Share News

కేపీహెచ్‌బీలో గజం రూ.2.70 లక్షలు

ABN , Publish Date - Sep 03 , 2026 | 05:03 AM

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు(కేపీహెచ్‌బీ) స్థలాలు, మోకిల్లా, బాచుపల్లిలోని హెచ్‌ఎండీఏ ప్లాట్లు హాట్‌ కేకుల్లా అమ్ముడయ్యాయి. బుధవారం నిర్వహించిన వేలంలో ఆయా స్థలాలను పోటిపడి మరీ కొనుగోలుదారులు దక్కించుకున్నారు

కేపీహెచ్‌బీలో గజం రూ.2.70 లక్షలు
Kphb

  • 13 ప్లాట్ల అమ్మకంతో హౌసింగ్‌ బోర్డుకు రూ.47కోట్లు.. మోకిల్లాలో 87,500, బాచుపల్లిలో 67,500

  • 57 ప్లాట్ల ద్వారా హెచ్‌ఎండీఏకు రూ.101కోట్లకు పైగా ఆదాయం

    హైదరాబాద్‌ సిటీ/ కేపీహెచ్‌బీకాలనీ, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు(కేపీహెచ్‌బీ) స్థలాలు, మోకిల్లా, బాచుపల్లిలోని హెచ్‌ఎండీఏ ప్లాట్లు హాట్‌ కేకుల్లా అమ్ముడయ్యాయి. బుధవారం నిర్వహించిన వేలంలో ఆయా స్థలాలను పోటిపడి మరీ కొనుగోలుదారులు దక్కించుకున్నారు. కేపీహెచ్‌బీలో చదరపు గజం ధర అత్యధికంగా రూ.2.70లక్షలు పలికింది. మోకిల్లాలో చ.గజం అత్యధిక ధర రూ.87,500, బాచుపల్లిలో చ.గజం అత్యధిక ధర రూ.67,500 పలకడం విశేషం. కేపీహెచ్‌బీలో 13 ప్లాట్ల అమ్మకంతో హౌసింగ్‌బోర్డుకు రూ.47.14కోట్ల ఆదాయం సమకూరింది. హెచ్‌ఎండీఏకు మోకిల్లాలో రూ.66కోట్లు, బాచుపల్లిలో రూ.35కోట్ల ఆదాయం వచ్చింది.


కేపీహెచ్‌బీలో బహిరంగ వేలం

కేపీహెచ్‌బీ ఏడో ఫేజ్‌లోని 16 ప్లాట్లకు కేపీహెచ్‌బీ ఫంక్షన్‌ హాల్లో బుధవారం బహిరంగ వేలం నిర్వహించారు. ఇందులో 19 మంది పాల్గొనగా వేలం పోటాపోటీగా జరిగింది. ఇక్కడ గజం అత్యధికంగా రూ.2.70లక్షలు పలికిందని హౌసింగ్‌బోర్డు వైస్‌ఛైర్మన్‌ వీపీ గౌతమ్‌ తెలిపారు. విక్రయించిన ప్లాట్లలో సింహభాగం వ్యాపారం కోసం ఉపయోగించేవే కావడం గమనార్హం. ఇక్కడ గజం రూ.1.60లక్షలు ఆపైన పాడుకుంటేనే ప్లాట్‌ కేటాయిస్తామని నోటీసులో పేర్కొన్నారు. కానీ ఆ ధరకు సుమారు 50శాతం అధికంగా వెచ్చించి ప్లాట్లు కొనుగోలు చేసేందుకు వ్యాపారులు పోటీపడ్డారు. ప్లాట్‌ నంబర్‌-8 నార్త్‌ ఈస్ట్‌ కార్నర్‌ కావడంతో ఇక్కడ 194.44 గజాల ప్లాట్‌ గజం రూ.2.70లక్షలకు వేలంలో దక్కించుకున్నారు. ప్లాట్‌ నంబర్‌-9 గజం రూ.2.36లక్షలు, ప్లాట్‌ నంబర్‌-1, 7 గజం రూ.2.06లక్షలు, ప్లాట్‌ నంబర్‌-6 గజం రూ.2.02లక్షలు పలికినట్లు అధికారులు తెలిపారు. నిజానికి, కేపీహెచ్‌బీలో భూముల వేలాన్ని బీఆర్‌ఎస్‌, బీజేపీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకించాయి. అయినప్పటికీ ఈ స్థలాలను కొనుగోలు చేసేందుకు వ్యాపారులు పోటీపడ్డారు. ఽహౌసింగ్‌బోర్డు ద్వారా కొనుగోలు చేస్తే భవిష్యత్తులో కూడా ఇబ్బందులు లేకుండా లావాదేవీలు చేసుకోవచ్చనే భరోసాతో స్థలాలను బహిరంగ వేలంలో సొంతం చేసుకుంటున్నారు.


హెచ్‌ఎండీఏకు రూ.101కోట్లకు పైగా ఆదాయం

హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో మోకిల్లాలోని ప్లాట్లను బుధవారం ఈ-వేలం వేశారు. ఇందులో 32ప్లాట్లు అమ్ముడుపోగా హెచ్‌ఎండీఏకు రూ.66.48కోట్ల ఆదాయం వచ్చింది. అత్యధికంగా చ.గజం రూ.87,500 పలికింది. బాచుపల్లిలోని ప్లాట్లను బుధవారం మధ్యాహ్నం ఈ-వేలం వేయగా 25 ప్లాట్లు అమ్ముడుపోయాయి. చ.గజానికి అత్యధికంగా రూ.67,500 ధర పలికింది. 25ప్లాట్ల విక్రయంతో హెచ్‌ఎండీఏకు రూ.35.05కోట్ల ఆదాయం సమకూరింది. మొత్తంగా హెచ్‌ఎండీఏకు రూ.101 కోట్లపై ఆదాయం వచ్చింది.

Updated Date - Sep 03 , 2026 | 05:03 AM