Share News

బుల్లెట్‌ రైళ్ల హబ్‌గా శంషాబాద్‌!

ABN , Publish Date - Feb 16 , 2026 | 12:56 AM

శంషాబాద్‌ ప్రాంతాన్ని హైస్పీడ్‌ రైళ్ల హబ్‌గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్‌ ముఖచిత్రాన్ని మరింత మార్చే హైస్పీడ్‌ .....

బుల్లెట్‌ రైళ్ల హబ్‌గా శంషాబాద్‌!
Bullet Trains Hub

  • విమానాశ్రయాన్ని ఆనుకొని ఉన్న బహదూర్‌గూడలో హైస్పీడ్‌ రైల్వే టెర్మినల్‌

  • సర్వే నంబరు 28, 62లోని 650 ఎకరాల ప్రభుత్వ భూములు కేటాయించే అవకాశం

  • ఇటీవలే హద్దులు గుర్తించిన అధికారులు

  • హైదరాబాద్‌ నుంచి బెంగళూరు, చెన్నై, పుణెకు హైస్పీడ్‌ రైళ్లు

  • (ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి)

శంషాబాద్‌ ప్రాంతాన్ని హైస్పీడ్‌ రైళ్ల హబ్‌గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్‌ ముఖచిత్రాన్ని మరింత మార్చే హైస్పీడ్‌ (బుల్లెట్‌) రైళ్ల టెర్మినల్‌ను శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుకుని ఉన్న బహదూర్‌గూడ భూముల్లో ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన భూసేకరణపై కూడా దృష్టి సారించింది. దేశవ్యాప్తంగా ఏడు హైస్పీడ్‌ రైల్వే కారిడార్లను ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్‌లో ప్రకటించింది. ఇందులో మూడు కారిడార్లు హైదరాబాద్‌తో అనుసంధానం అవుతున్నాయి.


హైదరాబాద్‌ నుంచి పుణె, బెంగళూరు, చెన్నై మార్గాల్లో ఈ హైస్పీడ్‌ రైలు కారిడార్లు నిర్మించనున్నారు. ఇటీవల ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్‌ రెడ్డి.. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచే హైస్పీడ్‌ రైలు మార్గాలను ప్రారంభించాలని రైల్వే మంత్రిని కోరారు. ఈ కారిడార్‌ కోసం శంషాబాద్‌ విమానాశ్రయానికి సమీపంలో 500 ఎకరాలు కేటాయిస్తామని తెలిపారు. సీఎం రేవంత్‌ ప్రతిపాదనకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది. అలాగే, హైస్పీడ్‌ కారిడార్ల అలైన్‌మెంట్లకు సంబంధించి రైల్వే శాఖ నియమించిన కన్సల్టెన్సీ సంస్థ ప్రతినిధులు కూడా సీఎం రేవంత్‌తో సమావేశమయ్యారు. వారి ప్రణాళికలు విన్న రేవంత్‌రెడ్డి పలు సలహాలు, సూచనలు చేశారు. హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం పక్కనే ఉన్న భూముల్లో రైల్వే కారిడార్‌ ఏర్పాటు వల్ల.. విమానాశ్రయం నుంచి దేశంలోని ప్రధాన నగరాలకు కనెక్టివిటీ పెరుగుతుందని, సరుకు రవాణాకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. విమానాశ్రయానికి ఆనుకొని ఉన్న భూములు ప్రభుత్వ భూములే కావడంతో భూసేకరణకు కూడా సమస్య ఉండదని వివరించారు.

650 ఎకరాల సేకరణ !

హైదరాబాద్‌ నుంచి చెన్నై, బెంగళూరు, పుణెకు నడిచే హైస్పీడ్‌ రైళ్లు శంషాబాద్‌ టెర్మినల్‌ నుంచే ప్రారంభమయ్యేలా ప్రణాళికలు చేస్తున్నారు. ఇందులో భాగంగా హైస్పీడ్‌ రైల్వే టెర్మినల్‌ కోసం శంషాబాద్‌ విమానాశ్రయాన్ని ఆనుకొని ఉన్న బహదూర్‌గూడ భూములను సేకరించే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు ఎయిర్‌పోర్టుకు మధ్యన ఉన్న ఈ భూములకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే తొలి అడుగు వేసింది. బహదూర్‌గూడలోని సర్వే నంబరు 28, 62లోని 650 ఎకరాల ప్రభుత్వ భూములకు సంబంధించిన హద్దులను ఇటీవలే గుర్తించింది. వీటిని మరోసారి సర్వే చేయనున్నట్లు తెలిసింది. ఈ భూములను స్థానికులు కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్నారు. ఆయా రైతులకు కొంత పరిహారం అందించి భూములను స్వాధీనం చేసుకోనున్నట్లు సమాచారం.


