హైదరాబాద్‌లో డ్రంకెన్ డ్రైవ్.. 292 మందిపై కేసులు
ABN , Publish Date - Sep 13 , 2026 | 05:00 PM
వీకెండ్ వచ్చిందంటే చాలు.. పార్టీలు, పబ్బులతో ఎంజాయ్ చేసి రోడ్లపైకి వస్తున్న మందుబాబులకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు షాకిచ్చారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తున్న వారిని టార్గెట్ చేస్తూ స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్ చేపట్టారు. ఈ తనిఖీల్లో ఏకంగా 292 మంది పోలీసులకు చిక్కారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 13: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన వీకెండ్ స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్‌లో ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 292 మందిపై కేసులు నమోదు చేశారు. వీరిలో 240 మంది బైకర్లు, 12 మంది ఆటో డ్రైవర్లు, 40 మంది కారు డ్రైవర్లు ఉన్నారు. అధిక మోతాదులో మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోనున్నారు. 14 మంది వాహనదారులకు 301 నుంచి 550 మధ్య బీఏసీ పాయింట్లు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిన 292 మందిని చట్టపరమైన చర్యల్లో భాగంగా కోర్టు ముందు హాజరుపరచనున్నట్లు వెల్లడించారు.
మద్యం సేవించి వాహనం నడపడం తీవ్రమైన నేరమని సైబరాబాద్ పోలీసులు హెచ్చరించారు. డ్రంకెన్ డ్రైవ్ కారణంగా ప్రమాదం జరిగి ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగితే.. బీఎన్ఎస్ సెక్షన్ 105 కింద కేసు నమోదు చేసే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేరానికి గరిష్టంగా 10 ఏళ్ల వరకూ జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉందని పేర్కొన్నారు. గత వారం డ్రంకెన్ డ్రైవింగ్‌కు సంబంధించిన 681 కేసులను కోర్టులు పరిష్కరించగా, 18 మందికి జరిమానాతో పాటు జైలు శిక్ష విధించారు. మరో ఏడుగురికి జరిమానాతో పాటు సోషల్ సర్వీస్ శిక్ష విధించగా, మిగిలిన 656 మందికి జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడొద్దు జగన్: హోంమంత్రి అనిత..
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల్లో అక్రమాలు జరగలేదు: ఏపీ జూడో అసోసియేషన్