Share News

హైదరాబాద్ అభివృద్ధికి అందరం ఐక్యంగా పనిచేయాలి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ABN , Publish Date - Sep 25 , 2026 | 09:41 PM

హైదరాబాద్ అభివృద్ధికి ప్రజలంతా ఐకమత్యంగా ముందుకు సాగాలని, పండుగలకే పరిమితం కాకుండా అన్ని రోజుల్లోనూ ఐక్యతను కొనసాగించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.

హైదరాబాద్ అభివృద్ధికి అందరం ఐక్యంగా పనిచేయాలి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Hyderabad Development

హైదరాబాద్‌, సెప్టెంబర్ 25: నగరంలో అందరూ ఐకమత్యంగా ఉంటూ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. సెక్రటేరియట్‌ ఎదుట భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేదికపై ఆయన మాట్లాడారు. హిందువులందరూ ఐక్యంగా ఉండాలని, అందరూ కలిసి తమ శక్తిని చాటాలని అన్నారు. పండుగల సమయంలో మాత్రమే కాకుండా అన్ని రోజుల్లోనూ సమాజంలో ఐకమత్యం కొనసాగాలని సూచించారు. ఐకమత్యంగా లేకపోతే అనేక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. అందరం కలిసి హైదరాబాద్‌ను మరింత అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్‌లో జరిగే గణేశ్ నిమజ్జనం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి కూడా నిమజ్జనాన్ని వీక్షించేందుకు ప్రజలు వస్తున్నారని తెలిపారు.


స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో బ్రిటిష్ పాలకులు విధించిన పోలీసు నిర్బంధాలను ఛేదిస్తూ బాల గంగాధర్ తిలక్ గణేష్ ఉత్సవాలను ప్రారంభించారని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. హైదరాబాద్ పాత నగరంలో కూడా సామూహిక గణేశ్ ఉత్సవాలకు శ్రీకారం చుట్టిన చరిత్ర ఉందన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో గణేష్ నిమజ్జన కార్యక్రమాలు జరుగుతున్నాయని, హైదరాబాద్ నిమజ్జనం ప్రత్యేకతను సంతరించుకుందని చెప్పారు. ఈ సందర్భంగా దేశ ఐక్యతను చాటేలా ప్రతి ఒక్కరూ వ్యవహరించాలని పిలుపునిచ్చారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రజలంతా కలిసి ముందుకు సాగాలని అన్నారు. నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొనే భక్తులు పోలీసులకు పూర్తిగా సహకరించాలని, శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని కిషన్ రెడ్డి కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి:

బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి.. హైదరాబాద్, విజయవాడలో నేటి ధరలివే

ఖైరతాబాద్ గణేశుడి లడ్డూ ప్రత్యేకత.. వేలం లేకుండానే భక్తులకు ప్రసాదంగా పంపిణీ..

Read Latest AP News And Telangana News

Updated Date - Sep 25 , 2026 | 09:49 PM