మారనున్న రూపు రేఖలు

ప్రతిపాదిత హైస్పీడ్‌ రైల్‌ కారిడార్లతో మధ్య, దక్షిణ భారతాన్ని అనుసంధానించే కేంద్రంగా హైదరాబాద్‌ మారనుంది. దేశ మౌలిక సదుపాయాల రంగంలో అత్యంత కీలక రాష్ట్రంగా తెలంగాణ అవతరిస్తుందని తద్వారా దేశ రాజకీయాల్లో కూడా తెలంగాణ ప్రాధాన్యం పెరగనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో రియల్‌ ఎస్టేట్‌, పర్యాటకం, లాజిస్టిక్స్‌, ఫార్మా, ఐటీ, నిర్మాణ, సేవా రంగాల్లో 10-15 లక్షల ఉద్యోగాలు లభిస్తాయనే అంచనాలు కూడా ఉన్నాయి. హైస్పీడ్‌ రైలు టెర్మినల్‌ ఏర్పాటు వల్ల శంషాబాద్‌ విమానాశ్రయ పరిసర ప్రాంతాల రూపురేఖలు కూడా మారనున్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయానికి బుల్లెట్‌ ట్రైన్‌ను అనుసంధానించడంతో ఈ ప్రాంతం అంతర్జాతీయ బిజినె్‌సకు గేట్‌వేగా అభివృద్ధి చెందే అవకాశముంది. 2034 నాటికి అందుబాటులోకి రానున్న ఈ ప్రాజెక్టులు శంషాబాద్‌ విమానాశ్రయం సమీపం నుంచి ప్రారంభమైనప్పటికీ నగర నలుమూలలకు అనుసంధానం చేస్తూ కొత్త రవాణా వ్యవస్థలు వస్తాయి. తెలంగాణలో పారిశ్రామిక, వాణిజ్య అభివృద్ధికి దోహదపడుతుంది. బుల్లెట్‌ ట్రైన్‌ మార్గాలు ఎలివేటెడ్‌ కారిడార్లుగా నిర్మిస్తారు. దీంతో భూసేకరణ సమస్యలు తగ్గుతాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ టెర్మినల్‌ పరిసరాల్లో ఐటీ పార్కులు, కార్పొరేట్‌ ఆఫీసులు, హోటళ్లు, కన్వెన్షన్‌ సెంటర్లు, లాజిస్టిక్‌ హబ్‌లు ఏర్పాటయ్యే అవకాశం ఉంది.

2 గంటల్లో బెంగళూరుకు..!

హైస్పీడ్‌ కారిడార్‌లో నడిచే బుల్లెట్‌ రైళ్లు గంటకు 300-320 కి.మీ వేగంతో ప్రయాణిస్తాయి. దీంతో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు రోడ్లు లేదా రైలు మార్గాల్లో వెళ్లేందుకు ప్రస్తుతం 8 నుంచి 11 గంటల సమయం పడుతుంది. కేంద్రం ప్రతిపాదించిన హైదరాబాద్‌-బెంగళూరు హైస్పీడ్‌ రైలు కారిడార్‌ అందుబాటులోకి వస్తే రెండు గంటల్లో చేరుకోవచ్చని అంటున్నారు. ఈ హైస్పీడ్‌ కారిడార్‌ 618 కి.మీ ఉండనుంది. హైదరాబాద్‌- చెన్నై హైస్పీడ్‌ మార్గం 744కి.మీ కాగా దీని ప్రయాణ సమయం 2.5గంటలు. ఇక హైదరాబాద్‌, పుణె నూతన రైలు మార్గం 711కి.మీ కాగా ప్రయాణ సమయం 3.5 గంటల్లోపు ఉండనుంది.


ఈ వార్తలు కూడా చదవండి:

‘టెక్‌-బయో’లో శక్తి కేంద్రంగా తెలంగాణ

మేం సేవకులం

Updated Date - Feb 16 , 2026 | 08:11 AM