Share News

సిద్దిపేట జిల్లాలోని ఎల్లమ్మ చెరువును పర్యాటక కేంద్రంగా చేస్తాం: మంత్రి పొన్నం

ABN , Publish Date - Oct 17 , 2026 | 04:14 PM

హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

సిద్దిపేట జిల్లాలోని ఎల్లమ్మ చెరువును పర్యాటక కేంద్రంగా చేస్తాం: మంత్రి పొన్నం
Husnabad Tourism

సిద్దిపేట, అక్టోబర్ 17: హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువును, గ్లాస్ బ్రిడ్జిని, సమీపంలోని గుట్టను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకుని ఎల్లమ్మ చెరువు వద్ద చేపట్టిన సుందరీకరణ పనులను, పండుగ ఏర్పాట్లను మంత్రి అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. సద్దుల బతుకమ్మ వేడుకల కోసం చెరువు వద్ద ఘనంగా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.

హుస్నాబాద్ ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని.. పట్టణానికి కబడ్డీ అకాడమీతో పాటు స్విమ్మింగ్ పూల్ కూడా మంజూరైనట్లు తెలిపారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు పర్యాటక అభివృద్ధి ద్వారా ప్రాంతానికి మరింత గుర్తింపు తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అలాగే, 2007లో శంకుస్థాపన చేసిన గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించిన అడ్డంకులు, సుప్రీంకోర్టు కేసు సమస్యలు తొలగిపోయాయని, ప్రస్తుతం కాలువల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ జరుగుతోందని వివరించారు. గౌరవెల్లి ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని.. సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.


వ్యవసాయ రంగానికి అవసరమైన విద్యుత్ సరఫరాపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రస్తుత పంట కాలంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు మాత్రమే కాకుండా.. అవసరాన్ని బట్టి రాత్రి వేళల్లో కూడా విద్యుత్ సరఫరా అందించేలా నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే ముఖ్యమంత్రి సూచించిన విధంగా ప్రజలందరూ విద్యుత్, నీటిని పొదుపుగా వినియోగించాలని పిలుపునిచ్చారు. రాబోయే పంట సీజన్‌లో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని రైతులు పంటల సాగుపై నిర్ణయం తీసుకోవాలని.. వరి పంటకే పరిమితం కాకుండా నీటి వనరులకు అనుగుణంగా ఇతర పంటలను కూడా సాగు చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. అర్హులైన పేదలకు ఇళ్లను అందించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. హుస్నాబాద్ ప్రాంతంలో సాగునీరు, విద్యుత్, పర్యాటకం, గృహ నిర్మాణం వంటి రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.


ఈ వార్తలూ చదవండి

రైతులకు మహారాష్ట్ర ఐఏఎస్, ఐపీఎస్‌ల అండ.. సహాయనిధికి ఒక్కరోజు జీతం.

‘ఫుట్‌పాత్‌ ఏర్పాటు చేయకపోతే ధ‌ర్నాకు దిగుతాం’.. సుప్రీంకోర్టు హెచ్చరిక

Updated Date - Oct 17 , 2026 | 05:39 PM