తెలంగాణకు బీసీ సీఎం ఖాయం
ABN , Publish Date - Oct 05 , 2026 | 07:03 AM
తెలంగాణకు బీసీ నేత ముఖ్యమంత్రి కావడం ఖాయమని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌గౌడ్ అన్నారు. రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి అవుతారన్న ధైర్యాన్ని ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్రలో కల్పించారన్నారు.
బీసీలకు రాహుల్, రేవంత్, భట్టి మద్దతు
అన్ని వర్గాల సహకారంతో బీసీలకు దక్కాల్సిన వాటా తీసుకుంటాం
బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపితే పట్టించుకోలేదు
మోదీ నమ్మకద్రోహి..కేసీఆర్ బీసీ వ్యతిరేకి
ఓబీసీ సింహగర్జనలో మహేశ్ గౌడ్
రంగారెడ్డి అర్బన్, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): తెలంగాణకు బీసీ నేత ముఖ్యమంత్రి కావడం ఖాయమని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌గౌడ్ అన్నారు. రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి అవుతారన్న ధైర్యాన్ని ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్రలో కల్పించారన్నారు. అగ్రవర్ణాలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల మద్దతుతో బీసీలకు దక్కాల్సిన వాటాను తీసుకుంటామని, అవసరమైతే తమ హక్కుగా పోరాడి లాక్కుంటామని స్పష్టం చేశారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో టీపీసీసీ ఓబీసీ విభాగం ఆధ్వర్యంలో సింహగర్జన సభను నిర్వహించారు. ఈ సందర్భంగా మహేశ్ గౌడ్ మాట్లాడుతూ.. బీసీలకు రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మద్దతు ఉంటుందని, వారి సహకారంతో రాష్ట్రంలో బీసీ నేత సీఎం అవుతారని తెలిపారు.
పీవీ నర్సింహారావు, మర్రి చెన్నారెడ్డి మాదిరిగా రేవంత్ బీసీలకు మద్దతు పలికారని, అసెంబ్లీలో బీసీలకు కల్పించాల్సిన రిజర్వేషన్లపై చర్చించి తీర్మానాన్ని కేంద్రానికి పంపారని గుర్తు చేశారు. తెలంగాణ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని కేంద్రంతో ఆమోదింపజేసేందుకు రాష్ట్రం నుంచి గెలిచి న బీజేపీ దద్దమ్మలు కృషి చేయలేదని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్ల అంశంలో యావత్ దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని, ప్రధాని మోదీ చేపట్టిన కులగణన తూతూ మంత్రంగా చేపడుతున్నారని విమర్శించారు. ఓబీసీ అని చెప్పుకొనే మోదీ నమ్మకద్రోహి అని, బీసీలను మోసం చేస్తున్నారని దుయ్యబ ట్టారు. రానున్న రోజుల్లో ఓబీసీలు ఏకమై బీజేపీని గద్దెదింపుతారన్నారు. కేసీఆర్ బీసీల వ్యతిరేకి అని, తెలంగాణను దోచుకున్నారని మండిపడ్డారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. 2039 వరకు కాంగ్రెస్సే అధికారంలో ఉంటుందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
దేశవ్యాప్తంగా కులగణన జరగాలి: పొన్నం
కులగణన కేవలం ఒక రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదని, దేశంలోని బడుగు, బలహీన, వెనుక బడిన వర్గాల హక్కులకు సంబంధించినదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. దేశవ్యాప్తంగా కులగణన జరగాలన్నది తమ ప్రధాన డిమాండ్ అని, గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కులగణన కోసం ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమం, స్వాతంత్య్ర పోరాటం, నిజాం వ్యతిరేక పోరాటాల్లో ప్రజల ఐక్యతే విజయానికి కారణమైందని, అదే స్ఫూర్తితో ఇప్పుడు సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, సముచిత రాజకీయ ప్రాతినిధ్యం కోసం ఐక్యంగా పోరాడాలన్నారు.
కులగణన ఆధారంగా సంక్షేమ పథకాలు, రిజర్వేషన్లు, రాజకీయ ప్రాతినిధ్యం నిర్ణయించే అవకాశముంటుందని, కేంద్రం రాజ్యాంగ బద్ధమైన అధికారాలను వినియోగించి దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించాలని డిమాండ్ చేశారు. కులగణన కోసం రాహుల్ గాంధీ నాయకత్వంలో జరుగుతున్న పోరాటానికి తెలంగాణ నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో టీపీసీసీ ఓబీసీ విభాగం చైర్మన్ వీర్లపల్లి శంకర్, ఏఐసీసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్‌రెడ్డి, ఓబీసీ జాతీయ నేత లేక్‌రాం సాహు, ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు, మాజీ ఎంపీ మధుయాష్కీ, పలువురు బీసీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి...
తెలంగాణలో ఖేలో ఇండియా గేమ్స్
పుట్టిన రోజునే నూరేళ్లు నిండాయ్!
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మహబూబాబాద్‌కు చెందిన మహిళ మృతి