హైదరాబాద్‌లో ఎగ్ డొనేషన్ రాకెట్‌పై పోలీసుల ఉక్కుపాదం.. కీలక ఆధారాలు స్వాధీనం
ABN , Publish Date - Nov 28 , 2026 | 08:05 AM
హైదరాబాద్‌లో ఎగ్ డొనేషన్ ముసుగులో సాగుతున్న అక్రమ వ్యవహారాలపై మల్కాజ్గిరి పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. A-9 నిందితుడు దుర్గాప్రసాద్ కస్టడీ విచారణతో కీలక విషయాలు వెలుగులోకి రావడంతో ఒయాసిస్ హాస్పిటల్స్ కార్యాలయంతో పాటు పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.
హైదరాబాద్, నవంబరు 28: నగరంలో సంచలనం సృష్టించిన ఎగ్ డొనేషన్ రాకెట్ కేసులో మల్కాజ్గిరి పోలీసులు దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు. ఈ కేసులో A-9 నిందితుడిగా ఉన్న దుర్గాప్రసాద్‌ను కస్టడీలోకి తీసుకుని పోలీసులు విచారించారు. విచారణలో వెలుగులోకి వచ్చిన కీలక అంశాల ఆధారంగా ఒయాసిస్ హాస్పిటల్స్ కార్పొరేట్ కార్యాలయంతో పాటు బేగంపేటలోని సెంటర్ పాయింట్లో పోలీసులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో ల్యాప్‌టాప్‌లు, పలు డిజిటల్ పరికరాలతో పాటు ఎగ్ డొనేషన్ కోసం మహిళలను రిక్రూట్ చేసినట్లు భావిస్తున్న రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో మహిళలను డోనర్లుగా సమకూర్చిన ఏజెంట్లు ఎవరు? వారి ద్వారా ఎంతమందిని రిక్రూట్ చేశారు? డోనర్లకు ఎంత మొత్తంలో చెల్లింపులు జరిగాయి? ఏజెంట్లకు ఏ మేరకు కమీషన్లు అందాయి? అనే అంశాలపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. స్వాధీనం చేసుకున్న రికార్డులు, డిజిటల్ ఆధారాల ద్వారా ఈ నెట్వర్క్ కార్యకలాపాలపై స్పష్టత తీసుకురావాలని దర్యాప్తు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
మరోవైపు.. ఈ వ్యవహారంలో ART బ్యాంకులు, ఫెర్టిలిటీ సెంటర్ల మధ్య ఉన్న సంబంధాలు, వాటి నిర్వహణ తీరుపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆసుపత్రుల యాజమాన్యాల పాత్ర ఏంటి? ఎగ్ డొనేషన్ ప్రక్రియలో నిబంధనలు పాటించారా? మహిళల రిక్రూట్మెంట్, డోనర్లకు చెల్లింపులు, ఏజెంట్ల కమీషన్ల వ్యవహారంలో ఎవరెవరి ప్రమేయం ఉంది? అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది. ముఖ్యంగా ART చట్టం–2021 నిబంధనలను ఉల్లంఘించారా? అనుమతులు, రికార్డులు, డోనర్ల వివరాల నిర్వహణలో అక్రమాలు జరిగాయా? అనే అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే సీజ్ చేసిన ల్యాప్‌టాప్‌లు, ఇతర డిజిటల్ పరికరాలను ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపించి కీలక సమాచారాన్ని సేకరించేందుకు సిద్ధమవుతున్నారు. బ్యాంకు ఖాతాలు, ఆర్థిక లావాదేవీలను సైతం పరిశీలిస్తూ డబ్బుల చెల్లింపుల వెనుక ఉన్న వ్యక్తులు, సంస్థల వివరాలను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు బయటపడే అవకాశం ఉండటంతో ఎగ్ డొనేషన్ రాకెట్ వెనుక ఉన్న పూర్తి నెట్‌వర్క్‌ను గుర్తించడమే లక్ష్యంగా మల్కాజ్గిరి పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
భారతీయుడి ప్రపంచ రికార్డు.. 10 లక్షల మంది యూట్యూబ్ పెయిడ్ ఛానల్ మెంబర్స్..
ప్రశ్నలు మీవే.. సమాధానాలూ మీవే.. ఐఐటీలో ఇలాంటి పరీక్షలా?