Share News

దంచికొట్టిన వాన

ABN , Publish Date - Jun 10 , 2026 | 05:13 AM

రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం భారీ వర్షాలు కురిశాయి. నిన్నటిదాకా ఉక్కపోతతో అల్లాడిన ప్రజానీకానికి ఈ వర్షాలు ఊరటనిచ్చాయి.

దంచికొట్టిన వాన

  • మల్కాజిగిరిలో 9.8 సెం.మీ వర్షపాతం

  • నగరంలో 76 చోట్ల నేల కూలిన వృక్షాలు

  • ట్రాఫిక్‌ జామ్‌తో వాహనదారుల ఇక్కట్లు

  • బండ్లగూడలో కరెంట్‌ షాక్‌.. ఇద్దరి మృతి

  • రాష్ట్రంలోని 14 జిల్లాల్లో మోస్తరు వాన

  • నేడూ భారీ వర్షాలు: వాతావరణ కేంద్రం

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం భారీ వర్షాలు కురిశాయి. నిన్నటిదాకా ఉక్కపోతతో అల్లాడిన ప్రజానీకానికి ఈ వర్షాలు ఊరటనిచ్చాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో మధ్యాహ్నం తర్వాత ఒక్క సారిగా వర్షం దంచి కొట్టింది. ఈదురుగాలులతో కూడిన వాన.. పలు ప్రాంతాల ప్రజలను వణికించింది. హైదరాబాద్‌లోని మల్కాజిగిరిలో అత్యధికంగా 9.8 సెంటీమీటర్ల వర్షం కురవగా, ముషీరాబాద్‌లో 8.7, కూకట్‌పల్లిలో 5.2, శేరిలింగంపల్లిలో 5.3, గండిపేటలో 4.4, రాజేంద్రనగర్‌లో 4.1, బాచుపల్లిలో 4.2, శామీర్‌పేటలో 4 సెంటీమీటర్ల వర్షం పడింది. ఈదురు గాలులకు 76 చోట్ల వృక్షాలు నేలకూలడంతో విద్యుత్‌ తీగలు తెగిపడ్డాయి. షేక్‌పేట, టోలిచౌకి, గచ్చిబౌలి, మాదాపూర్‌, కొండాపూర్‌ ప్రాంతాల్లో ప్రధాన రహదారులపై వరదనీరు నిలిచిపోగా.. కార్లు నీట మునిగాయి. అంబర్‌పేట, చిక్కడపల్లి, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, ప్రగతినగర్‌, మియాపూర్‌ మారేడ్‌పల్లి, శేరిలింగంపల్లి, సికింద్రాబాద్‌, చార్మినార్‌, మారేడ్‌పల్లి, అసి్‌ఫనగర్‌, నాంపల్లి ప్రాంతాల్లో ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి. బాకారంలో ఇంటిపై చెట్టుకూలడంతో ఇల్లు పాక్షికంగా దెబ్బతింది. ముషీరాబాద్‌లో 15, అంబర్‌పేట జైస్వాల్‌ గార్డెన్‌లో 4 విద్యుత్‌ స్తంబాలు విరిగిపడ్డాయి. ఖైరతాబాద్‌, సోమాజిగూడ, రాయదుర్గం, ఐకియా, మాదాపూర్‌, గచ్చిబౌలి, జేఎన్‌టీయూ, కూకట్‌పల్లి, అమీర్‌పేట, సికింద్రాబాద్‌, పంజాగుట్ట, ఎర్రగడ్డ, ముషీరాబాద్‌ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌జామ్‌ నెలకొంది. సచివాలయం ఎదుట వరద నీటిని తొలగించేందుకు హైడ్రా డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది. డీఆర్‌ఎఫ్‌ బృందాలు చేపట్టిన పనులను హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ స్వయంగా పర్యవేక్షించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని హైదరాబాద్‌ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌ అధికారులను ఆదేశించారు. ఇక, భూపాలపల్లి జిల్లాలోని కాటారంలో 7.2, మహాముత్తారంలో 5 సెంటీమీటర్ల వర్షం పడింది. గాలివాన బీభత్సానికి ప్రతాపగిరి, కొత్తపల్లి, చింతకాని గ్రామాలలో సుమారు వంద ఏళ్ల నాటి చెట్లు నేలకొరిగాయి. భూపాలపల్లిలో పిడుగులు పడడంతో 33/11కేవీ విద్యుత్‌లైన్‌ తెగిపడింది. ఆదిలాబాద్‌, జగిత్యాల, కామారెడ్డి, ఖమ్మం, ఆసిఫాబాద్‌, మహబూబాబాద్‌, మంచిర్యాల, మెదక్‌, నల్లగొండ, నిజామాబాద్‌, పెద్దపల్లి, రంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లోనూ వర్షాలు పడ్డాయి. బుధవారం కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కాగా, హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం సంచాలకులుగా ఎస్‌.స్టెల్లా మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.


విద్యుదాఘాతానికి గురై ఇద్దరి దుర్మరణం

బండ్లగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో విద్యుదాఘాతానికి గురై ఇద్దరు మరణించారు. బండ్లగూడ జహంగీరాబాద్‌కు చెందిన అఫ్రోజ్‌ (30), జాఫర్‌(16) మంగళవారం సాయంత్రం టీ తాగడానికి బయటకు వచ్చారు. ఈదురుగాలుల ధాటికి కరెంటు తీగ తెగి నీళ్లలో పడిన విషయాన్ని గమనించని అఫ్రోజ్‌.. ఆటోలో నుంచి దిగబోతూ విద్యుదాఘాతానికి గురయ్యాడు. అఫ్రోజ్‌ను కాపాడే క్రమంలో ఆటోలోనే ఉన్న జాఫర్‌కూ..షాక్‌ తగిలింది. అఫ్రోజ్‌ అక్కడికక్కడే మృతిచెందగా.. అపస్మారక స్థితికి చేరుకున్న జాఫర్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. బండ్లగూడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇద్దరి ప్రాణాలు పోయాయని బస్తీవాసులు మండిపడ్డారు.

4 copy.jpg3.jpg

Updated Date - Jun 10 , 2026 | 05:13 AM