సస్పెన్షన్‌లో ఉన్న అదనపు ఎస్పీ భుజంగరావుపై ఏసీబీ కేసు..
ABN , Publish Date - Jun 03 , 2026 | 07:58 PM
సస్పెన్షన్‌లో ఉన్న అదనపు ఎస్పీ నాయిని భుజంగరావుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసును ఏసీబీ నమోదు చేసింది. హైదరాబాద్‌లోని నివాసంతో పాటు 15 ప్రాంతాల్లో అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.
హైదరాబాద్: సస్పెన్షన్‌లో ఉన్న అదనపు ఎస్పీ నాయిని భుజంగరావుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసును ఏసీబీ నమోదు చేసింది. అక్రమాస్తులు కూడబెట్టినట్లు వచ్చిన ఆరోపణలపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి, హైదరాబాద్‌లోని ఆయన నివాసంతో పాటు 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో ఉన్న 27.29 ఎకరాల వ్యవసాయ భూములకు సంబంధించిన పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఐదు ఓపెన్ ప్లాట్లు, రెండు నివాస గృహాలు, ఒక వాణిజ్య భవనాన్ని గుర్తించారు.
భుజంగరావు నివాసంలో రూ.3.83 లక్షల నగదు, బ్యాంకు ఖాతాల్లో సుమారు రూ.8 లక్షలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అదనంగా సుమారు ఒక కిలో బంగారు ఆభరణాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. సోదాల్లో భాగంగా మారుతి స్విఫ్ట్, కియా సెల్టోస్ కార్లను కూడా గుర్తించినట్లు ఏసీబీ తెలిపింది. ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల మొత్తం డాక్యుమెంట్ విలువ సుమారు రూ.5.92 కోట్లుగా అంచనా వేస్తున్నామని, అయితే మార్కెట్ విలువ దీనికంటే మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
ఇక సోదాల సమయంలో 29 మద్యం బాటిళ్లు కూడా లభ్యమైనట్లు వెల్లడించిన ఏసీబీ, దీనిపై తదుపరి చర్యల కోసం ఎక్సైజ్ శాఖకు సమాచారం అందించినట్లు తెలిపింది. భుజంగరావుకు చెందిన మరిన్ని ఆస్తులు, పెట్టుబడులపై విచారణ కొనసాగుతోందని ఏసీబీ వెల్లడించింది. కేసులో నిందితులను నాంపల్లి ప్రత్యేక ఏసీబీ కోర్టులో రిమాండ్ కోసం హాజరుపరుస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Also Read:
ప్రపంచ సైకిల్ దినోత్సవం 2026.. సైకిల్ తొక్కితే ఆరోగ్యానికి ఎన్ని లాభాలో
For More Latest News