హైదరాబాద్ మీర్‌పేట్‌లో ఐదో అంతస్తు నుంచి కూలిన లిఫ్ట్.. ఏం జరిగిందంటే?
ABN , Publish Date - Jun 27 , 2026 | 04:37 PM
హైదరాబాద్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. ఓ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ చూసి తిరిగి వస్తున్న ఒకే కుటుంబానికి చెందినవారు లిఫ్ట్ ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి.
హైదరాబాద్, జూన్ 27: నగరంలోని మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం జరిగిన లిఫ్ట్ ప్రమాదం తీవ్ర కలకలం రేపింది. ఓ అపార్ట్‌మెంట్‌లో ఐదో అంతస్తు నుంచి లిఫ్ట్ ఒక్కసారిగా తెగి కిందపడటంతో అందులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. సమాచారం ప్రకారం.. గాయపడిన వారంతా ఫ్లాట్‌ను చూసేందుకు వచ్చిన వారే. బాధితుల్లో ఎక్కువ మంది వృద్ధులు ఉండటంతో గాయాల తీవ్రత అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకేసారి పలువురు లిఫ్ట్‌లో ఎక్కిన సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం.
ఘటన జరిగిన వెంటనే స్థానికులు అప్రమత్తమై లిఫ్ట్‌లో చిక్కుకున్న వారిని బయటకు తీసి సమీప ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. లిఫ్ట్ కూలడానికి గల అసలు కారణాలపై పోలీసులు, సంబంధిత అధికారులు దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక లోపం వల్ల ప్రమాదం జరిగిందా, లేక నిర్వహణలో నిర్లక్ష్యం కారణమా అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది.