Share News

కారులో భారీగా మద్యం బాటిళ్లు.. ఇద్దరి అరెస్ట్

ABN , Publish Date - Feb 09 , 2026 | 08:10 PM

హైదరాబాద్ నగరంలో కారులో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసుల బృందం పట్టుకుంది. కారు, సెల్ ఫోన్‌తో పాటు 84 ఢిల్లీ మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కారులో భారీగా మద్యం బాటిళ్లు.. ఇద్దరి అరెస్ట్

హైదరాబాద్, ఫిబ్రవరి 09: భాగ్యనగర పరిధిలో కారులో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసుల బృందం పట్టుకుంది. కారు, సెల్ ఫోన్‌తోపాటు 84 ఢిల్లీ మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి కారు డ్రైవర్‌ ఆదిత్య ప్రసాద్‌ను అరెస్ట్ చేసి.. పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసుల విచారణలో డ్రైవర్.. పలు కీలక విషయాలు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. దేశ రాజధాని న్యూఢిల్లీ సమీపంలోని నొయిడా(ఉత్తర్ ప్రదేశ్) నుంచి ఈ మద్యం బాటిళ్లను అక్రమంగా హైదరాబాద్‌కు తీసుకువస్తున్నట్లు తెలిపాడని చెప్పారు. ఈ మద్యాన్ని హైదరాబాద్‌కు తెప్పించిన ఉప్పల్‌ నివాసి గోపాల్ రెడ్డిని సైతం అరెస్ట్ చేశామన్నారు.


తెలంగాణలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల సమయంలోనూ వీరు అక్రమ మద్యం రవాణా చేసినట్లు గుర్తించారు పోలీసులు. ఆ సమయంలో నల్గొండకు రెండుసార్లు 30 కార్టన్ల చొప్పున మద్యం సరఫరా చేశారని పేర్కొన్నారు. అయితే ఈ కేసులో కారు డ్రైవర్‌తో పాటు గోపాల్ రెడ్డిని అరెస్ట్ చేయగా.. మరో వ్యక్తి పరారీలో ఉన్నారన్నారు. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇక స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లను ఉప్పల్ ఎక్సైజ్ స్టేషన్ అధికారులకు అప్పగించామని పోలీసులు చెప్పారు. అలాగే ఢిల్లీకి చెందిన ప్రసాద్ డిస్ట్రిబ్యూటర్స్‌పైనా కేసు నమోదు చేసినట్లు వారు వివరించారు. స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్ల విలువ సుమారు రూ.2.50 లక్షలు ఉంటుందని పోలీసులు చెప్పారు.


తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు బుధవారం జరగనున్నాయి. సోమవారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల పోలింగ్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. దాంతో హైదరాబాద్ నుంచి వివిధ జిల్లాలకు వెళ్లే మార్గాల్లో పోలీసులు.. వివిధ బృందాలుగా ఏర్పడి వాహన తనిఖీలు చేపడుతున్నారు.


జూబ్లీహిల్స్‌లో భారీ చోరీ.. పోలీసుల అదుపులో గ్యాంగ్

జూబ్లీహిల్స్‌లో చోరీకి పాల్పడిన నేపాలి గ్యాంగ్‌ను దేశ సరిహద్దుల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్‌లోని రవీంద్ర శర్మ ఇంట్లో ఈ గ్యాంగ్‌.. రూ. 20 లక్షల నగదు, డైమండ్ రింగ్‌తోపాటు బంగారాన్ని చోరీ చేశారు. ఇంట్లో పని మనిషిగా చేరిన ఈ నేపాలి గ్యాంగ్.. ఈ దోపిడికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. రవీంద్ర శర్మ ఇంట్లో ఇటీవల భారీ చోరీ జరిగింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు. ఈ చోరీ జరిగిన తర్వాత.. ఇంట్లో పనిచేసే నేపాలి గ్యాంగ్ ఆచూకీ లేకుండా పోయింది. దాంతో వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దాంతో వీరంతా నేపాల్‌లోకి వెళ్లేందుకు దేశ సరిహద్దులు ఉన్న వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Updated Date - Feb 09 , 2026 | 10:55 PM