Share News

అక్రమ ఫైనాన్స్ ముఠాలపై ఉక్కుపాదం: మల్కాజ్‌గిరి సీపీ సుమతి

ABN , Publish Date - Nov 05 , 2026 | 01:32 PM

అక్రమ ఫైనాన్స్ ముఠాలపై ఉక్కుపాదం మోపుతామని మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ సుమతి స్పష్టం చేశారు. అక్రమ ఫైనాన్స్, అధిక వడ్డీలు, బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

అక్రమ ఫైనాన్స్ ముఠాలపై ఉక్కుపాదం: మల్కాజ్‌గిరి సీపీ సుమతి

హైదరాబాద్, నవంబర్ 05: అక్రమ ఫైనాన్స్ ముఠాలపై ఉక్కుపాదం మోపుతామని మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ సుమతి స్పష్టం చేశారు. అక్రమ ఫైనాన్స్, అధిక వడ్డీలు, బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అక్రమ ఫైనాన్స్, రుణాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాకు చెందిన నలుగురు నిందితులను ఎస్ఓటీ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రెండు కార్లు, 12 మొబైల్ ఫోన్లతోపాటు 25 ప్రామిసరీ నోట్లు, 22 ఖాళీ చెక్కులు, రెండు సేల్ డీడ్ల స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

అలాగే రూ.47,690 నగదు, రెండు పట్టాదారు పాస్ పుస్తకాలు సీజ్ చేశామని వివరించారు. మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారని వెల్లడించారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని వివరించారు. అక్టోబర్ 26వ తేదీన ముగ్గురిని అరెస్ట్ చేశామన్నారు. తాజా అరెస్టులతో నిందితుల సంఖ్య ఏడుకి పెరిగిందని చెప్పారు.


నిందితులపై ఎల్బీనగర్, నేరేడ్‌మెట్, కీసర పోలీస్ స్టేషన్ల పరిధిలో నాలుగు కేసుల నమోదయ్యాయని సీపీ సుమతి పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు, వృద్ధులు, ఉద్యోగులు, వ్యాపారులే ఈ ముఠా లక్ష్యమని తెలిపారు. పరిచయస్తులు, మధ్యవర్తుల ద్వారా బాధితులకు వల వేస్తారని వివరించారు. భారీ మొత్తంలో రుణాలు ఇప్పిస్తామంటూ నమ్మించి ముందస్తు వడ్డీ పేరుతో భారీగా నగదు వసూళ్లు చేస్తారని చెప్పారు. హామీ ఇచ్చిన రుణం మొత్తం ఇవ్వకుండా కొంత మొత్తమే చెల్లించి అదనపు నగదు వసూళ్లు చేస్తారని పేర్కొన్నారు.

అసలు రుణం కంటే అధిక మొత్తానికి ప్రామిసరీ నోట్లు, బాండ్లు, ఖాళీ చెక్కులపై నిందితులు సంతకాలు తీసుకున్నారని వివరించారు. అప్పు చెల్లించినా పత్రాలు తిరిగి ఇవ్వకుండా అదనపు నగదు కోసం వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు. డబ్బులు ఇవ్వకపోతే క్రిమినల్ కేసులు, భౌతిక దాడులు చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.


ఏఐ ఆధారిత క్యాన్సర్ గుర్తింపు యంత్రం కొనుగోలు చేయాలనుకున్న వృద్ధురాలైన మహిళా వైద్యురాలిని కూడా ఈ ముఠా మోసం చేసిందని మల్కాజ్‌గిరి సీపీ సుమతి వివరించారు. వైద్యురాలికి చెందిన స్కోడా, టయోటా ఇన్నోవా హైక్రాస్ కార్లను బలవంతంగా ఈ ముఠా స్వాధీనం చేసుకుందని తెలిపారు.

నిందితులపై రౌడీ షీట్లు, అవసరమైతే పీడీ యాక్ట్ అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తామని ఆమె తెలిపారు. ఖాళీ చెక్కులు, ప్రామిసరీ నోట్లపై సంతకాలు చేయవద్దని ప్రజలకు మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ సుమతి సూచించారు. ఎల్బీనగర్ జోన్ ఎస్‌ఓటీ, పోలీసుల సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ ద్వారా వీరిని అరెస్ట్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అయ్యప్ప సొసైటీలో సర్వే చేయాలి.. రేవంత్ ప్రభుత్వానికి కవిత డెడ్‌లైన్

పోలింగ్ సజావుగా జరిగేలా సహకరించాలి: సీఎం చంద్రబాబు

For More TG News And Telugu News

Updated Date - Nov 05 , 2026 | 01:52 PM