Share News

అసదుద్దీన్ ఒవైసీ బరితెగించి మాట్లాడుతున్నారు: కేంద్ర మంత్రి బండి సంజయ్

ABN , Publish Date - Jul 05 , 2026 | 09:25 PM

తెలంగాణ కాంగ్రెస్ అండతోనే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ బరితెగించి మాట్లాడుతున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. హైకోర్టునే బెదిరించేలా ఒవైసీ వ్యాఖ్యలు చేస్తున్నారని, అడ్డగోలుగా తప్పులు చేస్తూ ఇప్పుడు కోర్టునే ప్రశ్నించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.

అసదుద్దీన్ ఒవైసీ బరితెగించి మాట్లాడుతున్నారు: కేంద్ర మంత్రి బండి సంజయ్
Union Minister Bandi Sanjay

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ అండతోనే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ బరితెగించి మాట్లాడుతున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. హైకోర్టునే బెదిరించేలా ఒవైసీ వ్యాఖ్యలు చేస్తున్నారని, అడ్డగోలుగా తప్పులు చేస్తూ ఇప్పుడు కోర్టునే ప్రశ్నించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. కోర్టులు, చట్టాల పట్ల ఎంఐఎంకు ఎలాంటి గౌరవం లేదని బండి సంజయ్ మండిపడ్డారు.


ఫాతిమా విద్యా సంస్థలకు సంబంధించిన అంశంలో హైకోర్టు లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం స్పష్టమైన వివరణ ఇవ్వకుండా జాప్యం చేయడం అనుమానాలకు తావిస్తోందని కేంద్ర మంత్రి అన్నారు. చెరువును ఆక్రమించి విద్యా సంస్థలను నిర్మించడం తప్పని పేర్కొన్నారు. గండిపేటలో ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న ఇతర విద్యా సంస్థలకు వరుసగా కూల్చివేత నోటీసులు జారీ చేస్తున్న ప్రభుత్వం.. ఒవైసీ ఆధ్వర్యంలోని ఫాతిమా విద్యా సంస్థల విషయంలో మాత్రం ఎందుకు మౌనం వహిస్తోందని ప్రశ్నించారు. 'ఒవైసీకి ఒక న్యాయం.. ఇతరులకు మరో న్యాయమా?' అని బండి సంజయ్ నిలదీశారు. చట్టం ముందు అందరూ సమానమే అయితే ఫాతిమా విద్యా సంస్థలపై కూడా అదే విధమైన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు.


ఫాతిమా విద్యా సంస్థ మిలిటెంట్లకు షెల్టర్ ఇచ్చిందనే ఆరోపణలను కూడా బండి సంజయ్ ప్రస్తావించారు. ఆ ఆరోపణలు నిజం కాదా? అని ప్రశ్నించారు. విద్యార్థులకు చదువు ముసుగులో మిలిటెంట్లను తయారు చేస్తున్నారా? అనే ప్రశ్నకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే అక్రమ నిర్మాణాలపై ఎలాంటి రాజీ ఉండదని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఫాతిమా విద్యా సంస్థలు చట్టవిరుద్ధంగా నిర్మించబడినట్లు తేలితే వాటిని కూల్చివేస్తామని హెచ్చరించారు. అయితే ఆ సంస్థల్లో ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు.


అక్రమార్కులకు, అవినీతిపరులకు భయమంటే ఏమిటో బీజేపీ ప్రభుత్వం చూపిస్తుందని కేంద్రమంత్రి బండి సంజయ్ హెచ్చరించారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

కన్నెపల్లి పంప్‌హౌస్‌ను ముట్టడించి మోటార్లు ఆన్ చేస్తాం: కేటీఆర్..

వర్షాకాలపు సమస్యలపై చర్యలేవి రేవంత్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..

Updated Date - Jul 05 , 2026 | 09:37 PM