లక్ష టన్నుల గబ్బు
ABN , Publish Date - Apr 25 , 2026 | 06:38 AM
ఎకరాల పరిధిలో ఎటు చూసినా చెత్త.. కాస్తా కూస్తా కాదు.. లక్ష టన్నుల చెత్త! దాన్నుంచి వెలువడే మీథేన్, లీచెట్ వంటి హానికర వాయువులతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల...
జవహర్‌నగర్‌లో పేరుకుపోతున్న చెత్త
భారీగా వెలువడుతున్న మీథేన్ వాయువు
గంటకు 5.9 టన్నులు విడుదల.. అది పది లక్షల కార్ల కర్బన ఉద్గారాలతో సమానం
క్యాలిఫోర్నియా వర్సిటీ పరిశీలనలో గుర్తింపు
ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం: వైద్య నిపుణులు
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): ఎకరాల పరిధిలో ఎటు చూసినా చెత్త.. కాస్తా కూస్తా కాదు.. లక్ష టన్నుల చెత్త! దాన్నుంచి వెలువడే మీథేన్, లీచెట్ వంటి హానికర వాయువులతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది!! రాజధాని హైదరాబాద్‌లోని జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ పరిస్థితి ఇది. ‘‘ఈ డంపింగ్ యార్డ్ వల్ల పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడుతోంది.. మా ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి.. చెరువులు, భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి.. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో బతుకీడుస్తున్నాం’’ అని చాలాకాలంగా అక్కడి ప్రజలు ఆందోళనగా చెబుతున్నదే నిజమని తేలింది. జవహర్‌నగర్ డంపింగ్ యార్డులోని చెత్త గుట్టల(ల్యాండ్ ఫిల్) నుంచి గంటకు 5.9 టన్నుల మీథేన్ గ్యాస్ వెలువడుతోందని.. సాఫ్ట్ మీథేన్ ప్రాజెక్టులో భాగంగా యూనివర్సిటీ ఆఫ్ క్యాలిఫోర్నియా (లాస్‌ఏంజెలెస్) 2025లో చేసిన పరిశీలనలో తేలింది. ఇది ఏకకాలంలో 10 లక్షల కార్లు ప్రయాణిస్తే లేదా బొగ్గు మండించి 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తే పర్యావరణంపై పడే ప్రభావానికి సమానమని నిపుణులు చెబుతున్నారు. సాఫ్ట్ మీథేన్ ప్రాజెక్టులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లోని డంపింగ్‌యార్డులను పరిశీలించగా.. 25 చోట్ల టన్నుల్లో మీథేన్ గ్యాస్ వెలువడుతున్నట్టు వెల్లడైంది. ఆ 25 ప్రాంతాల్లో.. జవహర్‌నగర్ 4వ స్థానంలో నిలవడం గమనార్హం. ముంబైలోని ఓ డంపింగ్ యార్డు గంటకు 4.9 టన్నుల మీథేన్ ఉద్గారాలతో 12వ స్థానంలో ఉంది. జవహర్‌నగర్‌లో వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ, నిల్వ జరుగుతోందంటూ జీహెచ్‌ఎంసీ, రాంకీ ఎన్వీరో సంస్థ చెబుతున్న మాటలు అబద్ధాలని ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయి.
ఇదీ కారణం..
ట్రై కార్పొరేషన్ల నుంచి ప్రస్తుతం జవహర్‌నగర్‌కు నిత్యం సగటున 9600 మెట్రిక్ టన్నుల చెత్త తరలిస్తున్నారు. తడి, పొడి చెత్త వేరు చేయకుండా యార్డులో ఒకే చోట కుప్పగా పోస్తున్నారు. యంత్రాల ద్వారా రోజూ 1000 నుంచి 1200 టన్నుల చెత్త వేరు చేస్తున్నారు. మిగతా చెత్త అలానే పేరుకుపోతోంది. యంత్రాల సామర్ధ్యం పరిమితంగా ఉండడంతో ఒక రోజు వెలువడిన చెత్త వేరు చేసేందుకు తొమ్మిది నుంచి పది రోజులు పడుతోంది. అప్పటి వరకు మిగతా చెత్త ఆరు బయట నిల్వ చేస్తున్నారు. ఎప్పుడు చూసినా యార్డులో 80 వేల నుంచి లక్ష టన్నుల వరకు చెత్త పేరుకుపోయి ఉంటోంది. ఈ వ్యర్ధాల నుంచి భారీగా మీథేన్ గ్యాస్ వెలువడుతోంది. కార్బన్ డయాక్సైడ్‌తో పోలిస్తే మీథేన్ 20 నుంచి 25 రెట్లు అధికంగా భూతాపానికి కారణమవుతుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు.

ఆరోగ్యంపై ప్రభావం
డంపింగ్‌యార్డ్ నుంచి మీథేన్‌తోపాటు.. ఇంకా పలు హానికారక వాయువులు విడుదలవుతాయి. కుళ్లిన చెత్తద్వారా అత్యధికంగా మీథేన్ వెలువడుతుంది. దీంతో గాలిలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గుతాయి. ఫలితంగా తలతిరగడం, వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు వస్తాయి. ఎక్కువగా పీలిస్తే గుండె సంబంధిత, మానసిక సమస్యలు తలెత్తుతాయి. మీథేన్‌కు మండే స్వభావం ఉండడం వల్ల అగ్ని ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉంటుంది.
ప్రొఫెసర్ మురళీధర్‌రెడ్డి,
డిపార్ట్‌మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ, ఉస్మానియా వర్సిటీ
ఈ వార్తలు కూడా చదవండి...
ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్.. హనీట్రాప్ ముఠా సంచలనం
శబరిమల కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
బాలికల కాలేజీలో కోఎడ్యుకేషన్ ఏర్పాటుపై హైకోర్టు అసంతృప్తి
Read Latest AP News And Telangana News And International News