శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుపడిన హైగ్రేడ్ గంజాయి..
ABN , Publish Date - May 20 , 2026 | 04:45 PM
శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా హైగ్రేడ్ గంజాయి పట్టుపడింది. బ్యాంకాక్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద గంజాయిని గుర్తించిన అధికారులు వారిని అరెస్టు చేశారు.
హైదరాబాద్: శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో హైగ్రేడ్ గంజాయి భారీగా పట్టుపడింది. బ్యాంకాక్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద గంజాయిని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్‌ఐ) అధికారులు గుర్తించారు. నిందితులు విమానం దిగిన వెంటనే డీఆర్ఐ అధికారులకు అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో వారిని నిలువరించి లగేజీ తనిఖీ చేయగా గంజాయి బయటపడింది. నిందితులు అత్యంత చాకచక్యంగా వాటర్ బాటిల్స్, స్నాక్ టిన్స్, ఫుడ్ బాక్సుల్లో హైగ్రేడ్ గంజాయిని ప్యాక్ చేసి స్మగ్లింగ్‌కు ప్రయత్నించారు.
మొత్తం 8.705 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డీఆర్ఐ అధికారులు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ సుమారు రూ.3.05 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన డీఆర్‌ఐ అధికారులు.. ఇద్దరు నిందితులను ఎన్‌డీపీఎస్ చట్టం కింద అరెస్ట్ చేశారు. ఈ స్మగ్లింగ్ వెనుక ఉన్న డ్రగ్స్ నెట్‌వర్క్, ఇతర సంబంధాలపైనా మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఇటీవల గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు, బంగారం వంటి విలువైన వస్తువులు తరలిస్తూ స్మగ్లర్లు భారీగా పట్టుపడుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఫ్యూచర్ సిటీ డిజైన్స్‌పై సీఎం రేవంత్ రెడ్డి సూచనలివే..
అత్తాపూర్ కిడ్నాప్ కేసు.. ఇంట్లోనే సేఫ్‌గా ఉన్న యువతి