Share News

హైదరాబాద్ గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం.. ఇద్దరి మృతి

ABN , Publish Date - Jul 28 , 2026 | 08:09 PM

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విద్యార్థులను బలితీసుకుంది. రోడ్డుపక్కన నిలిచి ఉన్న లారీని స్విఫ్ట్ కారు వెనుక నుంచి అతివేగంగా ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు..

హైదరాబాద్ గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం.. ఇద్దరి మృతి
Hyderabad ORR Accident

హైదరాబాద్‌, జులై 28: నగరంలోని గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. నియోపోలిస్ ఎగ్జిట్ సమీపంలో రోడ్డుపక్కన నిలిచి ఉన్న లారీని.. వెనుక నుంచి అత్యంత వేగంగా వచ్చిన స్విఫ్ట్ కారు బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. కారులో ప్రయాణిస్తున్న యువతీ, యువకుడు వాహనంలోనే చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని ఎంతో శ్రమించి వారిని బయటకు తీశారు. అయితే అప్పటికే ఇద్దరూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ప్రమాదంతో ఔటర్ రింగ్ రోడ్డుపై కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.


మృతులను యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన కత్రావత్ సురేందర్ (19), ప్రణీతి రెడ్డిగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ ఒకే గ్రామానికి చెందినవారని, ప్రణీతి ఎల్‌బీనగర్‌లోని ఏస్ కళాశాలలో చదువుతున్న విద్యార్థినిగా సమాచారం. సోమవారం రాత్రి యాదాద్రి జిల్లా బొమ్మలరామారం నుంచి గండిపేట్ మీదుగా కొల్లూరు వైపు కారులో బయలుదేరిన సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

Updated Date - Jul 28 , 2026 | 09:26 PM