నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు.. కలెక్టర్లకు సీఎం రేవంత్ వార్నింగ్
ABN , Publish Date - May 12 , 2026 | 01:04 PM
తెలంగాణలో మొక్కజొన్న కొనుగోలు, వరి ధాన్యం సేకరణపై జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సీఎం ఆదేశించారు.
హైదరాబాద్, మే 12: ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం.. జిల్లా కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోలు, వరి ధాన్యం సేకరణపై జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమీక్ష చేశారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సీఎం ఆదేశించారు. అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి కొనుగోళ్ల తీరును పరిశీలించాలని.. గన్ని బ్యాగులు, హమాలీల కొరత లేకుండా చూసుకోవాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు గోడౌన్స్‌కు తరలించాలని అన్నారు.
ధాన్యం లోడ్ తరలించేందుకు ఒప్పందం మేరకు సరిపడా లారీలను అందుబాటులో ఉంచని కాంట్రాక్టర్లను ఉపేక్షించొద్దని.. అవసరమైతే అలాంటి వారిపై క్రిమినల్ కేసులకు వెనకాడవద్దని ముఖ్యమంత్రి ఆదేశించారు. ధాన్యం తరలింపునకు అవసరమైన వాహనాలను అందుబాటులో ఉండేలా చూడాలని రవాణా శాఖ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. సమస్య తీవ్రతను గుర్తించి జిల్లా కలెక్టర్లు సరైన చర్యలు తీసుకోవాల్సిందే అని.. ప్రతి అధికారి జవాబుదారీతనంతో వ్యవహరించాల్సిందే అని తేల్చిచెప్పారు. నిర్లక్ష్యం వహిస్తే కలెక్టర్లపై చర్యలకు ప్రభుత్వం వెనకాడదని హెచ్చరించారు.
గోడౌన్స్ సమస్య ఉన్న ప్రాంతాల్లో అవసరాన్నిబట్టి తాత్కాలిక ఏర్పాట్లు చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. రైతుబజార్లు, ఫంక్షన్ హాల్స్‌ను ఎంగేజ్ చేసి ధాన్యాన్ని తరలించాలన్నారు. వెసులుబాటు ఆధారంగా అక్కడినుంచి గోడౌన్స్‌కు తరలించేలా ప్రణాళికలుండాలని తెలిపారు. మొక్కజొన్న పంట ఎక్కువగా వచ్చే జిల్లాల కలెక్టర్లు కొనుగోళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎక్కడా రైతులకు ఇబ్బందులు కలగొద్దని తెలిపారు. అవసరమైన చోట పోలీస్ సహాయం తీసుకుని కలెక్టర్లు ధాన్యం సేకరణ సాఫీగా జరిగేలా చూడాలని సూచించారు. కొనుగోళ్లపై ఎప్పటికప్పుడు సీఎస్‌కు పోర్ట్ పంపించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
ధాన్యం లోడింగ్‌లో జాప్యం జరగకుండా స్థానికంగా ఉన్న హమామీలను గుర్తించి వారితో పని చేయించుకోవాలని రేవంత్ తెలిపారు. ధాన్యం లోడ్ చేసిన వెంటనే రైతులకు రశీదు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో లారీల కొరత ఉంటే ట్రాక్టర్లు, ఇతర వాహనాలను వినియోగించాలని సూచించారు. అకాల వర్షాల సమయంలో ధాన్యం తడవకుండా అవసరమైన టార్పాలిన్లను రైతులకు అందుబాటులో ఉంచాలన్నారు. అకాల వర్షాల సమయంలో నష్టం జరగకుండా శాశ్వత పరిష్కారానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కలెక్టర్లకు సూచించారు.
వాతావరణ శాఖ సూచనల ఆధారంగా ఎప్పటికప్పుడు రైతులను అప్రమత్తం చేసేందుకు మండల స్థాయిలో ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని సీఎం ఆదేశించారు. వాతావరణ సూచనలను రైతులకు చేరవేసేందుకు ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రతి ఐకేపీ సెంటర్‌కు ఒక అధికారిని నియమించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతి రైస్ మిల్లు దగ్గర ఒక బాధ్యతాయుతమైన అధికారిని నియమించి పర్యవేక్షించాలన్నారు. మిషన్ మోడ్‌లో పనిచేస్తేనే సమస్యలు వేగంగా పరిష్కారమవుతాయని తెలిపారు. కలెక్టర్లు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తేనే సమస్యలు తలెత్తవని.. ఏ సమస్య వచ్చినా కలెక్టర్లదే బాధ్యత అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు.
ఇవి కూడా చదవండి...
ఒకే రోజు మూడు చోట్ల చైన్ స్నాచింగ్స్.. భయాందోళనలో ప్రజలు
చంచల్‌గూడ జైలు అధికారుల వినూత్న ప్రయోగం
Read Latest Telangana News And Telugu News