Share News

హైదరాబాద్‌‌లో మరో దగుల్బాజీ దందా.. భారీగా కల్తీ టీ పౌడర్ బట్టబయలు!

ABN , Publish Date - Apr 23 , 2026 | 05:01 PM

హైదరాబాద్‌లో ఇటీవల వెలుగు చూస్తున్న వరుస కల్తీ ఉదంతాలు నగరవాసులను ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. నిన్న మటన్, మొన్న నూనె.. ఇలా రోజుకో కొత్త రూపంలో ప్రాణాంతక కల్తీ దందాలు బయటపడుతున్నాయి. తాజాగా భాగ్యనగరంలో మరో భారీ కల్తీ టీ పౌడర్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు.

హైదరాబాద్‌‌లో మరో దగుల్బాజీ దందా.. భారీగా కల్తీ టీ పౌడర్ బట్టబయలు!
Hyderabad adulterated tea

హైదరాబాద్, ఏప్రిల్ 23: నగరంలో టీ ప్రియుల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కాసులు కురిపించుకుంటున్న ఒక ముఠా ఆట కట్టించారు H-FAST (Hyderabad Food and Adulteration Surveillance Team) పోలీసులు. రహస్య సమాచారం మేరకు జరిపిన మెరుపు దాడుల్లో సుమారు 4 టన్నుల కల్తీ టీ పౌడర్, దానికి సంబంధించిన రసాయనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

వాడిన పొడికే మళ్లీ రంగులు..

సాధారణంగా హోటళ్లు, టీ స్టాళ్లలో వాడి పారేసిన టీ పొడిని సేకరించి, దానికి హానికరమైన రంగులు (Synthetic Colors), కృత్రిమ వాసనలు కలిపి తిరిగి ప్యాక్ చేస్తున్నట్లు విచారణలో తేలింది. ఈ కల్తీ పొడిని చూడగానే అసలైన టీ పొడిలాగే కనిపించేలా రసాయనాలు వాడుతున్నారని పోలీసులు తెలిపారు.


పోలీసుల సీక్రెట్ ఆపరేషన్ - 10 మంది అరెస్ట్

ఈ దందాపై గత కొన్ని రోజులుగా నిఘా పెట్టిన H-FAST పోలీసులు, అత్యంత గోప్యంగా ఆపరేషన్ నిర్వహించి కల్తీ కేంద్రాలపై దాడి చేశారు. ఈ కేసులో మొత్తం 10 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో కల్తీ టీ పొడిని తయారు చేసేవారితో పాటు, తక్కువ ధరకు వస్తుందని తెలిసి కూడా దీన్ని కొనుగోలు చేస్తున్న కొంతమంది టీ షాప్ ఓనర్లు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ కల్తీ టీ పొడిలో కలిపే రంగులు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తాయని ఆహార భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

విజయవాడ కోర్టు భవనంలో నిలిచిన లిఫ్ట్

కేసీఆర్‌పై చర్యలు తీసుకునే దమ్ములేకే మాపై విమర్శలు: కిషన్ రెడ్డి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 23 , 2026 | 05:13 PM