హైదరాబాద్‌లో నిషేధిత ఇ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. ఆరుగురి అరెస్ట్
ABN , Publish Date - Nov 14 , 2026 | 07:09 PM
హైదరాబాద్‌లో నిషేధిత ఇ-సిగరెట్ల అక్రమ దందా గుట్టురట్టయింది. చాక్లెట్లు, హుక్కా పాట్స్ విక్రయాల ముసుగులో విదేశాల నుంచి ఇ-సిగరెట్లు తెప్పించి నగరంలో విక్రయిస్తున్న ముఠాపై గొల్కొండ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపుదాడి చేశారు.
హైదరాబాద్, నవంబరు 14: నగరంలో నిషేధిత ఇ-సిగరెట్ల అక్రమ వ్యాపారం గుట్టును గొల్కొండ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. గుడిమల్కాపూర్, మాదాపూర్ ప్రాంతాలను కేంద్రంగా చేసుకుని సాగుతున్న ఈ అక్రమ దందాపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ క్రమంలో నానాల్ నగర్‌లోని ఒలివ్ ఆసుపత్రి సమీపంలో ఉన్న 'స్మోక్ వాల్ట్' షాపుపై గొల్కొండ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, గుడిమల్కాపూర్ పోలీసులతో కలిసి సంయుక్తంగా దాడులు నిర్వహించారు.
చాక్లెట్లు, హుక్కా పాట్స్ విక్రయాల వ్యాపారం ముసుగులో నిషేధిత ఇ-సిగరెట్లను అక్రమంగా విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడు అబ్దుల్లా అర్షద్‌తో పాటు మరో ఐదుగురు వర్కర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. దుబాయ్‌లో ఉంటున్న తన స్నేహితుడు షరీఫ్ సహకారంతో బల్క్ పరిమాణంలో ఇ-సిగరెట్లను నగరానికి తెప్పించి, ఇక్కడి వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. గుడిమల్కాపూర్‌తో పాటు మాదాపూర్ ప్రాంతాల్లోనూ ఈ అక్రమ వ్యాపారాన్ని విస్తరించినట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది.
దాడుల సందర్భంగా నిందితుల వద్ద నుంచి సుమారు రూ.7,06,800 విలువైన వివిధ రకాల నిషేధిత ఇ-సిగరెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు 1,000 OCB పేపర్లు, ఏడు మొబైల్ ఫోన్లు, అక్రమ సరఫరాకు ఉపయోగిస్తున్న సుజుకి యాక్సెస్ 125 స్కూటర్ (TG-08-AG-9032), రెండు పేటీఎం స్వైపింగ్ మెషిన్లను సీజ్ చేశారు. విదేశాల నుంచి ఇ-సిగరెట్లను బల్క్‌గా తెప్పించి నగరంలో విక్రయిస్తున్న ఈ ముఠా కార్యకలాపాలపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్లో BNS 223, PEC యాక్ట్-2019 కింద కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడికి సహకరిస్తూ దుబాయ్ నుంచి ఇ-సిగరెట్లను సరఫరా చేస్తున్న షరీఫ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ వార్తలనూ చదవండి:
జెన్సన్ హువాంగ్ రీఎంట్రీకి ప్రయత్నాలు.. మద్దతుగా మస్క్
ఎయిర్ ట్రాఫిక్ వ్యవస్థలో కమ్యూనికేషన్ సమస్య.. అమెరికాలో విమాన సేవల నిలిపివేత..