Share News

సీట్లు నిండట్లేదు.. విమానాలు ఎగరట్లేదు!

ABN , Publish Date - Nov 13 , 2026 | 06:14 AM

ఇంధన ధరలతో పాటు టికెట్‌ ధరల పెరుగుదల విమానయాన రంగాన్ని కుదేలు చేస్తోంది.

సీట్లు నిండట్లేదు.. విమానాలు ఎగరట్లేదు!
aeroplanes

  • ఖాళీ సీట్లు, రద్దయిన సర్వీసులు

  • దేశంలో హైదరాబాద్‌లోనే అత్యధికం

  • ఏడాదిలో భర్తీకాని సీట్లు 1.58 లక్షలు

  • 12.1 శాతం తగ్గిపోయిన పీఎల్‌ఎఫ్‌

  • 408 నుంచి 322కు పడిపోయిన ఢిల్లీ-హైదరాబాద్‌ సర్వీసుల సంఖ్య

  • ఇంధన ధరల మంట ఎఫెక్ట్‌

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి)

ఇంధన ధరలతో పాటు టికెట్‌ ధరల పెరుగుదల విమానయాన రంగాన్ని కుదేలు చేస్తోంది. దక్షిణాది విమానాశ్రయాలకు ఈ సెగ ఎక్కువగా కనిపిస్తోంది. తాజాగా విడుదలైన గణాంకాలు ప్రకారం ఏడాది కాలంలో ఈ రంగం తిరోగమన దిశలో కనిపిస్తోంది. దేశీయ విమానాల్లో సీట్లు నిండకపోవడంతో పాటు పలు రూట్లలో సర్వీసులు రద్దవుతున్నాయి. ఇది దేశంలోనే అత్యధికంగా హైదరాబాద్‌లో నమోదైంది. గత ఏడాది నవంబరు మొదటి వారంతో పోలిస్తే దేశీయ విమానాల్లో ప్యాసింజర్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌ (పీఎల్‌ఎఫ్ )గా వ్యవహరించే సీట్ల భర్తీ శాతం ఈ ఏడాది నవంబరు మొదటి వారం నాటికి 12.1శాతం పడిపోయింది. దేశవ్యాప్తంగా 9 ప్రధాన విమానాశ్రయాల్లో ఏడాది కాలంలో పీఎల్‌ఎఫ్‌ 5.15 లక్షల మేర తగ్గింది. ఇందులో హైదరాబాద్‌ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే వివిధ విమానయాన సంస్థల సర్వీసులకు సంబంధించి 1,58,444 (-12.1 శాతం) తగ్గుదల నమోదైంది. ఇదే దేశంలో అత్యధికం. తరువాత చెన్నై నుంచి 1,05,604 (-11.7శాతం), అహ్మదాబాద్‌ 46328 (-7.7), గౌహతి 20,290 (-6.6), కోల్‌కతా 45,916 (-4.6), ఢిల్లీ 1,02,959 (-3.4), గోవా 5783 (-1.8), బెంగుళూరు 23949 (-1.3), ముంబై 19,562 (-1 శాతం) తగ్గింది.


టికెట్‌ ధరల పెరుగుదలే కారణం

రష్యా-ఉక్రెయిన్‌, అమెరికా-ఇరాన్‌ యుద్ధాల ప్రభావం విమానయాన రంగంపై పడింది. రోజురోజుకు చమురు ధరలు పెరగడంతో విమానయాన సంస్థలు టికెట్‌ ధరలు గణనీయంగా పెంచుతున్నాయి. దీంతో విమానయానం భారమై ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గలు చూసుకుంటున్నారు. అత్యవసరమైతే తప్ప విమాన ప్రయాణాలు చేయడం లేదు. ఈ కారణంగా అనేక విమానాలు తక్కువ మంది ప్రయాణికులతోనే రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో నష్టాలను తగ్గించుకునేందుకు విమానయాన సంస్థలు సర్వీసులను కుదిస్తున్నాయి.

ఈ రూట్లలో సర్వీసులు తగ్గాయ్‌

పండుగల సీజన్‌లో కూడా దేశీయ రూట్లలో విమాన సర్వీసులు తగ్గిపోయాయి. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు గత ఏడాది వారంలో సగటున 408 సర్వీసులు ఉండగా ఇప్పుడా సంఖ్య 322కు పడిపోయింది. అలాగే హైదరాబాద్‌ నుంచి తిరుపతికి 168 సర్వీసులు నడపగా ఇప్పుడు ఏకంగా 82కి తగ్గిపోవడం గమనార్హం. హైదారాబాద్‌ నుంచి చెన్నైకి సర్వీసులు 190 నుంచి 132కి తగ్గాయి. హైదరాబాద్‌ నుంచి పట్నా/వారణాసి రూట్లలో కూడా సర్వీసులు సగానికి పైగా తగ్గాయి.

ఇవి కూడా చదవండి..

తమిళనాడులోని జ్యువెలరీ షోరూమ్‌లో చోరీ.. రూ.25 కోట్ల ఆభరణాలు మాయం!

రసగుల్లా అనుకుని బాంబు కొరికి వ్యక్తి మృతి

Updated Date - Nov 13 , 2026 | 06:15 AM