో పర్యటించడంతోపాటు వివిధ దేశాలు, రాష్ట్రాల్లో అత్యుత్తమ విధానాలను పరిశీలించి నివేదిక రూపొందించినట్లు వివరించారు. గత 14 నెలల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో పర్యటించి బడుల నుంచి ఇంజినీరింగ్ కాలేజీల వరకు అన్ని విద్యా సంస్థలను పరిశీలించి, తల్లిదండ్రులతో సమావేశమైన అనంతరం నివేదిక రూపొందించామని ఆకునూరి మురళి తెలిపారు. ‘‘ప్రభుత్వ బడుల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థి 5వ తరగతి పుస్తకంలోని పాఠాలు చూసి కూడా చదవలేకపోతున్నాడు.
1920 ప్రభుత్వ బడుల్లో ఒక్క విద్యార్థి కూడా లేడు. 36 శాతం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో టీచర్ ఒక్కరే.. యూనివర్సిటీల్లో 80 శాతం బోధనా సిబ్బంది పోస్టులు ఖాళీ. 86 శాతం కాలేజీలకు న్యాక్ గ్రేడ్ లేదు. ఇలా విద్యారంగం అద్వానంగా ఉంది. ఉద్యోగాలకు సరిపడే చదువులకు దూరంగా బోధన కొనసాగుతోంది. విద్యా శాఖలో వెంటనే సంస్కరణలు అమలు చేయాలి’’ అని సీఎం రేవంత్ రెడ్డిని కమిషన్ కోరింది. నివేదికలోని ఒక్కో అంశంపై చైర్మన్ మురళి సుదీర్ఘంగా వివరించారు. శ్రద్ధగా విన్న సీఎం.. ఆయా అంశాలపై పలు సూచనలు చేశారు. చట్టబద్ధత కల్పించాల్సిన అంశాలు, వచ్చే ఏడాది నుంచి అమలు చేయదగిన వాటిపై నివేదిక రూపొందించే బాధ్యతను ప్రభుత్వ సలహాదారు కేశవరావు నేతృత్వంలోని కమిటీకి అప్పగించారు. నివేదికలోని అనేక అంశాలపై సీఎం సానుకూలంగా స్పందించారని ఆ తర్వాత మీడియా సమావేశంలో మురళి తెలిపారు.
నివేదికలోని కీలక అంశాలివే..!
ఉపాధ్యాయులకు ఆటోమేటిక్ పదోన్నతులు ఉండకూడదు. వారి పనితీరు ఆధారంగానే ప్రమోషన్లు ఉండాలి. ఉపాధ్యాయుల పనితీరును ఐదేళ్లకోసారి అంచనా వేయాలి. దాని ఆధారంగా ఆ ఉపాధ్యాయునికి నివేదిక అందజేయాలి. పనితీరు మెరుగుపర్చుకోవడానికి రెండేళ్లు సమయం ఇవ్వాలి. అప్పటికీ తీరు మెరుగుపడకపోతే సర్వీసు నుంచి డిస్మిస్ చేయాలి. పనితీరు మెరుగ్గా ఉంటేనే ప్రమోషన్లు ఇవ్వాలి. ఇక నుంచి నియమించే ప్రతి ఉపాధ్యాయుడికి దీనిని అమలుచేయాలి. బీఎడ్‌ను పునర్‌వ్యవస్థీకరించాలి. నర్సరీ నుంచి ఐదో తరగతి వరకు ప్రైమరీ బీఎడ్, 6-12వ తరగతి వరకు సెకండరీ బీఎడ్ ప్రవేశపెట్టాలి. డిప్లమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ రద్దు చేయాలి.
అన్ని పాఠశాలల్లో త్రిభాషా సూత్రం అమలు చేయాలి. తెలుగు/ఉర్దూ, ఇంగ్లిష్, హిందీ బోధించాలి. నర్సరీ నుంచి యూనివర్సిటీ వరకు బోధనా మాధ్యమం ఇంగ్లిష్ ఉండాలి. అన్ని ప్రాథమిక పాఠశాలల్లో నర్సరీ, యూకేజీ, ఎల్‌కేజీ ప్రవేశపెట్టాలి. పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు, సిబ్బంది నియామకం, వసతుల కల్పన, పర్యవేక్షణకు పాఠశాల జిల్లాలను ఏర్పాటు చేయాలి. మధ్యాహ్న భోజనానికి ప్రతి వారం చెల్లింపులు చేయాలి. అంచనాలు, చెల్లింపులకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్ రూపొందించాలి. ఐఐటీ, జేఈఈ, నీట్ కోచింగ్ సెంటర్లు, హాస్టళ్ల నియంత్రణకు ప్రత్యేక చట్టం చేయాలి. వాటికి ప్రత్యేక అనుమతులు తప్పనిసరి చేయాలి.
