ఏబీఎన్ చేతిలో ఐ బొమ్మ రవి బెయిల్ ఆర్డర్ కాపీ
ABN , Publish Date - Feb 18 , 2026 | 12:10 PM
ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన బెయిల్ ఆర్డర్ కాపీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చేతికి వచ్చింది.
హైదరాబాద్, ఫిబ్రవరి 18: ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి (Ibomma Ravi)కి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన బెయిల్ ఆర్డర్ కాపీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చేతికి వచ్చింది. ఐబొమ్మ రవిపై మెుత్తం ఐదు సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయి. ప్రతి కేసులో రూ.25 వేలు వ్యక్తిగత బాండ్, ఇద్దరు పూచీకత్తులు తప్పనిసరిగా సంతకం చేయాల్సి ఉందంటూ కండిషన్ పెట్టింది కోర్టు. ఛార్జిషీట్ దాఖలు వరకు రోజూ ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంబంధిత పోలీస్ స్టేషన్‌కు అతడు హాజరు కావాలంటూ హైకోర్టు షరతు విధించింది. CRPC సెక్షన్ 437(3) / BNSS సెక్షన్ 480(3) నిబంధనలు కచ్చితంగా పాటించాలని నిందితుడు ఐ బొమ్మ రవికి స్పష్టం చేసింది.
సాక్షులు, ఫిర్యాదుదారులు, సహ నిందితులను సంప్రదించరాదని సూచించింది. అలాగే సాక్ష్యాలను తారుమారు చేయకూడదని.. దర్యాప్తునకు సహకరించాలని ఐబొమ్మ రవికి తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. సెయింట్ కిట్స్, నెవిస్ పాస్‌పోర్ట్‌ను వారం లోపు కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. కోర్టు అనుమతి లేకుండా భారతదేశం విడిచి వెళ్లరాదని పేర్కొంది. పూర్తి అడ్రస్, మొబైల్ నంబర్లు, ఈ-మెయిల్ ఐడీలు, డిజిటల్ పరికరాలకు సంబంధించిన అన్ని వివరాలు ఇవ్వాలంటూ ఐ బొమ్మ రవికి స్పష్టం చేసింది. అనుమతి లేకుండా కాపీరైట్ కంటెంట్ అప్‌లోడ్, షేర్ చేసే వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లతో సంబంధం ఉండరాదని సూచించింది.
వీపీఎన్, ప్రాక్సీ వంటి ఎన్‌క్రిప్టెడ్ ప్లాట్ ఫామ్‌లు ఉపయోగించరాదని తెలిపింది. అవసరమైతే డిజిటల్ పరికరాల ఫోరెన్సిక్ పరీక్షకు సహకరించాలని అతడికి స్పష్టం చేసింది. షరతులు ఉల్లంఘిస్తే.. బెయిల్ రద్దు చేసి ప్రాసిక్యూషన్ చేసేందుకు స్వేచ్ఛ ఇస్తామని నిందితుడు ఐ బొమ్మ రవికి తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.