పవన కల్యాణ్ కామెంట్స్.. ఘాటుగా స్పందించిన సినిమాటోగ్రఫీ మంత్రి
ABN , Publish Date - Jun 02 , 2026 | 10:05 PM
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు.
హైదరాబాద్, జూన్02: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు రాష్ట్రమంతా సంబురాలు జరుపుకుంటుంటే.. పక్క రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ గడ్డపై నిలబడి తన అక్కసు వెళ్లగక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అంటే అణువణువునా అదే ద్వేషం, అదే వివక్ష ఇంకా మీ మాటల్లో స్పష్టంగా కనిపిస్తుందన్నారు.
తెలంగాణ మీ అయ్య జాగీరా? అని పవన్ కళ్యాణ్ వాడిన భాష చూస్తుంటే రక్తం మరుగుతున్నదని పేర్కొన్నారు. తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు చేసుకున్న మా అమరవీరులను అవమానించే విధంగా నీ మాటలున్నాయని పవన్ కల్యాణ్‌కు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మంత్రి పదవి త్యాగం చేసి, ఆమరణ నిరహార దీక్ష చేసిన చరిత్రలు మావని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు.
టీడీపీ, బీజేపీ కలిసి జట్టుగా తెలంగాణపై మళ్లీ కుట్రలు చేస్తున్నట్లుగా మాకు అనుమానం కలుగుతున్నదని ఆయన తెలిపారు. ఇక్కడ వ్యాపారాలు చేసుకోండి గానీ, తెలంగాణ అస్థిత్వాన్ని కించపరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఆ తర్వాత జరిగే పరిణామాలకు మీరే బాధ్యులు.. మా సహనాన్ని పరీక్షించొద్దంటూ పవన్ కల్యాణ్‌కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు. 6 సార్లు చట్ట సభలకు ఎన్నికైన సీనియర్ పొలిటీషియన్‌గా మీకు సలహా ఇస్తున్నానన్నారు.
డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న మీరు మీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై దృష్టి సారించాలని పవన్ కల్యాణ్‌కు ఆయన హితవు పలికారు. రెండు ప్రాంతాలు అభివృద్ధిలో పోటీపడాలి తప్ప ప్రాంతీయ విద్వేషాల్లో కాదని మంత్రి కోమటిరెడ్డి కుండబద్దలు కొట్టారు. ఇకపై ఆంధ్రా కాంట్రాక్టర్లకు తెలంగాణలో ఒక్క ప్రాజెక్ట్ కూడా ఇవ్వబోమని ప్రకటించారు.
అందుకోసం ఎలాంటి చట్టం తీసుకురావడానికైనా తాము వెనకాడబోమన్నారు. తెలంగాణ కోసం ఎంతకైనా తెగిస్తాం.. బరిగీసి నిలబడతాం.. తస్మాత్ జాగ్రత్త అంటూ పవన్ కల్యాణ్‌కు మంత్రి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కార్యాలయం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణలో జనసేన పోటీ చేస్తుంది: పవన్ కల్యాణ్
భవిష్యత్తు డిజిటల్ ఎకానమీకి ఏపీ కీలక గమ్యస్థానం: సీఎం చంద్రబాబు
Read Latest TG News And Telugu News