Share News

‘టెక్‌-బయో’లో శక్తి కేంద్రంగా తెలంగాణ

ABN , Publish Date - Feb 16 , 2026 | 02:48 AM

గ్లోబల్‌ టెక్‌-బయో రంగంలో తెలంగాణను పవర్‌ హౌస్‌గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘బయో ఏషియా 2026’ సదస్సును నిర్వహించనుంది.

‘టెక్‌-బయో’లో శక్తి కేంద్రంగా తెలంగాణ

  • రేపటి నుంచి బయో ఏషియా సదస్సు

  • హెచ్‌ఐసీసీలో 2 రోజుల పాటు నిర్వహణ

  • 50దేశాల నుంచి 3వేల మంది ప్రతినిధులు

  • ఏఐతో లైఫ్‌ సైన్సె్‌సలో మార్పులపై దృష్టి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): గ్లోబల్‌ టెక్‌-బయో రంగంలో తెలంగాణను పవర్‌ హౌస్‌గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘బయో ఏషియా 2026’ సదస్సును నిర్వహించనుంది. రాజధానిలోని హెచ్‌ఐసీసీలో ఈ నెల 17, 18 తేదీల్లో జరిగే ఈ సదస్సులో సుమారు 50 దేశాల నుంచి మూడు వేల మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. హెల్త్‌ కేర్‌, లైఫ్‌ సైన్సెస్‌ రంగాలపై ప్రపంచంలోనే అతిపెద్ద సదస్సుగా బయో ఏషియాకు గుర్తింపు సంతరించుకుంది. ‘టెక్‌-బయో అన్‌లీష్డ్‌: ఏఐ, ఆటోమేషన్‌-బయాలజీ రివల్యూషన్‌’ అనే థీమ్‌తో నిర్వహిస్తున్న ఈ సదస్సును ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మంత్రి శ్రీధర్‌ బాబుతో కలిసి ప్రారంభించనున్నారు. బయో టెక్నాలజీ, లైఫ్‌ సైన్సెస్‌, హెల్త్‌ కేర్‌, ఫార్మా రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన సంస్థల అధిపతులు, సీఈవోలు, ప్రతినిధులు, నిపుణులు, ఆవిష్కర్తలు చర్చలు, సమావేశాల్లో పాలుపంచుకుంటారు. ప్రధానంగా ఈ రంగాల్లో పురోగతి, కృత్రిమ మేధ (ఏఐ)తో వచ్చిన మార్పులపై చర్చలు జరగనున్నాయి. కొత్త ఆవిష్కరణలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, దేశ విదేశాల సహకారం విషయంలో ఈ సదస్సు తెలంగాణకు ఉపయోగపడనుంది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియాకు చెందిన క్యాన్సర్‌ జీన్‌ థెరపీ నిపుణులు బ్రూస్‌ ఎల్‌ లెవిన్‌, అమ్జెన్‌ సంస్థ సీఎ్‌సవో హోవర్డ్‌ వై చాంగ్‌, జర్మనీకి చెందిన మిల్టెనీ బయోటెక్‌ వ్యవస్థాపకులు స్టెఫాన్‌ మిల్టెనీ, సానోఫీ సంస్థ ఈవీపీ మాడలీన్‌ రోచ్‌ వంటి ప్రముఖులు సదస్సులో కీలక ప్రసంగం చేయనున్నారు. కేంద్ర మంత్రులు పీయూష్‌ గోయల్‌, అశ్వినీ వైష్ణవ్‌ కూడా హాజరుకానున్నారు. ‘ఫార్మా-బయోటెక్‌ భవిష్యత్తు’ అంశంపై జరిగే సమావేశంలో డాక్టర్‌ రెడ్డీస్‌, జైడస్‌, బయోకాన్‌, సిప్లా వంటి భారతీయ ప్రముఖ సంస్థల సీఈవోలు పాల్గొననున్నారు. నోవార్టిస్‌, రోష్‌, నోవో నార్డిస్క్‌, మెడ్‌ట్రానిక్‌, మెర్క్‌, అస్ర్టాజెనెకా వంటి అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో ప్యానల్‌ చర్చలు జరుగుతాయి. దావోస్‌ సదస్సులో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం మలితరం లైఫ్‌ సైన్సెస్‌ విధానాన్ని ఆవిష్కరించి రాష్ట్రాన్ని ఆ రంగంలో ప్రపంచంలోని ప్రముఖ క్లస్టర్లలో ఒకటిగా నిలిపిందని, తద్వారా పెట్టుబడుల విస్తరణను వేగవంతం చేసిందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

Updated Date - Feb 16 , 2026 | 02:48 AM