వైద్యం చేయించలేక చిన్నారిని హుస్సేన్ సాగర్‌లో తోసేసిన తల్లి.. చివరికి..
ABN , Publish Date - Oct 09 , 2026 | 11:10 AM
హైదరాబాద్‌లో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆరేళ్ల కూతురికి వైద్యం చేయించే స్థోమత లేక.. ఓ తల్లి చిన్నారిని హుస్సేన్ సాగర్‌లోకి విసిరేసినట్లు సమాచారం.
హైదరాబాద్, అక్టోబర్ 9: నగరంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆరేళ్ల కూతురికి వైద్యం చేయించే ఆర్థిక స్థోమత లేక ఓ తల్లి తీవ్ర నిర్ణయం తీసుకుంది. చిన్నారిని హుస్సేన్ సాగర్‌లోకి విసిరేసింది. అయితే.. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ ఆటో డ్రైవర్ ఈ ఘటనను గమనించి వెంటనే నీటిలోకి దూకాడు. ప్రాణాలకు తెగించి చిన్నారిని కాపాడి ఒడ్డుకు తీసుకొచ్చాడు. ప్రస్తుతం ఆ పాప గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సమయానికి ఆటో డ్రైవర్ స్పందించడంతో చిన్నారి ప్రాణాలతో బయటపడింది.
ఓల్డ్ బోయినపల్లి పరిధిలోని హస్మత్‌పేట్‌కు చెందిన షబానాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భర్త వదిలేయడంతో ఆమె ఇళ్లల్లో పని చేస్తూ ఇద్దరు పిల్లలను పోషిస్తోంది. ఈ క్రమంలో ఆమె రెండో కుమార్తె రుక్సానా (6) పేగు ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతోంది. చిన్నారికి వైద్యం చేయించేందుకు అవసరమైన డబ్బులు లేకపోవడంతో షబానా తీవ్ర ఆందోళనకు గురైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే హుస్సేన్ సాగర్ వద్ద చిన్నారిని నీటిలోకి విసిరేసినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఆటో డ్రైవర్ వెంటనే స్పందించి నీటిలోకి దిగి పాపను రక్షించాడు. అనంతరం చిన్నారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో వైద్యులు చిన్నారికి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.