స్త్రీ పురుషులేనా? ‘ఇతరులు’ కాలమ్ లేదేం?
ABN , Publish Date - Sep 09 , 2026 | 02:23 AM
రాష్ట్రస్థాయి పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు చేపట్టిన పోలీసు సబ్‌ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్ ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియలో కేవలం స్ర్తీ, పురుష అని తప్ప ఇతరులు (ట్రాన్స్‌జెండర్ తదితర) కాలమ్ లేకపోవడాన్ని హైకోర్టు ప్రశ్నించింది
పోలీసు ఉద్యోగాల్లో ట్రాన్స్‌జెండర్ కాలం లేకపోవడంపై పిటిషన్
ట్రాన్స్‌జెండర్ల దరఖాస్తులు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు
హైదరాబాద్, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రస్థాయి పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు చేపట్టిన పోలీసు సబ్‌ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్ ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియలో కేవలం స్ర్తీ, పురుష అని తప్ప ఇతరులు (ట్రాన్స్‌జెండర్ తదితర) కాలమ్ లేకపోవడాన్ని హైకోర్టు ప్రశ్నించింది. పోలీసు ఉద్యోగాలకు ట్రాన్స్‌జెండర్ల దరఖాస్తులు సైతం స్వీకరించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు జారీచేసిన నోటిఫికేషన్ నెంబర్ 189, 225లలో ట్రాన్స్‌జెండర్లను పరిగణనలోకి తీసుకోకపోవడం చెల్లదని పేర్కొంటూ సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం కుడకుడకు చెందిన డి.తనుశ్రీ మరికొంతమంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్.. ట్రాన్స్‌జెండర్లకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు, సమాంతర రిజర్వేషన్లు కల్పించాలంటూ ఇదే హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చిన సంగతి గుర్తుచేశారు.
ఇవి కూడా చదవండి
శాసన మండలి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ సస్పెన్షన్
వాదనలు విన్న ధర్మాసనం.. దరఖాస్తుల్లో స్త్రీ, పురుష కాలాలు తప్ప ‘ఇతరులు’ అనే కాలమ్ ఎందుకు లేదని బోర్డును ప్రశ్నించింది. గతంలో జస్టిస్ ఉజ్జల్ భుయాన్ (ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తి) తెలంగాణ హైకోర్టు సీజేగా ఉన్నప్పుడు ట్రాన్స్‌జెండర్లకు సమాన అవకాశాలు ఉండాలన్న తీర్పు జారీచేశారని.. దాని ప్రకారం ప్రభుత్వం ఇప్పటికీ మార్గదర్శకాలు ఎందుకు జారీచేయలేదని ప్రశ్నించింది. సమాజంలో కేవలం రెండు లింగాలు (స్త్రీ, పురుష) మాత్రమే ఉంటాయన్న మూస ధోరణి నుంచి బయటపడాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు తరఫున న్యాయవాది రాజశేఖర్‌రెడ్డి వాదిస్తూ.. దరఖాస్తుల చివరి గడువు ఇంకా పూర్తికాలేదని.. ఈనెల 16 వరకూ సమయం ఉందని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. పోలీసు ఉద్యోగాలకు ట్రాన్స్‌జెండర్ల దరఖాస్తులు స్వీకరించాలని స్పష్టంచేసింది. ఆన్‌లైన్ పోర్టల్‌లో ట్రాన్‌జెండర్ కాలమ్ లేకపోతే భౌతికంగానైనా సరే వారి అప్లికేషన్లు స్వీకరించి, రశీదు ఇవ్వాలని బోర్డుకు ఆదేశాలు జారీచేసింది. దీనిపై వివరణ కోరుతూ.. హోంశాఖ, డీజీపీ, పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు, వృద్ధులు, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్ల సాధికారత శాఖకు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 16కు వాయిదా వేసింది.