హైదరాబాద్‌లో దుర్గామాత నిమజ్జనాలు.. నగరవ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు
ABN , Publish Date - Oct 21 , 2026 | 04:50 PM
హైదరాబాద్‌లో దుర్గామాత విగ్రహాల నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఆంక్షలు విధించారు. ఆ వివరాలను ఓసారి పరిశీలిస్తే...
హైదరాబాద్, అక్టోబర్ 21: నగరంలో దుర్గామాత విగ్రహాల నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఆంక్షలు విధించారు. పలు ప్రాంతాల్లో నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించనున్న నేపథ్యంలో వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా ట్రాఫిక్‌ను దారి మళ్లిస్తున్నారు.
పీపుల్స్ ప్లాజా, గార్డెన్ పాయింట్, జలవిహార్, సంజీవయ్య పార్క్ బేబీ పాండ్స్ వద్ద విగ్రహాల నిమజ్జనాలకు ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో పంజాగుట్ట, రాజ్‌భవన్ వైపు నుంచి ఖైరతాబాద్ ఫ్లైఓవర్‌కు వచ్చే వాహనాలను ఇతర మార్గాల్లోకి మళ్లిస్తున్నారు. వి.వి. విగ్రహం వద్ద ట్రాఫిక్‌ను నిరంకారి జంక్షన్ వైపు పంపిస్తున్నారు. ఇక్బాల్ మినార్ వైపు సాధారణ వాహనాలకు అనుమతి నిరాకరించారు. నిమజ్జనానికి వచ్చే విగ్రహాల వాహనాలకు మాత్రమే అనుమతి కల్పిస్తున్నారు. పాత పోలీస్ స్టేషన్ సైఫాబాద్ వద్ద వాహనాలను రవీంద్ర భారతి, మాసాబ్‌ట్యాంక్ వైపు మళ్లిస్తున్నారు. ఖైరతాబాద్ బడా గణేశ్ లేన్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వాహనాల రాకపోకలను నిలిపివేశారు.
అప్పర్ ట్యాంక్‌బండ్ నుంచి వచ్చే వాహనాలను లిబర్టీ వైపు మళ్లిస్తున్నారు. లిబర్టీ నుంచి సెక్రటేరియట్ జంక్షన్ వైపు సాధారణ వాహనాలకు అనుమతి ఉండదు. నల్లగుట్ట బ్రిడ్జ్, పీవీ మార్గ్ వైపు నుంచి వచ్చే ట్రాఫిక్‌ను మినిస్టర్ రోడ్డు వైపు మళ్లిస్తున్నారు. రాణిగంజ్, మినిస్టర్ రోడ్డు నుంచి నెక్లెస్ రోడ్డు వైపు వచ్చే వాహనాలకు కూడా ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తున్నారు. సెక్రటేరియట్ జంక్షన్ పరిసర ప్రాంతాల్లోనూ ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు పలు చోట్ల మళ్లింపులు చేపట్టారు. నిమజ్జన కార్యక్రమాలకు వచ్చే భక్తులు, నగర ప్రజలు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో ఉంచుకుని తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు. అవసరమైతే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవడంతో పాటు ట్రాఫిక్ పోలీసుల సూచనలు, ఆదేశాలను పాటించాలని కోరుతున్నారు. నిమజ్జన ప్రాంతాల పరిసరాల్లో రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున వాహనదారులు సహకరించి ట్రాఫిక్ నియంత్రణకు తోడ్పడాలని అధికారులు సూచిస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఎదురుగా ట్రాఫిక్ పోలీసులు.. బైకర్ ఏం చేశాడంటే.. వీడియో వైరల్
కశ్మీర్లో పురాతన శివలింగం పునరుద్ధరణ.. పోటెత్తుతున్న భక్తులు