పది, 11, 12వ తరగతుల్లో వరుసగా మూడేళ్లు బోర్డు పరీక్షలతో విద్యార్థులపై తీవ్రమైన ఒత్తిడి ఉంది. అందుకే, 11వ తరగతిలో బోర్డు పరీక్షను రద్దు చేయాలి. అలాగే, ఎప్‌సెట్ పరీక్షను కూడా రద్దు చేసి ఇంటర్ మార్కుల ఆధారంగానే ఇంజినీరింగ్, ఫార్మసీ, వెటర్నరీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించాలి. పాఠశాల విద్యా శాఖ, ఇంటర్ బోర్డులను రద్దు చేయాలి. ఒకే బోర్డుగా విలీనం చేయాలి.
విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కనీస ఉత్తీర్ణత మార్కులను పాఠశాల స్థాయిలో 35 నుంచి 45 శాతానికి; ఉన్నత విద్యా సంస్థల్లో 35 శాతం నుంచి 50 శాతానికి పెంచాలి. విశ్వవిద్యాలయాల కార్యనిర్వాహక మండలిని పునర్నిర్మించాలి. చైర్మన్‌గా వీసీ ఉండాలి. వైస్ చాన్సలర్ నియామకానికి మాజీ సీఎస్, ముగ్గురు రిటైర్డ్ వీసీలతో సెర్చ్ కమిటీ నియమించి ఎంపికను పారదర్శకంగా చేపట్టాలి. వర్సిటీల్లో సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేయాలి. డిమాండ్ ఉన్న కోర్సులను రెగ్యులర్‌గా మార్చాలి. లింగ్డో కమిటీ సిఫార్సుల మేరకు విద్యార్థుల ఎన్నికలు నిర్వహించాలి. అన్ని జిల్లాల్లో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు అనుబంధంగా వసతి గృహం ఏర్పాటు చేయాలి.
ఎయిడెడ్ పాఠశాలలు, కాలేజీలు వ్యాపార కేంద్రాలుగా మారాయి. వాటిని రద్దు చేసి ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలి. పాలిటెక్నిక్, ఐటీఐలతో ఉద్యోగాలు పొందే వారి సంఖ్య తక్కువగా ఉంది. ఆ కోర్సులు పూర్తవగానే ఉద్యోగం లభించేలా వీటిని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి అనుబంధంగా మార్చాలి. జాతీయ విద్యా విధానంలో కొన్ని మంచి నిర్ణయాలు కూడా ఉన్నాయి. వాటిని అమలు చేయాలి. విద్యా హక్కు చట్టం ప్రస్తుతం 6-14 చిన్నారులకు అమల్లో ఉంది. దీనిని 3-18 ఏళ్ల వయస్కులకు అమలు చేయాలి. అన్ని రెసిడెన్షియల్ కాలేజీల విద్యా సంస్థలను ఒకే సంస్థగా చేయాలి. ఇందుకు తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీగా ఏకీకరించాలి. గిరిజన సంక్షేమ శాఖ కింద 1-5 తరగతులు నడుపుతున్న మినీ గురుకులాలలను రద్దు చేయాలి.
ఆరుట్ల.. ఆదర్శం
రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో గతేడాది ఏర్పాటు చేసిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ విధానం ఘన విజయం సాధించిందని ఆకునూరి మురళి ముఖ్యమంత్రికి తెలిపారు. ‘‘రెండు అంగన్‌వాడీలతోపాటు సమీపంలోని 4 ప్రభుత్వ పాఠశాలలన్నీ కలిపి ఐదున్నర ఎకరాల్లో దీనిని ఏర్పాటు చేశారు. నర్సరీ, యూకేజీ, ఎల్‌కేజీ కూడా ఉన్నాయి. కొత్త భవనంలో అన్ని వసతులు ఏర్పాటు చేసి సిబ్బందిని నియమించడంతో ప్రవేశాలు 150 శాతం పెరిగాయి. విద్యార్థుల సంఖ్య 640 నుంచి 1605కి పెరిగింది. వీరిలో 694 మంది ప్రైవేటు పాఠశాలల నుంచి వచ్చారు’’ అని సీఎంకు వివరించారు. అన్ని వసతులూ ఉన్నందున విద్యార్థుల్లో నాణ్యతా ప్రమాణాలు కూడా పెరిగాయని చెప్పారు. దాంతో, ఇదే తరహాలో రాష్ట్రవ్యాప్తంగా 100 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.