గుండె వ్యాధితో బాధపడుతున్న.. 47 ఏళ్ల ఐవీఎఫ్ గర్భిణికి ప్రసవం
ABN , Publish Date - Feb 15 , 2026 | 06:14 AM
తీవ్రమైన రుమాటిక్ గుండె వ్యాధితో బాధపడుతున్న 47 ఏళ్ల ఐవీఎఫ్ గర్భిణికి హైటెక్ సిటీలోని కేర్ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించి తల్లి శిశువులను...
హైటెక్ సిటీ కేర్ ఆస్పత్రి వైద్యుల ఘనత
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): తీవ్రమైన రుమాటిక్ గుండె వ్యాధితో బాధపడుతున్న 47 ఏళ్ల ఐవీఎఫ్ గర్భిణికి హైటెక్ సిటీలోని కేర్ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించి తల్లి శిశువులను సురక్షితంగా కాపాడారు. వివరాలను సీనియర్ గైనకాలజీ, ల్యాపరోస్కోపిక్ సర్జన్ డాక్టర్ అభినయ అల్లూరి వెల్లడించారు. చాలా ఏళ్లకు గర్భం దాల్చిన ఓ మహిళ 31 వారాల 3 రోజుల సమయంలో తీవ్రమైన శ్వాస ఇబ్బందులు, రెండు రోజులుగా తగ్గని దగ్గుతో అత్యవసరంగా కేర్ ఆస్పత్రికి చేరుకున్నారు. గతంలో సిజేరియన్ శస్త్రచికిత్స చేయించుకోవడం, బీటా థలసీమియా ట్రైట్, హైపో థైరాయిడిజం వంటి సమస్యలు ఉండడంతో పరిస్థితి మరింత సంక్లిష్టమైందని చెప్పారు. దీంతో ఆమెకు 2డీ ఈకో పరీక్ష నిర్వహించగా క్రానిక్ రుమాటిక్ హార్ట్ డిసీజ్‌తో పాటు తీవ్రమైన మైట్రల్ స్టెనోసిస్ ఉన్నట్లు తేలిందని చెప్పారు. ఇతర గుండె వాల్వులపై స్వల్ప ప్రభావం, పల్మనరీ ఆర్టీరియల్ హైపర్‌టెన్షన్ కూడా గుర్తించారు. తల్లి ఆరోగ్యాన్ని కాపాడుతూ, శిశువు అభివృద్ధి మెరుగుపడేలా గర్భధారణను 31 వారాల నుంచి దాదాపు 35 వారాల వరకు జాగ్రత్తగా కొనసాగించారు. శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయ్యింది. శిశువు ముందస్తు జననం అయినా పుట్టగానే ఏడ్చింది. 4-5 రోజులు ఎన్‌ఐసీయూలో పర్యవేక్షణ అనంతరం ఆరోగ్యంగా డిశ్చార్జ్ చేసినట్లు చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మున్సిపల్ ఎన్నికల్లో ఉద్రిక్తతలు.. పలు పోలింగ్ కేంద్రాల్లో ఘర్షణలు
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీ విభజన
Read Latest Telangana News And AP News And Telugu News