Harish Rao: నిధులు మళ్లీంచిన కేఆర్ఎమ్‌బీ.. చోద్యం చూస్తున్న ప్రభుత్వం: హరీశ్ మండిపాటు
ABN , Publish Date - Jan 08 , 2026 | 04:58 PM
తెలంగాణ, ఏపీ, కేంద్రంలోని బీజేపీ.. మూడు కలిసి టెలీమెట్రిల ఏర్పాటును నిర్లక్ష్యం చేస్తూ, తమ రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్నాయని మాజీ మంత్రి హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. టెలిమెట్రీలు ఏర్పాటు చేస్తున్నామని ప్రచారం చేసుకోవడమే తప్ప రెండేళ్ల నుంచి కేంద్రం చేసిందేమీ లేదన్నారు.
హైదరాబాద్, జనవరి 08: నదీ జలాల వినియోగంలో లెక్కలు తేల్చే టెలిమెట్రీల ఏర్పాటు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. కృష్ణా జలాల వినియోగ లెక్కలు తేల్చేందుకు టెలిమెట్రీల కోసం కేటాయించిన రూ.4.18 కోట్ల నిధులను కేఆర్ఎమ్‌బీ (KRMB) దారి మళ్లిస్తుంటే తెలంగాణ ప్రభుత్వం చోద్యం చూడటం సిగ్గుచేటు అని పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగానే టెలిమెట్రీల ఏర్పాటు ప్రక్రియను ఆలస్యం చేస్తూ.. కృష్ణా జలాలను ఏపీ అక్రమ వినియోగానికి తెలంగాణ ప్రభుత్వం సహకరించడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జూన్, 2016లో జరిగిన కేఆర్ఎమ్‌బీ సమావేశ నిర్ణయం ప్రకారం తొలి దశలో 18 చోట్ల టెలిమెట్రీ పరికరాలు ఏర్పాటు చేయగా.. రెండో దశలో 9 చోట్ల ఏర్పాటు చేయాల్సి ఉందని.. అవి ఇప్పటివరకూ అమలు చేయకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. KRMB నిర్ణయం ధిక్కరిస్తూ టెలిమెట్రీ ఏర్పాటు కోసం నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంటే ఏపీ ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేదు?.. ఎందుకు ఏపీ మీద ఒత్తిడి చేయకుండా మౌనంగా ఉన్నట్లు? అంటూ రేవంత్ సర్కార్‌పై మాజీ మంత్రి హరీశ్ రావు నిప్పులు చెరిగారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణ హక్కులను కాపాడాల్సిన KRMB.. రాష్ట్ర ప్రభుత్వ అలసత్వాన్ని ఆసరాగా చేసుకుని తెలంగాణకు అన్యాయం చేస్తుంటే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
తెలంగాణ, ఏపీ, కేంద్రంలోని బీజేపీ.. మూడు కలిసి టెలీమెట్రిల ఏర్పాటును నిర్లక్ష్యం చేస్తూ తమ రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. టెలిమెట్రీలు ఏర్పాటు చేస్తున్నామని ప్రచారం చేసుకోవడమే తప్ప రెండేళ్ల నుంచి కేంద్రం చేసిందేమీ లేదంటూ హరీశ్ రావు ఈ సందర్భంగా పెదవి విరిచారు. సబ్ జ్యూడీస్ అని సాకులు చెప్పే కేంద్రానికి సుప్రీంకోర్టులో కేసు ఉన్నప్పటికీ కేసీఆర్ 18 చోట్ల టెలిమెట్రీలు ఏర్పాటు చేసిన విషయం గుర్తు లేదా? అంటూ సూటిగా ప్రశ్నించారు.
పోలవరం- నల్లమల సాగర్ విషయంలో మొద్దు నిద్ర ప్రదర్శించినట్లుగానే, టెలిమెట్రీల ఏర్పాటు విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం కావాలనే నిర్లక్ష్యంగా వ్యవహరించడం శోచనీయమని వ్యాఖ్యానించారు. రూ.4.18 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ నిధులను వెంటనే రికవరి అయ్యేలా చేసి, టెలిమెట్రీల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హరీశ్ రావు డిమాండ్ చేశారు.
కేవలం లేఖలు రాస్తూ కాలయాపన చేయకుండా.. నిధులు మళ్లించిన కేఆర్‌ఎమ్‌బీపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నామని రేవంత్ సర్కార్‌కు మాజీ మంత్రి హరీశ్ రావు కీలక సూచన చేశారు.