వైద్యం పేరుతో మోసం.. నకిలీ వైద్యుల ఉచ్చులో పడొద్దు: సీపీ సజ్జనార్
ABN , Publish Date - Aug 27 , 2026 | 03:21 PM
ఈ మధ్య కాలంలో కనీస వైద్య అర్హతలు లేకుండానే డాక్టర్లుగా చలామణి అవుతూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు కొంతమంది కేటుగాళ్లు. అలాంటి నకిలీ వైద్యులపై హైదరాబాద్ పోలీసులు దృష్టి సారించారు..
హైదరాబాద్, ఆగస్టు 27: వైద్యం పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ వైద్యులపై హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. నగరంలో ఇప్పటివరకూ 12 మంది నకిలీ వైద్యులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. కనీస వైద్య పరిజ్ఞానం, విద్యార్హతలు లేకుండానే వైద్యులుగా చలామణి అవుతూ రోగులకు యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్లు, బీపీ, డయాబెటిస్ మందులను విచక్షణారహితంగా ఇస్తున్నారని పేర్కొన్నారు. ఇష్టారీతిన ఇంజెక్షన్లు, సెలైన్లు ఎక్కించడం ద్వారా రోగుల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారని, సరైన వైద్యం అందకపోతే ఊపిరితిత్తులు, గుండె, మూత్రపిండాలపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
నకిలీ వైద్యుల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనార్ సూచించారు. క్లినిక్ లేదా ఆసుపత్రి రిసెప్షన్ వద్ద DMHO జారీ చేసిన అధికారిక రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఉందో లేదో పరిశీలించాలని, వైద్యుల బోర్డుపై పేరు, విద్యార్హతలతో పాటు TSMC రిజిస్ట్రేషన్ నంబర్ తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. వైద్యుడి అర్హతలపై అనుమానం ఉంటే onlinetsmc.inలోని డాక్టర్ సెర్చ్ ద్వారా వివరాలు పరిశీలించాలని సూచించారు. TSMC రికార్డుల్లో వివరాలు కనిపించకపోతే వైద్యుడి అర్హతపై అనుమానించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. చికిత్సపై సందేహం ఉంటే అర్హత కలిగిన మరో వైద్యుడి వద్ద సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలని, నకిలీ వైద్యుల సమాచారం తెలిస్తే వెంటనే డయల్ 112 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని సీపీ కోరారు. నకిలీ వైద్యులపై నిఘా, కఠిన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
అనంతపురం హైవేపై అదుపుతప్పిన ఇన్నోవా.. ఇద్దరి మృతి
అవినీతి ఆరోపణలు.. భూపాలపల్లి మైన్స్ ఏడీ ఇంట్లో ఏసీబీ రైడ్స్
Read Latest Telangana News And Telugu News