హైదరాబాద్‌లో భారీగా స్టెరాయిడ్స్ ఇంజెక్షన్లు స్వాధీనం.. ఆరుగురి అరెస్ట్
ABN , Publish Date - Jul 04 , 2026 | 03:02 PM
అక్రమంగా స్టెరాయిడ్స్ ఇంజెక్షన్లు విక్రయిస్తున్న ముఠాను హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్, ముషీరాబాద్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
హైదరాబాద్: క్షణాల్లో కండరాలు పెంచుకోవాలనే యువత ఆకాంక్షను ఆసరాగా చేసుకుని అక్రమంగా స్టెరాయిడ్స్ ఇంజెక్షన్లు విక్రయిస్తున్న ముఠాను హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్, ముషీరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ.6.50 లక్షల విలువైన 770కి పైగా స్టెరాయిడ్స్ వయల్స్, యాంపూల్స్, ఇంజెక్షన్లతో పాటు మొబైల్ ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
టాస్క్‌ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ తెలిపిన వివరాల ప్రకారం.. 'డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండానే జిమ్ ట్రైనర్లు స్టెరాయిడ్స్‌ను ఆన్‌లైన్ ద్వారా తెప్పించి యువతకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. ఆన్‌లైన్ జిమ్ ట్రైనర్ బట్టే శివ, మహమ్మద్ ఫుర్ఖానుద్దీన్ ఫైసల్‌తో పాటు మరో నలుగురు సబ్-సెల్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ఉత్తరప్రదేశ్‌కు చెందిన 'మెడ్‌హౌస్ ఫార్మా', పంజాబ్‌కు చెందిన 'షిప్ రాకెట్' వంటి ఆన్‌లైన్ వేదికల ద్వారా స్టెరాయిడ్స్ కొనుగోలు చేసి, కొరియర్ సేవల ద్వారా హైదరాబాద్‌కు తెప్పించి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముదిద్ చౌహాన్, పంజాబ్‌కు చెందిన రాజన్ ప్రీత్ సింగ్ పరారీలో ఉన్నారని' తెలిపారు.
ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో నిందితులపై రెండు వేర్వేరు కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అలాగే కొంతమంది యువకులు కృత్రిమ మేధస్సు (AI) సాయంతో నకిలీ వైద్యుల ప్రిస్క్రిప్షన్లు రూపొందించి మెడికల్ షాపుల నుంచి కూడా స్టెరాయిడ్స్ కొనుగోలు చేస్తున్నట్లు విచారణలో బయటపడిందని తెలిపారు. జిమ్ యజమానులు, ట్రైనర్లు, సభ్యుల కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచుతామని, నగరంలోని జిమ్‌లలో ఇకపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ వైభవ్ గైక్వాడ్ స్పష్టం చేశారు.
Also Read:
వింబుల్డన్ 2026: ఫెదరర్ రికార్డును సమం చేసిన జకోవిచ్
కుప్పంను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం: సీఎం చంద్రబాబు