Share News

హాస్టల్‌ భవనం ఓ పక్కకు ఒరిగింది!

ABN , Publish Date - Sep 19 , 2026 | 05:46 AM

గోపన్‌పల్లి ఎన్టీఆర్‌ నగర్‌లో జీ+4 మెన్స్‌ పీజీ హాస్టల్‌ భవనం ఒక్కసారిగా పక్కకు ఒరిగింది. భవనంలోని 35 మంది సురక్షితంగా బయటపడ్డారు; అధికారులు భవనాన్ని పరిశీలించి కూల్చివేతకు ఏర్పాట్లు చేస్తున్నారు.

హాస్టల్‌ భవనం ఓ పక్కకు ఒరిగింది!
Gopanpally PG hostel

  • గోపన్‌పల్లిలో 50 గజాల్లో జీ ప్లస్‌ 4తో నిర్మాణం

  • లోపల 35 మంది నివాసం.. పైకి లేచిన టైల్స్‌.. ఆపై పెద్ద శబ్దం

  • భయంతో బయటకు పరుగులు.. అంతా క్షేమం.. కూల్చివేతకు చర్యలు

రాయదుర్గం,సెప్టెంబరు18 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని గచ్చిబౌలి అంజయ్యనగర్‌లో భవనం కూలిన ఘటన మరువక ముందే అదే తరహా ఘటన మరొకటి చోటు చేసుకుంది. గోపన్‌పల్లిలోని ఎన్టీఆర్‌ నగర్‌లో జీప్లస్‌ 4 అంతస్తుల్లో ఉన్న ఓ మెన్స్‌ పీజీ హాస్టల్‌ భవనం శుక్రవారం తెల్లవారుజామున పక్కకు ఒరిగింది. ఈ దెబ్బకు భవనం లోపల పెద్ద శబ్దం రావడంతోపాటు గదుల్లోని టైల్స్‌ పైకి లేచాయి, తలుపులు వంకర తిరిగాయి. దీంతో హాస్టల్‌లో నిద్రలో ఉన్నవారంతా మేల్కోని భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. ఆ భవనంలో సుమారు 35 మంది నివాసం ఉంటుండగా అందరూ అదృష్టవసాత్తు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. భవనం కుప్పకూలి ఉంటే భారీ నష్టం జరిగి ఉండేది.


స్థానికుల కథనం ప్రకారం.. దుబాయ్‌లో నివాసముండే లక్ష్మీరెడ్డి అనే వ్యక్తి గోపన్‌పల్లి ఎన్టీఆర్‌నగర్‌లోని సర్వే నెంబర్‌ 124, ప్లాట్‌నెంబర్‌ 31లో ఉన్న సుమారు 50 గజాల స్థలంలో ఈ జీ+4 భవనాన్ని రెండేళ్ల క్రితం నిర్మించారు. 11 నెలల క్రితం ఈ భవనాన్ని అద్దెకు తీసుకున్న అజర్‌ అనే వ్యక్తి అందులో మెన్స్‌ పీజీ హాస్టల్‌ నిర్వహిస్తున్నాడు. శుక్రవారం తెల్లవారుజూమున చుట్టుపక్కల వారు చూసేసరికి ఆ భవనంలో ఉన్నవారంతా తమ సామానుతో బయటకు వచ్చేశారు. ఏం జరిగిందని విచారించగా భవనం ఒరిగిందని, గదుల్లోని టైల్స్‌ ఎగిరి పడ్డాయని, తలుపులు వంకర్లు తిరిగాయని దాంతో భయంతో బయటకు వచ్చేశామని వివరించారు.


దీనిపై స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న సీఎంసీ, హైడ్రా అధికారులు ఘటనా స్థలికి చేరుకొని భవనాన్ని పరిశీలించారు. ముందుజాగ్రత్త చర్యగా చుట్టు పక్కల భవనాల్లో ఉండే వారిని కూడా ఖాళీ చేయించారు. భవనం కూల్చివేతకు ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం రాత్రి నుంచే భవనం కూల్చివేత పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని టౌన్‌ ప్లానింగ్‌ అఽధికారి అక్బర్‌ తెలిపారు. ఒరిగిన భవనాన్ని ఆనుకొని అత్యంత సమీపంగా మరో ఐదంతస్తుల భవనం ఉండడంతో కూల్చివేత విషయంలో పలు జాగ్రత్తలు పాటిస్తున్నారు.


గోపన్‌పల్లి ఎన్టీఆర్‌ నగర్‌ నానక్‌రాంగూడ ఐటీ జోన్‌కు దగ్గర ఉండటంతో ఈ ప్రాంతంలో ఐటీ ఉద్యోగులు ఉండేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఈ ప్రాంతంలో హాస్టల్‌, పీజీలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. కొందరు నిర్మాణదారులు తక్కువ స్థలంలో నిబంధనలకు వ్యతిరేకంగా 4-5 అంతస్తుల భవనాలు నిర్మించి హాస్టళ్లు, పీజీలు నిర్వహిస్తున్నారు. అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన అధికారులు లంచాలు తీసుకొని ఇలాంటి నిర్మాణాలను అడ్డుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఎన్టీఆర్‌నగర్‌, తాజ్‌నగర్‌, సోఫా కాలనీలో ఇలాంటి భవనాలు పదుల సంఖ్యలో ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

రైతన్నపై ఎల్‌నినో పిడుగు

అనర్హత వేటు

Updated Date - Sep 19 , 2026 | 05:46 AM