Share News

Telangana: మాట వినకపోతే ఉద్యోగాలు పోతాయ్‌!

ABN , Publish Date - Jan 13 , 2026 | 07:26 AM

హీరా గ్రూప్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రూ.వేల కోట్ల హీరాగ్రూపు కుంభకోణంలో అరెస్టయిన నౌహీరా షేక్‌ తరఫున రంగంలోకి దిగి, ఈడీ అధికారులను బెదిరించిన కల్యాణ్‌ బెనర్జీ అనే దళారీని ఎట్టకేలకు అరెస్ట్‌ చేశారు. ‘‘నేను ఎవరనుకుంటున్నారు? మీ పై అధికారులంతా..

Telangana: మాట వినకపోతే ఉద్యోగాలు పోతాయ్‌!
Heera Group case

హీరా గ్రూప్‌ కేసులో ఈడీ అధికారులకు బెదిరింపులు

దళారీ కల్యాణ్‌ బెనర్జీ అరెస్టు.. 23 వరకు రిమాండ్‌

హైదరాబాద్‌, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): హీరా గ్రూప్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రూ.వేల కోట్ల హీరాగ్రూపు కుంభకోణంలో అరెస్టయిన నౌహీరా షేక్‌ తరఫున రంగంలోకి దిగి, ఈడీ అధికారులను బెదిరించిన కల్యాణ్‌ బెనర్జీ అనే దళారీని ఎట్టకేలకు అరెస్ట్‌ చేశారు. ‘‘నేను ఎవరనుకుంటున్నారు? మీ పై అధికారులంతా నాకు తెలుసు. నేను చెప్పినట్లు వినండి. లేదంటే మీ ఉద్యోగాలకే ఎసరొస్తుంది. ఢిల్లీ నుంచి గల్లీ వరకు పెద్దపెద్ద రాజకీయ నాయకులు, ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులంతా నాకు తెలుసు. చెప్పినట్లు వినకపోతే తీవ్ర పరిణామాలుంటాయి. లేదా ఇచ్చినంత తీసుకుని నేను చెప్పినట్లు కేసులో ముందుకు వెళ్లండి’’ అంటూ ఈడీ అధికారులను కల్యాణ్‌ బెదిరించాడు. వరస మెసేజ్‌లు, ఫోన్లు చేస్తూ ఈడీ అధికారులను ఉక్కిరిబిక్కిరి చేశాడు.

హీరా గ్రూపును ప్రారంభించిన నౌహీరా షేక్‌.. అధిక లాభాల ఆశచూపి, వేలాది మంది నుంచి రూ.5,978 కోట్లు వసూ లు చేసి మోసం చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌ సీసీఎస్‌లో నమోదైన కేసు ఆధారంగా మనీలాండరింగ్‌ కోణంలో ఈడీ అధికారులు దర్యాప్తు ప్రారంభించి, హీరా గ్రూపునకు చెందిన రూ.428 కోట్ల స్థిరాస్తులను జప్తు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆ ఆస్తుల వేలం ప్రక్రియను ఇటీవల చేపట్టారు. ఈ నెల 5న జరిగిన వేలాన్ని ఆపడానికి నౌహీరా షేక్‌ కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశారు. ఆ పిటిషన్లపై మండిపడ్డ హైకోర్టు.. వేలానికి అడ్డు తగలవద్దని హెచ్చరిస్తూ రూ.5 కోట్లు జరిమానా విధించింది. వేలం ప్రక్రియను కొనసాగించాలని ఈడీ అధికారులకు సూచించింది.


అదేసమయంలో వేలాన్ని అడ్డుకోవడానికి హీరా గ్రూపుకు ఆర్థిక సలహాదారుగా పనిచేస్తున్న కోల్‌కతాకు చెందిన కల్యాణ్‌ బెనర్జీని నౌహీరా రంగంలోకి దింపిం ది. అతను హైదరాబాద్‌లోని ఈడీ అధికారులకు ఫోన్లు చేసి తనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని పెద్దలు తెలుసునని.. సీనియర్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులూ తెలుసని బెదిరింపులకు దిగాడు. మరోవైపు వేలాన్ని ఆపితే డబ్బు ఇస్తాననీ ఆశ చూపాడు. వరుస మెసేజ్‌లు, ఫోన్లతో కల్యాణ్‌ ఇబ్బందులకు గురిచేస్తున్న అంశాన్ని ఈడీ హైదరాబాద్‌ జోనల్‌ అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అతనిపై చర్యలు చేపట్టాలని వారు ఆదేశించడంతో కల్యాణ్‌పై నిఘా పెట్టారు. కొన్ని రోజులు నౌహీరా, ఆమెకు సన్నిహితుడైన ఓ వ్యక్తి, కల్యాణ్‌ బెనర్జీలు ఎక్కడెక్కడ కలుసుకుంటున్నారు? ఎక్కడ ఉంటున్నారు? అనే వివరాలు సేకరించారు. చివరకు సికింద్రాబాద్‌లో ఆదివారం కల్యాణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. తాను నౌహీరా షేక్‌ చెప్పినట్లే చేశానని, ఆమె సూచనల మేరకే బెదిరింపులకు పాల్పడ్డానని ఈడీ విచారణలో కల్యాణ్‌ అంగీకరించాడు. సోమవారం అతన్ని నాంపల్లిలోని కోర్టులో హాజరుపరిచారు. నౌహీరాతో కల్యాణ్‌ జరిపిన వాట్సాప్‌ చాట్‌లు, హీరా గ్రూపుతో జరిపిన ఆర్థిక లావాదేవీల వివరాలను ఈడీ అధికారులు కోర్టుకు సమర్పించారు. ఈ నెల 23 వరకు అతనికి రిమాండ్‌ విధిస్తూ జడ్జి ఆదేశాలు జారీ చేశారు.


Also Read:

Atreyapuram: హైలెస్సొ..హైలెస్సా...

Telangana: ఎన్‌టీవీపై ఐఏఎస్‌ల సంఘం ఫిర్యాదు

Updated Date - Jan 13 , 2026 | 07:26 AM