లోన్ యాప్స్ కిరాతకం.. ఐదు నెలల్లో రూ.36 లక్షల అధిక వసూలు
ABN , Publish Date - Feb 07 , 2026 | 04:18 PM
'లోన్ రాడార్', 'క్విక్ ఫండ్స్' అనే లోన్ యాప్స్ నిర్వాహకులు చేసిన అత్యంత దుర్మార్గమైన చర్యలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ సనత్ నగర్‌కు చెందిన ఒక వ్యక్తిని బెదిరించి, బ్లాక్ మెయిల్ చేసి కేవలం ఐదు నెలల్లో ఏకంగా రూ.36 లక్షలు అదనంగా లాక్కున్నారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 7: నేటి డిజిటల్ యుగంలో 'తక్షణ రుణం' అంటూ సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలు.. సామాన్యుల పాలిట మృత్యుపాశాలుగా మారుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని సనత్ నగర్‌కు చెందిన ఒక వ్యక్తి, అక్రమ లోన్ యాప్‌ల వేధింపులు తాళలేక ఏకంగా రూ.36.16 లక్షలు పోగొట్టుకున్న ఘటన కలకలం రేపుతోంది.
అసలేం జరిగింది?
బాధితుడు 2025 ఆగస్టులో గూగుల్ ప్లే స్టోర్ నుంచి 'లోన్ రాడార్', 'క్విక్ ఫండ్స్' అనే యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకున్నాడు. మొదట్లో చిన్న మొత్తంలో రుణం తీసుకున్న ఆయన.. దానిని సకాలంలో తిరిగి చెల్లించాడు. బాధితుడి నిజాయతీని ఆసరాగా చేసుకున్న ఆయా లోన్ యాప్‌ల నిర్వాహకులు.. అసలు అడగకుండానే ఆయన ఖాతాలోకి భారీ మొత్తంలో డబ్బులు జమ చేయడం ప్రారంభించారు.
వేధింపుల పర్వం.. 6వ రోజు నుంచే నరకం
7 రోజుల గడువు అని చెప్పి, 6వ రోజు నుంచే లోన్ యాప్ నిర్వాహకులు అసలు స్వరూపాన్ని బయటపెట్టారు. యాప్ ద్వారా అతని పర్సనల్ డేటా చోరీ చేశారు. సదరు లోన్ యాప్స్ డౌన్లోడ్ చేసే సమయంలో బాధితుడి అనుమతితో(Permissions) కాంటాక్ట్ లిస్ట్, గ్యాలరీని యాక్సెస్ చేసుకున్నారు.
మార్ఫింగ్ మాయాజాలం.. బ్లాక్ మెయిలింగ్
బాధితుడి ఫోన్ నుంచి ఫొటోలను సేకరించి, వాటిని అశ్లీల చిత్రాలుగా మార్చారు. డబ్బులు కట్టకపోతే ఆ అశ్లీల చిత్రాలను.. అతడి బంధువులు, స్నేహితులకు పంపిస్తామని బెదిరింపులకు దిగారు.
రూ.36 లక్షల భారీ నష్టం
బంధువుల ముందు పరువు పోతుందనే భయంతో, మానసిక వేధింపులు భరించలేక బాధితుడు.. 2025 సెప్టెంబర్ నుంచి 2026 ఫిబ్రవరి మధ్య కాలంలో.. విడతల వారీగా మొత్తం రూ.64.16 లక్షలు చెల్లించాడు. నిందితులు పంపిన అసలు మొత్తం రూ.28 లక్షలు అయితే.. బాధితుడు కేవలం వడ్డీలు, పెనాల్టీల రూపంలోనే రూ.36.16 లక్షలు నష్టపోయాడు.
జాగ్రత్త..
అన్-వెరిఫైడ్ యాప్స్ ఫోన్‌లలో డౌన్లోడ్ చేసుకోవడం, వాటిని ఉపయోగించడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన తెలియజేస్తోంది. గూగుల్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్‌లో కనిపించిన ప్రతి యాప్ సురక్షితం కాదన్న విషయం ఈ ఘటన నిరూపిస్తోంది. RBI గుర్తింపు పొందిన బ్యాంకులు లేదా NBFC యాప్‌లను మాత్రమే వాడటం సురక్షితమని ఇక్కడ గుర్తించాలి. అనుమతులు ఇచ్చేటప్పుడు లోన్ యాప్స్.. గ్యాలరీ, కాంటాక్ట్ లిస్ట్ యాక్సెస్ అడుగుతున్నాయంటే అది ప్రమాదకరమని గుర్తించాలి. మార్ఫింగ్ ఫొటోలతో బెదిరిస్తే భయపడి వెంటనే డబ్బులు చెల్లించకూడదని గమనించాలి.
వెంటనే ఫిర్యాదు చేయండి..
ఇలాంటి వేధింపులు ఎదురైతే వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయాలి లేదా www.cybercrime.gov.in, https://www.cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు.
ఈ వార్తలూ చదవండి:
బీఎంసీ మేయర్ ఎన్నిక.. బీజేపీ అభ్యర్థిగా రితూ తావ్డే
ఓటుకు రూ.2వేలు పంచేందుకు సిద్ధమైన డీఎంకే.. బీజేజీ ఆరోపణ