Share News

ఎండైనా.. వానైనా..హైదరాబాద్‌ హైరానా

ABN , Publish Date - Sep 09 , 2026 | 05:24 AM

ప్రపంచంలో ప్రకృతి విపత్తుల ప్రమాదాన్ని ఎదుర్కోలేని అత్యంత బలహీన వ్యవస్థ ఉన్న నగరాల్లో హైదరాబాద్‌ రెండో స్థానంలో నిలిచింది. అత్యధిక వేడి, అధిక వర్షాలు, వరదలు వంటి ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు నగరంలోని మౌలిక వసతులు ఏమాత్రం సరిపోవని తేలింది.

ఎండైనా.. వానైనా..హైదరాబాద్‌ హైరానా
hyderabad

  • ప్రకృతి విపత్తులను ఎదుర్కోలేని స్థితిలో నగరం..

అత్యధిక ముప్పున్న నగరాల్లో ప్రపంచలోనే రెండోస్థానం

  • మొదటిస్థానంలో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌

  • అత్యంత సురక్షిత నగరంగా అమెరికాలోని షికాగో

  • ఆల్ఫాజియో సంస్థ అధ్యయనంలో వెల్లడి

న్యూఢిల్లీ, సెప్టెంబరు 8: ప్రపంచంలో ప్రకృతి విపత్తుల ప్రమాదాన్ని ఎదుర్కోలేని అత్యంత బలహీన వ్యవస్థ ఉన్న నగరాల్లో హైదరాబాద్‌ రెండో స్థానంలో నిలిచింది. అత్యధిక వేడి, అధిక వర్షాలు, వరదలు వంటి ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు నగరంలోని మౌలిక వసతులు ఏమాత్రం సరిపోవని తేలింది. ప్రపంచంలో అత్యధికంగా ప్రకృతి విపత్తులకు గురయ్యే ప్రమాదం ఉన్న నగరాలు, అత్యంత సురక్షిత నగరాలపై ఆల్ఫాజియో సంస్థ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ప్రపంచంలో ప్రకృతి విపత్తుల ప్రమాదం అధికంగా ఉన్న మొదటి నగరం కూడా మనదేశంలోనే ఉంది. అదే గుజరాత్‌లోనే అతి పెద్ద నగరమైన అహ్మదాబాద్‌. గొప్ప చారిత్రక వైభవంతో దేశంలోనే మొదటి యునెస్కో వరల్డ్‌ హెరిటేజ్‌ సిటీగా గుర్తింపు పొందిన ఈ నగరానికి భారీ వరదల ముప్పు పొంచి ఉందని, వాటిని ఎదుర్కొనేందుకు నగరం ఏమాత్రం సిద్ధంగా లేదని ఆల్ఫాజియో హెచ్చరించింది. ఈ జాబితాలో ముల్తాన్‌ (పాకిస్థాన్‌), ఢాకా (బంగ్లాదేశ్‌), లాహోర్‌ (పాకిస్థాన్‌), కోల్‌కతా(భారత్‌), ఫైసలాబాద్‌, కరాచీ (పాకిస్థాన్‌), చిట్టగాంగ్‌ (బంగ్లాదేశ్‌), తైపీ (తైవాన్‌) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రకృతి విపత్తుల ప్రమాదం అధికంగా ఉన్న నగరాల్లో మొదటి 9 భారత్‌, పాక్‌, బంగ్లాదేశ్‌లోనే ఉండటం గమనార్హం.


సురక్షిత నగరం షికాగో..

ప్రకృతి విపత్తులకు అతితక్కువగా ప్రభావితమయ్యే నగరంగా అమెరికాలోని షికాగో నిలిచింది. అత్యంత సురక్షిత నగరాల జాబితాలో షికాగో తర్వాత అడిస్‌ అబాబా (ఇథియోపియా), మెల్‌బోర్న్‌ (ఆస్ట్రేలియా), బార్సిలోనా (స్పెయిన్‌), అంకారా (తుర్కియే), బ్యూన్‌సఎయిర్స్‌ (అర్జెంటీనా), ప్యారిస్‌ (ఫ్రాన్స్‌), ఇస్తాంబుల్‌ (తుర్కియే), బొగోటా (కొలంబియా), నైరోబీ (కెన్యా) నిలిచాయి. సురక్షిత నగరాలంటే ఇక్కడ ప్రకృతి విపత్తులు అసలే రావని అర్థం కాదని.. ఎలాంటి విపత్తులనైనా ఎదుర్కొనేందుకు ఈ నగరాలు సిద్ధంగా ఉన్నాయని అర్థమని ఆల్ఫాజియో సంస్థ వ్యవస్థాపకుడు పరాగ్‌ ఖన్నా తెలిపారు. అలాగే ప్రమాదపుటంచున ఉన్న నగరాలు తమ మౌలిక వసతులను బలోపేతం చేసుకోవటం ద్వారా సురక్షితంగా మారవచ్చని అన్నారు. ఉదాహరణకు వేసవి వేడిని తట్టుకొనేందుకు విద్యుత్‌ కొరత రాకుండా పవర్‌ గ్రిడ్లను బలోపేతం చేసుకోవటం, విద్యుత్‌ సరఫరాను పెంచటం వంటి వాటిపై దృష్టి పెట్టాలని సూచించారు. వరద ముప్పును తప్పించుకొనేందుకు షికాగో నగరంలో భూగర్భంలో అనేక పైపులైన్‌ వ్యవస్థలను ఏర్పాటు చేశారని గుర్తుచేశారు.

ఇవి కూడా చదవండి

శాసన మండలి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ సస్పెన్షన్

సర్’ ప్రక్రియలో తెలంగాణలో కోటి ఓట్లను తీసేసే కుట్ర: సీఎం రేవంత్‌రెడ్డి

Updated Date - Sep 09 , 2026 | 05:24 AM