హైదరాబాద్‌లో భారీగా స్టెరాయిడ్ ఇంజెక్షన్ల పట్టివేత.. ఇద్దరి అరెస్ట్
ABN , Publish Date - Sep 01 , 2026 | 09:09 PM
నగరంలోని చందానగర్‌లో భారీగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లను ఆర్‌సీ పురం ఎస్ఓటి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తనిఖీలు చేపట్టగా.. ఈ ఇంజెక్షన్లతో ఇద్దరు వ్యక్తులు దొరికారు.
హైదరాబాద్: నగరంలోని చందానగర్‌లో భారీగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లను ఆర్‌సీ పురం ఎస్ఓటి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు చందానగర్ పీజేఆర్ స్టేడియం వద్ద చేపట్టిన తనిఖీల్లో స్టెరాయిడ్ ఇంజెక్షన్లతో ఇద్దరు వ్యక్తులు పోలీసులకు చిక్కారు. వారి నుంచి రూ. లక్ష విలువ చేసే ఈ ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకుని, నిందితులిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చట్టవిరుద్ధంగా స్టెరాయిడ్లు విక్రయిస్తున్న వీరిని సరసాయి రామ్, కుంచాల రవీంద్రలగా గుర్తించారు. నిందితుల దగ్గర మెఫెంటెరమైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లు (Wofen 10ml) ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఇద్దరి మధ్య లావాదేవీలు అన్నీ ఆన్‌లైన్ పేమెంట్స్ ద్వారానే జరిగినట్లు వెల్లడించారు. అయితే ఈ విక్రయాల్లో వినియోగదారులుగా ఉన్న దీపక్, సాయి ప్రసాద్, షకీల్, కిషోర్, నితీష్ అనే మరో ఐదుగురు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.