Share News

143 మిల్లులు బ్లాక్‌ లిస్ట్‌లో!

ABN , Publish Date - Oct 04 , 2026 | 07:13 AM

కస్టమ్‌ మిల్లింగ్‌కు ఇచ్చిన వరి ధాన్యాన్ని అమ్ముకొని సొమ్ము చేసుకున్న రైస్‌ మిల్లర్లపై ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది.

143 మిల్లులు బ్లాక్‌ లిస్ట్‌లో!
Rice Mill

  • ఈ మిల్లులకు కస్టమ్‌ మిల్లింగ్‌

  • కోసం వరి ధాన్యం కేటాయింపులుండవ్‌

  • విజిలెన్స్‌ నివేదిక ఆధారంగా నిర్ణయం

  • బ్లాక్‌ లిస్టు, వైట్‌ లిస్టు జాబితా నేడోరేపో

  • కొనసాగుతున్న తనిఖీలు..

  • బ్లాక్‌ లిస్ట్‌లో మిల్లుల సంఖ్య పెరిగే అవకాశం?

హైదరాబాద్‌, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): కస్టమ్‌ మిల్లింగ్‌కు ఇచ్చిన వరి ధాన్యాన్ని అమ్ముకొని సొమ్ము చేసుకున్న రైస్‌ మిల్లర్లపై ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ విభాగాన్ని రంగంలోకి దించి దారి మళ్లించిన ధాన్యానికి ప్రతి పైసా లెక్క గట్టి మిల్లర్ల నుంచి ఆ డబ్బంతా కక్కిస్తోంది. అదే సమయంలో ఆ విభాగం నివేదిక ప్రకారం రూ.కోట్లలో బకాయి పడ్డ మిల్లర్లను గుర్తించి బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టాలని నిర్ణయించింది. గత రెండు నెలల్లో విజిలెన్స్‌ బృందాలు 149రైస్‌మిల్లుల్లో దాడులు నిర్వహించాయి. వీటిలో ఆరు రైస్‌మిల్లుల్లోనే నిల్వలు, నిర్వహణ సక్రమంగా ఉన్నట్లు, 143 రైస్‌మిల్లుల్లో అవినీతి, అక్రమాలు జరిగినట్లు గుర్తించింది. ఈ 143 మిల్లులను బ్లాక్‌లిస్టులో చేర్చాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.


విజిలెన్స్‌ దాడులు కొనసాగుతుండటంతో బ్లాక్‌ లిస్ట్‌ జాబితాలో మిల్లుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఖరీఫ్‌ ధాన్యం సేకరణ ఊపందుకునే నాటికి రైస్‌మిల్లుల లెక్క తేల్చాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. బ్లాక్‌ లిస్టు, వైట్‌ లిస్టు పేరుతో 2 జాబితాలను రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ తయారుచేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం రైస్‌మిల్లులను జల్లెడ పడుతోంది. ప్రభుత్వానికి బకాయులున్న రైస్‌మిల్లులను బ్లాక్‌లిస్టులో, ఎలాంటి బకాయులులేని రైస్‌మిల్లును వైట్‌ లిస్టులో పెట్టాలని అధికారులు నిర్ణయించారు. ఈ జాబితా నేడో, రేపో ఖరారు చేయనున్నారు. కాగా విజిలెన్స్‌ నివేదికల ఆధారంగా బ్లాక్‌ లిస్టులో చేర్చిన మిల్లులకు ఖరీఫ్‌ ధాన్యం ఇవ్వరు. సీజన్‌ ముగిసేలోపు ఆ మిల్లులు బకాయిలు చెల్లిస్తే, వైట్‌ లిస్టులోకి మారుస్తారు. రైస్‌ మిల్లులకు లాక్‌, అన్‌లాక్‌ సిస్టమ్‌ కూడా పెట్టారు. స్వయంగా పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర పర్యవేక్షణలో ఈ వ్యవస్థ నడుస్తోంది.


రైస్‌మిల్లు నంబరును అన్‌లాక్‌ చేసి ఇస్తేనే వారికి ధాన్యం కేటాయింపులు చేయాల్సి ఉంటుంది. ఇదంతా ఆన్‌లైన్‌ ప్రక్రియ ద్వారా జరుగుతుంది. కాగా విజిలెన్స్‌ బృందాలు గత జూలై ఆరో తేదీ నుంచి రంగలోకి దిగాయి. ‘టెండర్లు వేస్తే... అంతుచూస్తాం!’ శీర్షికతో జూలై ఆరో తేదీన ‘ఆంధ్రజ్యోతి’ ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనంపై అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. సీఎం రేవంత్‌రెడ్డి ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. వెంటనే విజిలెన్స్‌- ఎన్‌ఫోర్సుమెంట్‌ బృందాలను రంగంలోకి దిగారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైస్‌మిల్లుల్లో తనిఖీలు పక్కాగా నిర్వహించాలని, మిల్లర్లు స్వాహా చేసిన ధాన్యం తాలుకు డబ్బెంతో లెక్కతేల్చి.. వసూలు చేయించాలని, ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆ మేరకు ప్రత్యేక బృందాలతో రంగంలోకి దిగిన అధికారులు మూడు నెలల వ్యవధిలో రూ.1,400 కోట్లు రికవరీ చేశారు. గురువారం కూడా అధికారులు 12 రైస్‌మిల్లుల్లో తనిఖీలు నిర్వహించారు. గతంలో బియ్యం ఎగ్గొట్టి బ్లాక్‌ లిస్టులోకొచ్చిన రైస్‌మిల్లులు 500 వరకు ఉన్నాయి. వాటికి మూడేళ్లుగా ధాన్యం ఇవ్వటంలేదు. వీటిలో 450 రా రైస్‌మిల్లులు, 50 బాయిల్డ్‌ రైస్‌మిల్లులు ఉన్నాయి. పాత, కొత్త అనే తేడాలేకుండా మొత్తం రాష్ట్రంలోని రైస్‌మిల్లుల బ్లాక్‌ లిస్టు, వైట్‌ లిస్టు లెక్క పక్కాగా తేల్చే పనిలో రాష్ట్ర పౌరసరఫరాలశాఖ అధికారులు నిమగ్నమయ్యారు.

Updated Date - Oct 04 , 2026 | 07:13 AM