పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదాపై కేంద్రం క్లారిటీ..
ABN , Publish Date - Aug 10 , 2026 | 07:55 PM
తెలంగాణలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఇచ్చే అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చే ప్రతిపాదన ప్రస్తుతం కేంద్రం పరిశీలనలో లేదని జలశక్తి శాఖ స్పష్టం చేసింది.
ఢిల్లీ: తెలంగాణలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఇచ్చే అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చే ప్రతిపాదన ప్రస్తుతం కేంద్రం పరిశీలనలో లేదని జలశక్తి శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
కృష్ణా జలాల వినియోగం, అంతర్రాష్ట్ర జల వివాదాలు కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్-2 (KWDT-II) పరిధిలో న్యాయ విచారణలో ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. ఈ అంశాలు పరిష్కారం కాకుండా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి టెక్నో-ఎకనామిక్ అప్రైజల్ చేపట్టడం సాధ్యం కాదని పేర్కొంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను కేంద్రం తిరిగి రాష్ట్రానికి పంపినట్లు మంత్రి వెల్లడించారు. ప్రాజెక్టు సమగ్ర ప్రణాళికకు అవసరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని డీపీఆర్‌ను పునఃసమీక్షించి సమర్పించాల్సిందిగా సూచించినట్లు తెలిపారు.
జాతీయ హోదాపై ఎదురుచూపులు..
కాగా, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వం చాలాకాలంగా కోరుతోంది. అయితే ప్రస్తుతం ఈ ప్రతిపాదన కేంద్ర పరిశీలనలో లేదని తాజా సమాధానంతో స్పష్టమైంది. మరోవైపు కృష్ణా జలాల పంపకాలు, అంతర్రాష్ట్ర వివాదాలు ట్రైబ్యునల్ పరిధిలో ఉండటంతో ప్రాజెక్టు అంశంలో ముందడుగు వేసే పరిస్థితి లేదని కేంద్రం తేల్చిచెప్పింది. దీంతో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా అంశంపై తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి నిరాశ ఎదురైనట్లయింది.
ఈ వార్తలు కూడా చదవండి
తెలంగాణలో ముగిసిన సర్ ప్రక్రియ.. ఓటర్లు ఎంతమంది అంటే..?
కోర్టు చెప్పినా రంగనాథ్ తీరు మారడం లేదు: రాంచందర్ రావు