Share News

గ్యారంటీలపై సందేహాలుంటేతెలంగాణకు రండి

ABN , Publish Date - Apr 03 , 2026 | 05:08 AM

కేరళ యూడీఎఫ్‌ ప్రకటించిన 5 గ్యారంటీలపై విమర్శలు చేస్తున్న వాళ్లు అవి ఎలా అమలవుతాయో తెలుసుకోవాలంటే తెలంగాణకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు.

గ్యారంటీలపై సందేహాలుంటేతెలంగాణకు రండి

  • అమలు తీరును ప్రత్యక్షంగా చూపిస్తాం

  • కేరళ సీఎంకు రేవంత్‌రెడ్డి ఆహ్వానం

  • మోదీ, విజయన్‌ రాజకీయ అన్నదమ్ములే

  • అవినీతిలో విజయన్‌, కేసీఆర్‌ ఒక్కటే

  • కేంద్రం నిధులు మోదీ కరుణ కాదు

  • మ్యానిఫెస్టో విడుదల సందర్భంగా వ్యాఖ్యలు

హైదరాబాద్‌, మార్చి 2(ఆంధ్రజ్యోతి): కేరళ యూడీఎఫ్‌ ప్రకటించిన 5 గ్యారంటీలపై విమర్శలు చేస్తున్న వాళ్లు అవి ఎలా అమలవుతాయో తెలుసుకోవాలంటే తెలంగాణకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. కాంగ్రెస్‌ పాలనలో తెలంగాణలో అమలవుతున్న పథకాలను ప్రత్యక్షంగా చూసి.. తమ ట్రాక్‌ రికార్డు పరిశీలించుకోవచ్చన్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, మంత్రులు తెలంగాకు వస్తే తాము గ్యారెంటీలను ఎలా అమలు చేస్తున్నామో ప్రత్యక్షంగా చూపిస్తామంటూ ఆహ్వానించారు. కేరళలో పినరయి విజయన్‌ పాలన ముగిసిందని, ఇక యూడీఎఫ్‌ స్వర్ణయుగం మొదలు కానుందని ధీమా వ్యక్తం చేశారు. కేరళ రాష్ట్రం కొచ్చిలో గురువారం యూడీఎఫ్‌ ఎన్నికల మేనిఫెస్టోను సీఎం రేవంత్‌రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోదీ, పినరయి విజయన్‌లను రాజకీయ సోదరులుగా పోల్చారు. ఒకరు ఢిల్లీని పాలిస్తుంటే.. మరొకరు కేరళను పాలిస్తున్నారన్నారు. దేవుడి సొంత భూమి కేరళలో దేవుడి ఆస్తికి రక్షణ లేకుండా పోయిందని శబరిమల బంగారం దారి మళ్లింపు ఘటనను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అవినీతి, అసమర్థ, కుటుంబ పాలన విషయంలో పినరయి విజయన్‌, కేసీఆర్‌లకు దగ్గర పోలికలు ఉన్నాయని రేవంత్‌ అన్నారు. 2014 నుంచి దాదాపు పదేళ్ల పాటు తెలంగాణను కేసీఆర్‌ పాలిస్తే పదేళ్లుగా కేరళలో విజయన్‌ పరిపాలిస్తున్నారని చెప్పారు. 2023 ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను గద్దె దించినట్లుగానే ఈ ఎన్నికల్లో కేరళ ప్రజలు విజయన్‌ను గద్దె దింపుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. ‘‘పో మోనే విజయా’’ డైలాగ్‌పై మీడియా అడిగిన ప్రశ్నకు రేవంత్‌ స్పందిస్తూ, విజయన్‌ తమకు రాజకీయ ప్రత్యర్థి అని, విమర్శ చేయకుండా ఎలా ఉంటామని బదులిచ్చారు. అవినీతి నియంత్రణ, పన్ను వసూళ్లలో లీకేజీలను అరికట్టడం, కేంద్ర పథకాలను వినియోగించుకోవడం, కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సిన నిధులను రాబట్టుకోవడం తమ ప్రాధాన్య అంశాలని సీఎం రేవంత్‌ చెప్పారు. కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చే నిధులు ఏమీ ప్రధాని మోదీ కరుణ చూపడంతో వచ్చేవి కావని, అవి రాష్ట్రాల ప్రజల హక్కు అని స్పష్టం చేశారు.


తొలి క్యాబినెట్‌ నుంచే హామీలను అమలు

యూడీఎఫ్‌ ఐదు గ్యారెంటీలు అమలు సాధ్యమా అంటున్న వారికి సమాధానం తెలంగాణ రాష్ట్రమేనని రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి క్యాబినెట్‌ సమావేశం నుంచే గ్యారంటీలను విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో 25 లక్షల రైతు కుటుంబాలకు రూ.21 వేల కోట్ల మేర రుణాలను మాఫీ చేశామని తెలిపారు. సాగు చేసుకునే రైతులకు ఎకరాకు రూ.12 వేలు చొప్పున ఏడాదికి రూ.18 వేల కోట్లు రైతు భరోసా కింద అందజేస్తున్నామని చెప్పారు. తెలంగాణలో ఇప్పటికి 67,173 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని, వివిధ శాఖల్లో నియామకాలు పూర్తి చేయడంతో పాటు ప్రజల సమక్షంలో ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేశామని వివరించారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని, 10 వేల బస్సులు, 50 వేల సిబ్బందితో ఉన్న ఆర్టీసీని నష్టాల నుంచి లాభాల్లోకి తీసుకువచ్చామని వివరించారు. ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలకు నెలకు రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకు ఆదా అవుతోందన్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందిస్తున్నామని, 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి, ఒక్కో ఇంటినిర్మాణానికి రూ.5 లక్షల చొప్పున మంజూరు చేస్తున్నామని వెల్లడించారు. 500కే గ్యాస్‌ సిలిండర్‌ పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ రైజింగ్‌ విజన్‌ డాక్యుమెంట్‌-2047 ప్రకారం తెలంగాణను 2034 నాటికి 1 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ, 2047 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా నిలపనున్నామని చెప్పారు. తెలంగాణ వృద్థిరేటు 10.8 శాతంగా ఉందని అన్నారు.

కేరళలోనూ మహిళలకు ఉచిత బస్సు

కేరళలోనూ మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కార్యక్రమాన్ని కాంగ్రెస్‌ తన గ్యారెంటీల్లో చేర్చింది. కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలోని యూడీఎఫ్‌ కేరళ ఎన్నికల సందర్భంగా ఐదు గ్యారెంటీలు ప్రకటించగా అందులో మొదటి గ్యారెంటీగా కేఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని చేర్చింది. రెండో గ్యారెంటీగా కాలేజీల్లో విద్యను అభ్యసిస్తున్న బాలికలకు నెలకు రూ.1,000 ఆర్థిక సహాయం, మూడో గ్యారెంటీగా సంక్షేమ పింఛన్లు నెలకు రూ.3 వేలకు పెంపు, నాలుగో గ్యారెంటీగా మాజీ సీఎం ఉమెన్‌ చాందీ పేరుతో ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా, ఐదో గ్యారెంటీగా యువతకు స్వయం ఉపాధి కోసం రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు పేర్కొంది. వీటితో పాటుగా సముద్ర, విమానయాన రంగాలకు సంబంధించి ఐదు డ్రీమ్‌ ప్రాజెక్టులు, వయనాడ్‌లో గిరిజన వర్సిటీ ఏర్పాటు వాగ్దానాలు ఉన్నాయి.

Updated Date - Apr 03 , 2026 | 05:08 AM