Share News

హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. ఐదుగురు ముఠా సభ్యుల అరెస్ట్

ABN , Publish Date - Jul 10 , 2026 | 11:46 AM

హైదరాబాద్ అత్తాపూర్‌లో ఎస్‌వోటీ, స్థానిక పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి డ్రగ్స్ విక్రయిస్తున్న ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి భారీగా ఎండీఎంఏ, ఇంజెక్షన్లు, కత్తి, నగదును స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు..

హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. ఐదుగురు ముఠా సభ్యుల అరెస్ట్
Hyderabad Drugs News,

హైదరాబాద్‌, జులై 10: హైదరాబాద్ అత్తాపూర్‌లో ఎస్‌వోటీ, స్థానిక పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి డ్రగ్స్ విక్రయిస్తున్న ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. మహానగరంలో డ్రగ్స్ రవాణా, విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా రాజేంద్రనగర్ ఎస్‌వోటీ (SOT) బృందం, అత్తాపూర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన మెరుపు దాడుల్లో ఒక ప్రమాదకర డ్రగ్స్ ముఠా గుట్టురట్టయింది. అత్తాపూర్ పరిధిలో యథేచ్ఛగా మాదకద్రవ్యాలను విక్రయిస్తున్న ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు నిందితులు పోలీసుల నుంచి తప్పించుకుని పరారయ్యారు. పట్టుబడిన నిందితుల నుంచి భారీ మొత్తంలో ఎండీఎంఏ (MDMA) డ్రగ్స్, నిషిద్ధ ఇంజెక్షన్లు, టాబ్లెట్లతో పాటు ఒక కత్తి, ఐదు మొబైల్ ఫోన్లు, రూ. 16,930 నగదును పోలీసులు సీజ్ చేశారు.


పోలీసుల ప్రాథమిక విచారణలో ఈ ముఠా డ్రగ్స్ సరఫరాకు సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు నగరంలోని దారుల్‌షిఫా ప్రాంతం నుంచి తక్కువ ధరకే ఈ డ్రగ్స్‌ను కొనుగోలు చేసి, వాటిని అత్తాపూర్‌కు తరలించి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు తేలింది. ఈ దందాలో వినియోగదారులకు డ్రగ్స్ చేరవేయడానికి సయ్యద్ అబుల్ హసన్ (A2) అనే ఆటో డ్రైవర్‌ను కీలక వనరుగా వాడుకున్నారు. అరెస్టయిన వారిలో సయ్యద్ అబుల్ హసన్‌తో పాటు సైఫ్ అలీ మీర్జా, అహ్మద్ హుస్సేన్, షేక్ అయూబ్, మీర్ షబ్బీర్ అలీ ఉన్నారు. ఈ ముఠాలో కీలకమైన ప్రధాన నిందితుడు (A1) బాకర్, ముజాహిద్ అనే ఇద్దరు వ్యక్తులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కాగా, ఈ కేసులో కీలకంగా ఉన్న హసన్‌పై గతంలోనే పలు పోలీస్ స్టేషన్లలో చోరీలు, దోపిడీలు, ఎన్‌డీపీఎస్ (NDPS) చట్టం కింద అనేక క్రిమినల్ కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పాత నేరస్థులతో ముడిపడి ఉన్న ఈ డ్రగ్స్ నెట్‌వర్క్‌పై అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి, దీని వెనుక ఇంకా ఎవరెవరి హస్తం ఉందనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు.

Updated Date - Jul 10 , 2026 | 12:22 PM