Share News

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

ABN , Publish Date - Sep 10 , 2026 | 05:17 AM

వర్షాకాల సమావేశాల మొదటిరోజు నుంచే గరంగరంగా నడుస్తున్న శాసనసభ బుధవారం మరింత వేడెక్కింది. తమ మహిళా ఎమ్మెల్యేలపై దాడిచేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని, తమ నాయకుడు కేసీఆర్‌ చావును కోరుకున్న కాంగ్రెస్‌ సభ్యుడు వీర్లపల్లి శంకర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్‌ సభ్యులు సభను స్తంభింపజేశారు.

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌
Telangana Assembly

  • వర్షాకాల సెషన్‌ ముగిసేవరకు 17 మందిని సస్పెండ్‌ చేసిన స్పీకర్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): వర్షాకాల సమావేశాల మొదటిరోజు నుంచే గరంగరంగా నడుస్తున్న శాసనసభ బుధవారం మరింత వేడెక్కింది. తమ మహిళా ఎమ్మెల్యేలపై దాడిచేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని, తమ నాయకుడు కేసీఆర్‌ చావును కోరుకున్న కాంగ్రెస్‌ సభ్యుడు వీర్లపల్లి శంకర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్‌ సభ్యులు సభను స్తంభింపజేశారు. మరోవైపు విపక్షంపై ఎదురుదాడికి దిగిన అధికార పక్షం సభ్యులు.. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌ వద్ద దళితులు నడిచారని పసుపు నీళ్లతో శుద్ధి చేయడంపై కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలని పట్టుబట్టారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. సభను ఆర్డర్‌లో పెట్టేందుకు స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ ఎంత ప్రయత్నించినా సాధ్యం కాకపోవటంతో బీఆర్‌ఎస్‌ సభ్యులను సస్పెండ్‌ చేశారు. వర్షాకాల సమావేశాలు ముగిసేవరకు 17 మంది బీఆర్‌ఎస్‌ సభ్యులను సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. బుధవారం శాసనసభ సమావేశం కాగానే బీఆర్‌ఎస్‌ సభ్యులు నిరసన మొదలుపెట్టారు. కేసీఆర్‌ చావును కోరుకున్న శంకర్‌పై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. శంకర్‌ను సస్పెండ్‌ చేయాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ వెల్‌లోకి దూసుకెళ్లారు. మహిళా సభ్యుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దాదాపు 40 నిమిషాల పాటు నిరసన కొనసాగించారు. అన్ని అంశాలపై చర్చిద్దామని, సభను సజావుగా నడవనివ్వాలని స్పీకర్‌తోపాటు మంత్రి శ్రీధర్‌బాబు, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పదేపదే విజ్ఙప్తి చేసినా బీఆర్‌ఎస్‌ సభ్యులు వినిపించుకోలేదు. వీర్నపల్లి శంకర్‌పై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి చర్యలు తీసుకుంటానని స్పీకర్‌ హామీ ఇచ్చినా శాంతించలేదు.


దీంతో హరీశ్‌రావు, కేటీఆర్‌, తలసాని శ్రీనివా్‌సయాదవ్‌, సబితా ఇంద్రారెడ్డి, మాధవరం కృష్ణారావు, కౌషిక్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, అనిల్‌ జాదవ్‌, కోవా లక్ష్మి, సంజయ్‌కుమార్‌, సునీతా లక్ష్మారెడ్డి, సుధీర్‌రెడ్డి, మల్లారెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, చింత ప్రభాకర్‌, గంగుల కమలాకర్‌లను సమావేశాలు ముగిసేదాకా సస్పెండ్‌ చేయాలని మంత్రి శ్రీధర్‌బాబు రూల్‌ నెం.340(2) ప్రకారం తీర్మానం ప్రవేశపెట్టగా సభ ఆమోదించింది. ఆ వెంటనే బీఆర్‌ఎస్‌ సభ్యులను సస్పెండ్‌ చేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు. గంగుల కమలాకర్‌, మల్లారెడ్డిలను సభకు రాకపోయినా సస్పెండ్‌ చేయటం గమనార్హం.


మండలి నుంచి బీఆర్‌ఎస్‌ వాకౌట్‌

శాసన మండలిలో కూడా బీఆర్‌ఎస్‌ సభ్యులు నిరసన తెలిపారు. కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ ముందు చావు డప్పు మోగించటంపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. తమ సభ్యులు తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డిలపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ సభలో విపక్ష నేత మధుసూదనాచారి నేతృత్వంలో చైర్మన్‌ పోడియం వద్ద నిరసనకు దిగారు. అనంతరం సభ నుంచి వాకౌట్‌ చేశారు. సస్పెండ్‌ అయిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు లాబీల్లోని బీఆర్‌ఎ్‌సఎల్పీ కార్యాలయానికి రావడంతో కొద్దిసేపు గలాటా ఏర్పడింది. బీఆర్‌ఎ్‌సఎల్పీ కార్యాలయంలోకి వెళ్లడానికి వీల్లేదని, బయటకు వెళ్లాలంటూ భద్రతా సిబ్బంది వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రతా సిబ్బంది పక్కకు తప్పుకోగానే వారు కార్యాలయంలోకి వెళ్లి చాలా సేపు చర్చించుకున్నారు. అనంతరం అసెంబ్లీ బయటకు వచ్చి కొద్దిసేపు నిరసన తెలిపారు. అనంతరం గవర్నర్‌ను కలిసేందుకు లోక్‌భవన్‌కు వెళ్లారు. అంతకుముందు అసెంబ్లీ లాబీల్లో పలువురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు. సభలో లేని ఎమ్మెల్యేలను కూడా సస్పెండ్‌ చేశారని, చివరకు తిరుపతికి వెళ్లిన మల్లారెడ్డిని కూడా సస్పెన్షన్‌ జాబితాలో చేర్చారని ఆరోపించారు. కానీ, కేసీఆర్‌ చావును కోరుకున్న సభ్యుడు సభలోనే ఉన్నారని తలసాని ఆగ్రహం వ్యక్తంచేశారు. భట్టి విక్రమార్క సీఎం రేవంత్‌రెడ్డి ఇంటికి వెళితే.. ఇంటిని పసుపు నీళ్లతో కడుగుతున్నారని ఆరోపించారు. తమతో దురుసుగా ప్రవర్తించిన పురుష పోలీసుల గురించి ఎవరూ మాట్లాడడం లేదని సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవాలక్ష్మి ఆవేదన వ్యక్తంచేశారు. మహిళ కానిస్టేబుల్‌కు ఇబ్బంది కలిగిందని కేసు పెట్టించారని, మరి తాము కూడా మహిళలమే కదా? అని ప్రశ్నించారు.


ప్రజాసమస్యల సస్పెన్షన్‌: హరీశ్‌రావు

తమను సస్పెండ్‌ చేయటంపై హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఇది ప్రతిపక్ష బీఆర్‌ఎ్‌సపై విధించిన సస్పెన్షన్‌ కాదు. గుర్తుంచుకోండి రేవంత్‌ రెడ్డీ... ఇది ప్రజా సమస్యలపై విధించిన సస్పెన్షన్‌. ఇది తెలంగాణ ప్రజల గొంతుపై విధించిన సస్పెన్షన్‌. ప్రశ్నిస్తారన్న భయంతోనే మమ్మల్ని బయటకు పంపారు’ అని ఒక ప్రకటనలో ఆరోపించారు.

Updated Date - Sep 10 , 2026 | 05:32 AM