Share News

హైదరాబాద్‌లో చెత్త సేకరణ ప్రైవేట్‌కు?

ABN , Publish Date - Sep 16 , 2026 | 01:02 AM

కోర్‌ అర్బన్‌ రీజియన్‌ ఎకానమీ(క్యూర్‌) పరిధిలో ఇంటింటి చెత్త సేకరణ బాధ్యతలను ప్రైవేటు సంస్థకు అప్పగించనున్నారా..? మెరుగైన పారిశుధ్య నిర్వహణ, ప్రస్తుత సేకరణ విధానంలో లోపాలు సరి చేయాలని అధికారులు భావిస్తున్నారా..? అంటే ఉన్నత స్థాయి వర్గాలు ఔననే సమాధానమిస్తున్నాయి. వంద శాతం చెత్త సేకరణ, రోడ్లపై వ్యర్థాల కుప్పలు కనిపించకుండా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని భావిస్తున్నారు.

హైదరాబాద్‌లో చెత్త సేకరణ ప్రైవేట్‌కు?
garbage

  • మరోసారి తెరపైకి ప్రతిపాదన.. మెరుగైన పారిశుధ్య నిర్వహణకే అంటున్న అధికారులు

  • అభ్యంతరం వ్యక్తం చేస్తున్న కార్మికులు

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): కోర్‌ అర్బన్‌ రీజియన్‌ ఎకానమీ(క్యూర్‌) పరిధిలో ఇంటింటి చెత్త సేకరణ బాధ్యతలను ప్రైవేటు సంస్థకు అప్పగించనున్నారా..? మెరుగైన పారిశుధ్య నిర్వహణ, ప్రస్తుత సేకరణ విధానంలో లోపాలు సరి చేయాలని అధికారులు భావిస్తున్నారా..? అంటే ఉన్నత స్థాయి వర్గాలు ఔననే సమాధానమిస్తున్నాయి. వంద శాతం చెత్త సేకరణ, రోడ్లపై వ్యర్థాల కుప్పలు కనిపించకుండా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇంటింటి చెత్త సేకరణ పూర్తి స్థాయిలో జరిగేలా ప్రైవేట్‌ ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. గతంలోనూ పలుమార్లు తెరపైకి వచ్చిన ఈ ప్రతిపాదనను అమల్లోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. ‘సమగ్ర రోడ్ల నిర్వహణ కార్యక్రమం (సీఆర్‌ఎంపీ)లో భాగంగా ప్రైవేట్‌కు అప్పగించిన అనంతరం రోడ్ల నిర్మాణం, నిర్వహణ మెరుగైంది. అందుకే చెత్త సేకరణ అప్పగించే అంశాన్ని పరిశీలిస్తున్నాం’ అని ఓ అధికారి తెలిపారు. అయితే దీనిపై కార్మికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించలేక తమను బద్నాం చేస్తున్నారని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. మూడు కార్పొరేషన్ల పరిధిలో ప్రస్తుతం నిత్యం 10 వేల టన్నుల వరకు చెత్త వెలువడుతోంది. దీన్ని జవహర్‌నగర్‌ యార్డుకు తరలిస్తున్నారు. మొత్తం చెత్తలో ఇళ్ల నుంచి సేకరిస్తోంది 50 శాతంలోపే ఉంటుందని అధికారులు గుర్తించారు. మిగతా వ్యర్థాల్లో నివాసేతర సముదాయాలతోపాటు రోడ్లపై పేరుకుపోతున్న చెత్త ఉండడం గమనార్హం. రహదారులపై చెత్త కుప్పలు పేరుకుపోవడానికి ఇంటింటి చెత్త సేకరణ సక్రమంగా జరగకపోవడం ప్రధాన కారణమని అధికారులపరిశీలనలో తేలింది. మూడు కార్పొరేషన్లలో 6500వరకు స్వచ్ఛ ఆటో టిప్పర్లు (ఎస్‌ఏటీ) ఉన్నాయి. 80శాతం కాలనీలు, బస్తీల్లో రోజూ చెత్త సేకరణ జరగడం లేదు. కొన్ని చోట్ల రోజు విడిచి రోజు.. మరికొన్ని చోట్ల వారానికి ఒకటి రెండు సార్లు చెత్త తీసుకెళ్తున్నారని గుర్తించారు.


2009లో ప్రైవేటు సంస్థకు..

జీహెచ్‌ఎంసీలో చెత్త సేకరణ, రవాణ, శాస్త్రీయ నిల్వ, నిర్వహణ బాధ్యతలను 2009లో అప్పటి ప్రభుత్వం రాంకీ ఎన్వీరో లిమిటెడ్‌కు అప్పగించింది. కార్మిక సంఘాలు, ఇతరుల అభ్యంతరాలతో మొదటి దశలో శాస్త్రీయ నిల్వ, నిర్వహణ బాధ్యతే అప్పగించారు. కొన్నాళ్ల క్రితం సెకండరీ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్ల నుంచి జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డుకు తరలింపు బాధ్యతలు బదలాయించారు. తర్వాత రోడ్లపై చెత్త కుప్పల తరలింపు కూడా ప్రైవేట్‌ సంస్థనే నిర్వహిస్తోంది. ట్రాలీలు కొని ఇచ్చినా.. రోడ్లపై చెత్త వేయకుండా సేకరణ జరగాలన్న లక్ష్యం నెరవేరడం లేదు. ఎస్‌ఏటీ కార్మికులపై నియంత్రణ లేకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని కార్పొరేషన్లు భావిస్తున్నాయి. ఇంటింటి చెత్త సేకరణనూ ప్రైవేట్‌ సంస్థకు అప్పగించడం ద్వారా పరిస్థితి మెరుగుపడుతుందన్న ఆశిస్తున్నాయి. ప్రైవేట్‌ సంస్థకు అప్పగించినా ప్రస్తుతం ఉన్న ఎస్‌ఏటీలు, కార్మికులను కొనసాగించేలా అధికారులు ప్రతిపాదన తీసుకొచ్చారు. వాహనాల నిర్వహణ, ఇంధన వ్యయాన్ని ప్రైవేట్‌ సంస్థ భరించనుంది. కార్మికులకు వేతనం చెల్లించాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనపై కార్మికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్‌కు అప్పగిస్తే నిర్ణీత మొత్తమే చెత్త రుసుముగా ఉంటుందని, ఆస్తిపన్నులోనే చెత్త రుసుము వసూలు చేసే విషయం పరిశీలనలో ఉందని ఓ అధికారి తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి

రూ.5 వేల కోట్ల ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు ఆమోదం

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు

Updated Date - Sep 16 , 2026 | 02:50 AM