Share News

కేటీఆర్ పీఆర్ఓ మహేష్‌పై కేసు నమోదు

ABN , Publish Date - Sep 17 , 2026 | 06:24 PM

కేటీఆర్ పీఆర్ఓ మహేష్‌పై బొల్లారం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో పాటు ఆంక్షలను ఉల్లంఘించినట్లు పేర్కొంటూ బీఎన్‌ఎస్‌ సెక్షన్లు 132, 223 కింద కేసు నమోదు చేశారు.

కేటీఆర్ పీఆర్ఓ మహేష్‌పై కేసు నమోదు
KTR PRO Mahesh Case

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఆర్ఓ మహేష్‌పై బొల్లారం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ నెల 8న ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు వెళ్తున్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.


ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌ వద్ద అప్పటికే ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో అక్కడికి వెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ క్రమంలో బొల్లారం చెక్‌పోస్ట్‌ వద్ద బేగంపేట్ ఏసీపీ గోపాలకృష్ణమూర్తితో కేటీఆర్ పీఆర్ఓ మహేష్ వాగ్వాదానికి దిగినట్లు పోలీసులు పేర్కొన్నారు.


శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు విధించిన ఆంక్షలను పట్టించుకోకుండా పోలీసులతో దురుసుగా ప్రవర్తించారని, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఏసీపీని దూషించడం, కేకలు వేయడంతో పాటు విధులకు ఆటంకం కలిగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించి మహేష్‌పై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్ 132, 223 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - Sep 17 , 2026 | 06:24 PM